Driverless car unveiled: భారతీయ రోడ్ల సవాళ్లను ఎదుర్కొనేలా రూపొందించిన డ్రైవర్‌లెస్ కార్‌ను విప్రో, ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ (IISc), ఆర్‌వీ కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ (RVCE) కలిసి తయారు చేశారు. 'విరిన్' (Wipro-IISc Research and Innovation Network - WIRIN) పేరుతో ఈ వాహనాన్ని అక్టోబర్ 27న RVCE క్యాంపస్‌లో పరిచయం చేశారు. ఈ ఆవిష్కరణ ఆరు సంవత్సరాల కృషి ఫలితం. గంతలు, పశువులు, ట్రాఫిక్ రద్దీ వంటి భారతీయ రోడ్ల సమస్యలకు అనుగుణంగా రూపొందించిన ఈ కార్, AI, మెషిన్ లెర్నింగ్ ఆధారంగా పనిచేస్తుంది. RVCE క్యాంపస్‌లో జరిగిన పరిచయ కార్యక్రమానికి విప్రో ఆటోనమస్ సిస్టమ్స్ అండ్ రోబోటిక్స్ గ్లోబల్ హెడ్ రామచంద్ర బుధిహల్, రాష్ట్రీయ శిక్షణ సమితి ట్రస్ట్ (RSST) అధ్యక్షుడు ఎంపీ శ్యామ్, RVCE ప్రిన్సిపల్ కెఎన్ సుబ్రమణ్యలు పాల్గొన్నారు. RVCE ఫ్యాకల్టీలు ఉత్తరా కుమారి, రజా విద్య నేతృత్వంలో ఫ్యాకల్టీలు, విద్యార్థులు కలిసి ఆరు సంవత్సరాలుగా ఈ ప్రాజెక్ట్‌ను అభివృద్ధి చేశారు. ఈ కార్‌లో ఉత్తరాడి మఠాధిపతి కూర్చుని ప్రయాణించిన 28 సెకన్ల వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
2019లో IISc, విప్రో మధ్య మొదలైన ఈ సహకారం, RVCEతో కలిసి WIRIN సెంటర్ ఆఫ్ ఎక్సెలెన్స్‌గా మారింది. ఆటోనమస్ సిస్టమ్స్, రోబోటిక్స్, 5G టెక్నాలజీలపై రీసెర్చ్ చేస్తున్నారు. విప్రో మునుపటి అనుభవాలు – కాగ్నిటివ్ నావిగేషన్, 5G-ఆధారిత V2X (వెహికల్-టు-ఎవరీథింగ్) కమ్యూనికేషన్ – ఈ ప్రాజెక్ట్‌కు బలం చేకూర్చాయి.
టెక్నాలజీ ఫీచర్లు: భారతీయ రోడ్ల సవాళ్లకు సమాధానం- స్వయం నావిగేషన్ : AI, మెషిన్ లెర్నింగ్, విజువల్ కంప్యూటింగ్ ఆధారంగా పనిచేస్తుంది.- హ్యూమన్-కంప్యూటర్ ఇంటరాక్షన్ (HCI) : డ్రైవర్ లేకుండా మానవులతో సమన్వయం.- V2X కమ్యూనికేషన్: 5G ద్వారా ఇతర వాహనాలు, ట్రాఫిక్ సిగ్నల్స్‌తో కనెక్ట్ అవుతుంది.- భారతీయ రోడ్లకు స్పెషల్ డిజైన్ : గుంతలు, పశువులు, ట్రాఫిక్‌ను గుర్తించి, సురక్షితంగా నావిగేట్ చేస్తుంది.
ఈ టెక్నాలజీలు ఇండస్ట్రీ అప్లికేషన్లకు ఉపయోగపడతాయని, IISc రీసెర్చ్ సామర్థ్యాన్ని పెంచుతాయని అధికారులు తెలిపారు.
WIRIN ప్రాజెక్ట్ ద్వారా ఆటోనమస్ వెహికల్స్, రోబోటిక్స్, 5Gపై మరిన్ని రీసెర్చ్‌లు కొనసాగుతాయి. భారతదేశంలో డ్రైవర్‌లెస్ టెక్నాలజీని అందుబాటులోకి తేవడానికి ఈ ప్రోటోటైప్ మైలురాయిగా మారింది.