Missing Inter Girls Missing Case | హైదరాబాద్: కుషాయిగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో ఇద్దరు మైనర్ బాలికల మిస్సింగ్ కేసు సుఖాంతం అయింది. దాదాపు 10 రోజులపాటు శ్రమించిన పోలీసులు నిందితుడ్ని అరెస్ట్ చేశారు. నిందితుడిపై పోక్సో (POCSO) చట్టం కింద కేసు నమోదై రిమాండ్‌కు తరలించారు.
కాలేజీకి వెళ్లిన విద్యార్థిని మిస్సింగ్..
కుషాయిగూడ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఈ ఏడాది జూలై 1వ తేదీన ఉదయం కాలేజీకి వెళ్లిన ఇంటర్మీడియట్ సెకండియర్ చదువుతున్న ఒక విద్యార్థిని క్లాసులకు హాజరు కాలేదని యాజమాన్యం కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చింది. దీంతో ఆందోళన చెందిన తల్లిదండ్రులు కళాశాల పరిసర ప్రాంతాల్లో, స్నేహితుల వద్ద వెతికినా ఫలితం లేకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు.
అదేరోజు మరో బాలిక, యువకుడు మిస్సింగ్..
కుటుంబ సభ్యులు తమ బంధువుల ఇళ్లలో ఆరా తీయగా, అదేరోజు వారి బంధువైన మరొక బాలిక కూడా ఇల్లు వదిలి వెళ్లిపోయినట్లు తెలిసి షాకయ్యారు. అదే సమయంలో వారికి బంధువైన అజయ్ ఉప్పాల (24) అనే యువకుడు కూడా డ్యూటీకి వెళ్లిన తర్వాత తిరిగి రాకపోవడం, అతడి మొబైల్ ఫోన్ స్విచ్ ఆఫ్ చేసినట్లు గ్రహించారు. అంతేకాకుండా, కుషాయిగూడలోని ఒక జూనియర్ కాలేజీ వెనుక అజయ్ బైక్ పార్క్ చేసి ఉండటాన్ని గుర్తించిన కుటుంబ సభ్యులు, ఆ ఇద్దరు బాలికలను అజయ్ తీసుకువెళ్లి ఉండవచ్చని అనుమానం వ్యక్తం చేశారు. బాధితుల ఫిర్యాదు మేరకు కుషాయిగూడ పోలీసులు క్రైమ్ నెం. 493/2026, సెక్షన్ 137(2) BNS కింద కేసు నమోదు చేశారు.
Also Read: Hyderabad Crime News: హైదరాబాద్‌లోని వనస్థలిపురంలో వ్యక్తి దారుణహత్య కలకలం!
కేసును వేగంగా దర్యాప్తు చేసిన కుషాయిగూడ పోలీసులు, సాంకేతిక పరిజ్ఞానం సాయంతో నిందితుడి మొబైల్ ఫోన్ లొకేషన్ ఆధారంగా వారి ఆచూకీని కనుగొన్నారు. రక్షించిన ఇద్దరు మైనర్ బాలికల నుంచి వివరాలు సేకరించి, వారి స్టేట్‌మెంట్స్ ఆధారంగా కేసును పోక్సో (POCSO) చట్టం కిందకు మార్చారు. మైనర్ బాలికలను ప్రలోభపెట్టి తీసుకువెళ్లిన నిందితుడు అజయ్ ఉప్పాలను పోలీసులు అరెస్ట్ చేసి, కోర్టు ముందు హాజరుపరిచారు. కోర్టు తీర్పుతో నిందితుడ్ని రిమాండ్‌కు తరలించారు.
