Diwali 2025 Discounts For Cars: భారతదేశంలో, దసరా & దీపావళి పండుగ సమయం ఎప్పుడూ పీక్ షాపింగ్ సీజన్. ఈ సమయంలో, అన్ని కంపెనీలతో పాటు, కారు కంపెనీలు & డీలర్లు కూడా కస్టమర్లను ఆకర్షించడానికి భారీ డిస్కౌంట్లు, ఎక్స్ఛేంజ్ బోనస్‌లు, సులభమైన రుణ పథకాలు & చాలా పండుగ ఆఫర్లు ప్రకటిస్తారు. అలాంటి టెమ్టింగ్ స్కీమ్‌లు చూసిన తర్వాత, చాలా మంది తొందరపడి నిర్ణయాలు తీసుకుంటారు & తర్వాత చింతిస్తారు. మీరు కూడా ఫెస్టివ్ సీజన్‌లో కారు కొనాలని ఆలోచిస్తుంటే, డిస్కౌంట్ లేదా ఇతర ఆఫర్లను చూసి మాత్రమే కారును ఎంచుకోకండి. మిస్ కాకుండా తెలుసుకోవాల్సిన మరికొన్ని విషయాలు కూడా ఉన్నాయి.
కారు కొనే ముందు 4 ముఖ్యమైన విషయాలు
ముందు మీ బడ్జెట్‌ను నిర్ణయించుకోండికారు కొనడానికి ముందు అతి ముఖ్యమైన దశ మీ బడ్జెట్‌ను స్పష్టంగా నిర్ణయించుకోవడం. చాలాసార్లు, ఆకర్షణీయమైన ఆఫర్‌లను చూసిన తర్వాత ప్రజలు తమ పరిమితి కంటే ఎక్కువ ఖర్చు చేస్తారు. తర్వాత పెద్ద మొత్తం EMI చెల్లించలేక ఇబ్బంది పడతారు. కారు ఆన్-రోడ్ ధర మాత్రమే కాకుండా... బీమా, ఇంధనం, సర్వీస్ & నిర్వహణ వంటి పునరావృత ఖర్చులను కూడా మీరు అర్ధం చేసుకోవాలి. పండుగ డిస్కౌంట్ల కారణంగా ప్రారంభ ధర ఖచ్చితంగా తగ్గవచ్చు, కానీ దీర్ఘకాలిక ఖర్చులు అలాగే ఉంటాయి. కాబట్టి, బడ్జెట్‌ను దృష్టిలో ఉంచుకుని నిర్ణయం తీసుకోండి.
మెరుగైన డీల్ పొందడానికి ఆఫర్లను ఎలా పోల్చాలి?పండుగ సీజన్‌లో, దాదాపు ప్రతి కారు కంపెనీ & డీలర్ వేర్వేరు స్కీములు అందిస్తారు. కొన్నిసార్లు క్యాష్ డిస్కౌంట్‌లను అందిస్తారు, మరికొన్నిసార్లు ఎక్స్ఛేంజ్ బోనస్‌లు లేదా సీట్ కవర్లు & ఇన్ఫోటైన్‌మెంట్ అప్‌గ్రేడ్‌లు వంటి ఉచిత ఉపకరణాలను అందిస్తారు. కొందరు డీలర్లు వారంటీ పొడిగింపును ఉచితంగా అందిస్తారు. ఈ పరిస్థితిలో మొదటి ఆఫర్ చూసిన వెంటనే డీల్ ఖరారు చేయడం తెలివైన పని కాదు. వేర్వేరు షోరూమ్‌లకు వెళ్లడం, సరిపోల్చుకోవడం, బేరం చేయడం & ఎక్కడ ఎక్కువ ప్రయోజనాలను పొందుతున్నారో అర్ధం చేసుకోవడం మంచిది. కొన్నిసార్లు, మీ నగరంలోని డీలర్ల కంటే సమీప నగరాల్లోని డీలర్లు మెరుగైన డిస్కౌంట్లు అందించవచ్చు.
భద్రత విషయంలో రాజీ పడకండిఇప్పటికీ చాలా మంది ప్రజలు కారు సేఫ్టీ ఫీచర్లపై శ్రద్ధ చూపడం లేదు, ఇది మీ కుటుంబానికి చాలా ముఖ్యమైన విషయం. కారు కొనుగోలు చేసేటప్పుడు, కనీసం డ్యూయల్ ఎయిర్‌బ్యాగులు, EBDతో కూడిన ABS & రియర్ పార్కింగ్ సెన్సార్ వంటి లక్షణాల కోసం చూడండి. గ్లోబల్ NCAP రేటింగ్‌పై కూడా దృష్టి పెట్టండి, ఇది కారు భద్రతకు నిజమైన కొలమానం. చాలా కంపెనీలు పండుగల సమయంలో స్పెషల్ ఎడిషన్ కార్లను కూడా విడుదల చేస్తాయి, ఇవి మెరుగైన డిజైన్ & ఇన్ఫోటైన్‌మెంట్‌ను కలిగి ఉండటమే కాకుండా మరిన్ని సేఫ్టీ ఫీచర్లతోనూ వస్తాయి.
లోన్ & EMI ఎంపికలను అర్థం చేసుకోవడం చాలా ముఖ్యంపండుగ సీజన్‌లో, బ్యాంకులు & నాన్-బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీలు (NBFCలు) కారు కంపెనీలతో కలిసి ఆకర్షణీయమైన రుణ పథకాలను తీసుకువస్తాయి. తక్కువ వడ్డీ రేట్లు, జీరో ప్రాసెసింగ్ ఫీజులు & ఫ్లెక్సిబుల్ EMI పథకాలు వంటివి ఆఫర్ చేస్తాయి. కొన్ని బ్యాంకులు క్యాష్‌బ్యాక్ ఆఫర్లు అందిస్తాయి. కాబట్టి, ఒకే ఆఫర్‌ను చూసి లోన్ తీసుకోవడం సరైన నిర్ణయం అవ్వదు. వివిధ బ్యాంకుల వడ్డీ రేట్లను పోల్చండి. ఎందుకంటే, కేవలం 0.5 శాతం తేడా కూడా దీర్ఘకాలంలో వేల రూపాయలు ఆదా చేస్తుంది. అంతేకాదు, మొదటి కొన్ని నెలలు EMIలను వాయిదా వేసే స్కీములను కూడా ఎంచుకోవద్దు, వీటివల్ల వడ్డీ భారం పెరుగుతుంది.