Types of car gearbox in India: భారత్‌లో కొత్త కారు కొనుగోలు చేసే సమయంలో చాలా మంది ఇంజిన్, మైలేజ్, ఫీచర్లపై దృష్టి పెడతారు. అయితే గేర్‌బాక్స్ ఎంపిక కూడా అంతే కీలకం. ప్రస్తుతం భారత మార్కెట్‌లో మాన్యువల్ నుంచి ఆధునిక ఆటోమేటిక్ వరకు అనేక రకాల గేర్‌బాక్స్‌లు అందుబాటులో ఉన్నాయి. మీ బడ్జెట్, డ్రైవింగ్ అలవాట్లు & అవసరాలను బట్టి సరైన గేర్‌బాక్స్‌ను ఎంచుకుంటే డ్రైవింగ్ అనుభవం మరింత మెరుగ్గా ఉంటుంది.
మాన్యువల్ ట్రాన్స్‌మిషన్ (MT)
భారత్‌లో ఇప్పటికీ అత్యంత ప్రజాదరణ పొందిన గేర్‌బాక్స్ మాన్యువల్ ట్రాన్స్‌మిషన్. ఇందులో డ్రైవర్ క్లచ్ పెడల్ నొక్కి గేర్ లీవర్ ద్వారా స్వయంగా గేర్ మార్చాలి. సాధారణంగా 5 స్పీడ్ లేదా 6 స్పీడ్ గేర్‌బాక్స్‌లు అందుబాటులో ఉంటాయి. తక్కువ ధర, మంచి మైలేజ్, నిర్వహణ ఖర్చు తక్కువగా ఉండటం వల్ల బడ్జెట్ కార్లలో ఎక్కువగా ఈ గేర్‌బాక్స్‌ను ఉపయోగిస్తారు. అయితే నగరాల్లో ట్రాఫిక్ ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో తరచూ క్లచ్ ఉపయోగించాల్సి రావడం కొంత ఇబ్బందిగా అనిపించవచ్చు.
ఆటోమేటెడ్ మాన్యువల్ ట్రాన్స్‌మిషన్ (AMT)
AMT అనేది సాధారణ మాన్యువల్ గేర్‌బాక్స్‌కే కంప్యూటర్ ఆధారిత క్లచ్ వ్యవస్థను జోడించిన సాంకేతికత. ఇందులో క్లచ్ పెడల్ ఉండదు. గేర్ మార్పులను సిస్టమ్ స్వయంగా నిర్వహిస్తుంది. తక్కువ ధరలో ఆటోమేటిక్ అనుభవం అందించడం దీని ప్రధాన ప్రత్యేకత. మారుతి సుజుకి, హ్యుందాయ్, టాటా వంటి కంపెనీల ఎంట్రీ లెవల్ కార్లలో ఇది ఎక్కువగా కనిపిస్తుంది. అయితే గేర్ మారే సమయంలో స్వల్పంగా జర్క్ అనిపించడం దీని లోపంగా చెప్పవచ్చు.
ఇది కూడా చదవండి: పాత వాహనాల ఓనర్లకు షాక్ - ప్యూర్ పెట్రోల్, E10 ఆప్షన్లు లేవు, E20 మాత్రమే ఉంటుందన్న కేంద్రం
కంటిన్యూయస్‌లీ వేరియబుల్ ట్రాన్స్‌మిషన్ (CVT)
CVT గేర్‌బాక్స్‌లో సాధారణ గేర్‌లు ఉండవు. బెల్ట్ & పుల్లీ వ్యవస్థ ద్వారా శక్తి చక్రాలకు చేరుతుంది. దీనివల్ల, గేర్ మార్పులు కారులో ఉన్న వాళ్లు గుర్తించలేనంత సాఫీగా ఉంటాయి. నగర ట్రాఫిక్‌లో తరచూ బ్రేక్ & యాక్సిలరేటర్ ఉపయోగించే వారికి ఇది చాలా అనువైన ఎంపిక. ఇంధన సామర్థ్యం కూడా మెరుగ్గా ఉంటుంది. హోండా సిటీ వంటి కార్లలో ఈ గేర్‌బాక్స్ అందుబాటులో ఉంటుంది.
