Driving score based insurance premium: ఇప్పటి వరకు కారు లేదా బైక్ ఇన్సూరెన్స్ ప్రీమియం అంటే వాహనం మోడల్, ఇంజిన్ సామర్థ్యం, తయారీ సంవత్సరం, రిజిస్ట్రేషన్ ప్రాంతం వంటి అంశాలే కీలకం. కానీ ఇప్పుడు ఆ లెక్కలు మారిపోతున్నాయి. ఇకపై మీరు ఎంత సేఫ్‌గా డ్రైవింగ్ చేస్తున్నారన్న విషయమే మీ ఇన్సూరెన్స్ ప్రీమియాన్ని నిర్ణయించే రోజులు దగ్గర్లోనే ఉన్నాయి. టెలిమాటిక్స్ టెక్నాలజీతో ఇన్సూరెన్స్ రంగం పూర్తిగా కొత్త దిశగా అడుగులు వేస్తోంది. ఒకే మోడల్ కారు ఉన్న ఇద్దరు వ్యక్తుల్లో ఒకరు రాష్‌గా, మరొకరికి జాగ్రత్తగా డ్రైవ్‌ చేసే అలవాటు ఉండొచ్చు. అయినా, ఇప్పటి వరకు, ఆ ఇద్దరికీ దాదాపు ఒకే విధమైన ప్రీమియం ఉండేది. ఈ అసమానతకు చెక్ పెడుతూ ‘యూసేజ్‌ బేస్డ్‌ ప్రైసింగ్‌’ (Usage Based Pricing) & ‘బిహేవియర్‌ లింక్డ్‌ ఇన్సూరెన్స్‌’ (Behaviour Linked Insurance) ఆప్షన్లు ఇప్పుడు వెలుగులోకి వచ్చాయి.

టెలికమ్యూనికేషన్స్‌ & ఇన్ఫర్మేటిక్స్‌ కలయికే టెలిమాటిక్స్. పాలసీ తీసుకున్న తర్వాత, సంబంధిత వాహనంలో ప్రత్యేక పరికరాన్ని అమర్చడం లేదా ఇన్సూరెన్స్ కంపెనీ మొబైల్ యాప్‌ను డ్రైవ్‌ చేసే వ్యక్తి ఉపయోగించడం ద్వారా డ్రైవింగ్ అలవాట్లను నిరంతరం విశ్లేషిస్తారు. ఆ వాహనం ఎంత స్పీడ్‌తో వెళ్తోంది, తరచూ సడన్ బ్రేకింగ్ చేస్తున్నారా, ఒక్కసారిగా వేగం పెంచుతున్నారా, డ్రైవింగ్ చేస్తూ మొబైల్ ఉపయోగిస్తున్నారా వంటి అంశాలన్నింటినీ GPS సహాయంతో ఈ సిస్టమ్ రికార్డ్ చేస్తుంది.

ఈ డేటాను AI విశ్లేషించి ప్రతి డ్రైవర్‌కు 1 నుంచి 100 వరకు డ్రైవింగ్ స్కోర్ ఇస్తుంది. స్కోర్ ఎంత ఎక్కువగా ఉంటే అంత బాధ్యతాయుతమైన డ్రైవర్‌గా గుర్తింపు లభిస్తుంది. అదే భవిష్యత్తులో ఇన్సూరెన్స్ ప్రీమియంపై కూడా ప్రభావం చూపుతుంది.

ఇది కూడా చదవండి: 900 కి.మీ కంటే ఎక్కువ రేంజ్ ఇవ్వనున్న BYD కొత్త EV.. లగ్జరీ ఫీచర్లు చూస్తే షాక్

జునో జనరల్ ఇన్సూరెన్స్ విడుదల చేసిన ఇండియా రోడ్ సేఫ్టీ రిపోర్ట్ 2026 ప్రకారం, మన దేశంలోని 17 రాష్ట్రాల్లో 45 లక్షలకుపైగా ప్రయాణాలను విశ్లేషించారు. ఈ అధ్యయనంలో వయసు లేదా ప్రాంతం కంటే డ్రైవింగ్ అలవాట్లే ప్రమాదాలకు ప్రధాన కారణమని తేలింది. అంటే బాధ్యతాయుతంగా డ్రైవింగ్ చేసే వారికి ప్రమాదాల అవకాశాలు తక్కువగా ఉంటాయని స్పష్టమైంది.