టార్క్ కన్వర్టర్ ఆటోమేటిక్ (TC)
టార్క్ కన్వర్టర్ గేర్‌బాక్స్‌లో ద్రవ ఆధారిత వ్యవస్థ ద్వారా ఇంజిన్ శక్తి చక్రాలకు చేరుతుంది. దీంతో గేర్ మార్పులు చాలా మృదువుగా ఉంటాయి. ఎక్కువ కాలం మన్నిక, విశ్వసనీయ పనితీరు & ట్రాఫిక్ పరిస్థితుల్లో సౌకర్యవంతమైన డ్రైవింగ్ కారణంగా ఈ గేర్‌బాక్స్‌కు మంచి డిమాండ్ ఉంది. ముఖ్యంగా నగరాల్లో ప్రతిరోజూ డ్రైవ్ చేసే వారికి ఇది మంచి ఎంపికగా భావిస్తారు.
ఇది కూడా చదవండి: ఇప్పటివరకు భారత్ NCAP క్రాష్ టెస్ట్‌కు వెళ్లిన 31 కార్లు - ఏవి 5 స్టార్, ఏవి 4 స్టార్ సాధించాయి?
డ్యూయల్ క్లచ్ ట్రాన్స్‌మిషన్ (DCT లేదా DSG)
ఆధునిక సాంకేతికతతో రూపొందిన DCT గేర్‌బాక్స్‌లో రెండు క్లచ్‌లు ఉంటాయి. ఒకటి ప్రస్తుత గేర్‌ను నిర్వహిస్తే, మరొకటి తదుపరి గేర్‌ను ముందుగానే సిద్ధంగా ఉంచుతుంది. దీంతో గేర్ మార్పులు అత్యంత వేగంగా జరుగుతాయి. టర్బో పెట్రోల్ & ప్రీమియం కార్లలో ఈ గేర్‌బాక్స్ ఎక్కువగా కనిపిస్తుంది. కియా సోనెట్ DCT, వోక్స్‌వ్యాగన్ వర్చుస్ DSG వంటి మోడళ్లు ఇందుకు ఉదాహరణలు. వేగవంతమైన పనితీరు కోరుకునే వారికి ఇది ఉత్తమ ఎంపికగా చెప్పవచ్చు.
ఏ గేర్‌బాక్స్ ఎవరికి సరిపోతుంది?
తక్కువ బడ్జెట్, తక్కువ నిర్వహణ ఖర్చు కోరుకునే వారికి మాన్యువల్ గేర్‌బాక్స్ ఉత్తమం. నగర ట్రాఫిక్‌లో క్లచ్ ఇబ్బంది లేకుండా డ్రైవ్ చేయాలనుకుంటే AMT మంచి ఎంపిక. అత్యంత సాఫీగా సాగే డ్రైవింగ్ అనుభవం కోసం CVT అనుకూలంగా ఉంటుంది. మన్నిక & సౌకర్యాన్ని కోరుకునేవారికి టార్క్ కన్వర్టర్ సరైనది. స్పోర్టీ పనితీరు, వేగవంతమైన గేర్ మార్పులు కోరుకునే వారికి DCT లేదా DSG గేర్‌బాక్స్ అత్యుత్తమ ఎంపికగా చెప్పవచ్చు. వీటిలో, మాన్యువల్ తప్ప మిగిలిన ట్రాన్స్‌మిషన్ల నిర్వహణ ఖర్చులు ఎక్కువగా ఉంటాయి.
ఇంకా ఇలాంటి ఆటోమొబైల్ వార్తలు & అప్‌డేట్స్ - "ABP దేశం" 'ఆటో' సెక్షన్‌ని ఫాలో అవ్వండి.