ఇప్పటికే IRDAI కూడా Sandbox విధానంలో యూసేజ్‌ బేస్డ్‌ ప్రైసింగ్‌ & బిహేవియర్‌ లింక్డ్‌ ఇన్సూరెన్స్‌ మోడళ్లకు అనుమతులు ఇచ్చింది. దీంతో త్వరలోనే మరిన్ని ఇన్సూరెన్స్ కంపెనీలు ఈ స్మార్ట్ విధానాన్ని అందుబాటులోకి తీసుకురానున్నాయి.

రెండు రకాల ప్లాన్లువాహనాన్ని చాలా తక్కువగా ఉపయోగించేవారికి 'పే యాజ్‌ యు డ్రైవ్‌' (Pay As You Drive) ప్లాన్ బాగా ఉపయోగపడుతుంది. అంటే, ఏడాదికి ఎంత దూరం ప్రయాణిస్తారో అంచనా వేసుకుని పాలసీ తీసుకునే సమయంలో దీనిని ఎంచుకోవచ్చు. ఉదాహరణకు ఏడాదికి 20,000km లేదా 50000km వంటి స్లాబ్‌ను ఎంచుకోవచ్చు. తక్కువ దూరం తిరిగేవాళ్లకు ప్రీమియంలో తగ్గింపు లభించే అవకాశం ఉంటుంది. పరిమితి దాటితే అదనపు టాపప్ కూడా కొనుగోలు చేయవచ్చు.

సంవత్సరంలో ఎక్కువ దూరం తిరిగినప్పటికీ, క్రమశిక్షణతో డ్రైవింగ్ చేసేవారికి 'పే యాజ్‌ యు డ్రైవ్‌' (Pay How You Drive) మరింత ప్రయోజనకరం. బాధ్యతాయుతమైన డ్రైవింగ్‌తో మంచి స్కోర్‌ వస్తుంది, చక్కటి డ్రైవింగ్ స్కోర్‌తో పాలసీ రెన్యువల్ సమయంలో ప్రీమియంపై క్యాష్‌బ్యాక్ లేదా ప్రత్యేక డిస్కౌంట్లు అందే అవకాశం ఉంటుంది.

ఇది కూడా చదవండి: 5 స్టార్ భద్రత నుంచి అద్భుతమైన మైలేజ్ వరకు - Maruti Dzireలో ప్లస్‌లే కాదు, మైనస్‌లూ ఉన్నాయి!

ఇతర ప్రయోజనాలు కూడా...టెలిమాటిక్స్ వల్ల ఇన్సూరెన్స్ ప్రీమియం తగ్గడమే కాదు. వాహనం చోరీకి గురైతే GPS ద్వారా లైవ్ లొకేషన్‌ను గుర్తించవచ్చు. ఒకవేళ ఏదైనా ప్రమాదం జరిగితే వెంటనే ఇన్సూరెన్స్ కంపెనీకి సమాచారం చేరుతుంది. ప్రమాదం ఎలా జరిగింది, ఆ సమయంలో వాహనం స్పీడ్‌ ఎంత అనే వివరాలు అందుబాటులో ఉండటంతో క్లెయిమ్ ప్రక్రియ కూడా వేగంగా పూర్తవుతుంది. అంతేకాదు, క్రమశిక్షణతో డ్రైవింగ్ చేయడం వల్ల ఇంధన ఆదా కూడా పెరుగుతుంది.

అంతర్జాతీయంగా టెలిమాటిక్స్ ఇన్సూరెన్స్ అమలు చేస్తున్న దేశాల్లో రోడ్డు ప్రమాదాలు 20 నుంచి 40 శాతం వరకు తగ్గినట్లు కొన్ని అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. కాబట్టి, ఇకపై వెహికల్ ఇన్సూరెన్స్ తీసుకునే ముందు ప్రీమియం మాత్రమే కాకుండా టెలిమాటిక్స్ సదుపాయం ఉందా లేదా అనేది కూడా తప్పకుండా చెక్ చేయడం మంచిది. సేఫ్ డ్రైవింగ్ మీ ప్రాణాలను కాపాడటమే కాదు, మీకు డబ్బు కూడా ఆదా చేస్తుంది.

ఇంకా ఇలాంటి ఆటోమొబైల్‌ వార్తలు & అప్‌డేట్స్‌ - "ABP దేశం" 'ఆటో' సెక్షన్‌ని ఫాలో అవ్వండి.