Delhi Gets Indias Second Barrierless Toll Plaza: దేశంలోని హైవేలపై ప్రయాణించే వారికి ఇది నిజంగా శుభవార్త. టోల్ ప్లాజాల వద్ద బారులు తీరే వాహనాలు, ట్రాఫిక్ జామ్ లకు చెక్ పెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం మల్టీ-లేన్ ఫ్రీ ఫ్లో (MLFF) టెక్నాలజీని వేగంగా విస్తరిస్తోంది. ఢిల్లీలోని అర్బన్ ఎక్స్‌టెన్షన్ రోడ్-II (UER-II) పై ఈ సరికొత్త బారియర్ లెస్ టోల్ ప్లాజాను కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ ప్రారంభించారు. ముండ్కా-బక్కర్వాలా వద్ద ఉన్న ఈ టోల్ ప్లాజా ఇప్పుడు దేశంలోనే రెండో బారియర్ లెస్ టోల్ గా రికార్డు సృష్టించింది.
ఏమిటీ బారియర్ లెస్ టోలింగ్?సాధారణంగా టోల్ ప్లాజాల వద్ద వాహనాలు ఆగినప్పుడు బారియర్లు పైకి లేస్తాయి. కానీ ఈ కొత్త టెక్నాలజీలో అసలు భౌతికమైన బారియర్లు ఉండవు. రోడ్డుపై ఏర్పాటు చేసిన ఓవర్‌హెడ్ ఫ్రేమ్స్‌కు అత్యాధునిక సెన్సార్లు, కెమెరాలు అమర్చి ఉంటాయి. వాహనం ఆ పాయింట్ దాటుతున్నప్పుడు ఈ సెన్సార్లు ఫాస్టాగ్ ను రీడ్ చేసి, కెమెరాలు నంబర్ ప్లేట్ ను రికార్డ్ చేస్తాయి. తద్వారా వెహికల్ వేగంగా వెళ్తున్నప్పుడే టోల్ అమౌంట్ ఆటోమేటిక్ గా కట్ అవుతుంది. దీనివల్ల డ్రైవర్లు కారును ఆపాల్సిన అవసరం గానీ, వేగం తగ్గించాల్సిన అవసరం గానీ ఉండదు.
72 గంటల్లోపు చెల్లిస్తేనే ఊరట..ఈ సిస్టమ్ లో ఒక ముఖ్యమైన నిబంధన ఉంది. టోల్ పాయింట్ దాటిన తర్వాత మీకు మొబైల్ కు ఈ-నోటీస్ వస్తుంది. ఒకవేళ ఫాస్టాగ్ లో బ్యాలెన్స్ లేకపోయినా లేదా ఏదైనా సాంకేతిక సమస్య వచ్చినా, నోటీస్ వచ్చిన 72 గంటల్లోపు టోల్ ఫీజు చెల్లించాలి. నిర్ణీత సమయం దాటితే మాత్రం డబుల్ టోల్ ఛార్జీ (2x) చెల్లించాల్సి ఉంటుంది. ఎన్ హెచ్ఏఐ (NHAI) నిబంధనల ప్రకారం పెనాల్టీ నుంచి తప్పించుకోవాలంటే 72 గంటల డెడ్ లైన్ ను గుర్తుంచుకోవడం చాలా ముఖ్యం.
రానున్న రోజుల్లో మరిన్ని టోల్ ప్లాజాలు..కేంద్ర ప్రభుత్వం ఈ విధానాన్ని దేశవ్యాప్తంగా అమలు చేసేందుకు సిద్ధమవుతోంది. సెప్టెంబర్ 2026 నాటికి గుజరాత్, ఢిల్లీ, హర్యానా, రాజస్థాన్, తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్ర, అస్సాం రాష్ట్రాల్లోని 17 టోల్ ప్లాజాలను ఈ టెక్నాలజీలోకి మార్చనున్నారు. దీనివల్ల ప్రయాణం మరింత సులభతరం అవుతుంది. మార్చి 2027 నాటికి రెండో దశలో మరో 108 కంటే ఎక్కువ టోల్ ప్లాజాలను అప్‌గ్రేడ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు.
జాగ్రత్తలు ఇవే..బారియర్ లెస్ టోల్ రోడ్లపై ప్రయాణించేటప్పుడు డబుల్ ఛార్జీల బారిన పడకుండా ఉండాలంటే కొన్ని విషయాలు పాటించాలి. ముందుగా మీ ఫాస్టాగ్ ఎప్పుడూ యాక్టివ్ గా ఉండేలా చూసుకోవాలి. వాలెట్ లో తగినంత బ్యాలెన్స్ ఉంచుకోవడం తప్పనిసరి. అలాగే వాహనానికి హై సెక్యూరిటీ రిజిస్ట్రేషన్ ప్లేట్ (HSRP) ఉండాలి. రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ కు వచ్చే మెసేజ్ లను ఎప్పటికప్పుడు చెక్ చేసుకుంటే ఎటువంటి పెనాల్టీలు పడకుండా హాయిగా ప్రయాణించవచ్చు. టెక్నాలజీ పెరుగుతున్న కొద్దీ రోడ్లపై ప్రయాణం కూడా డిజిటల్ మయం అవుతోంది అనడానికి ఈ బారియర్ లెస్ టోల్ ప్లాజాలే నిదర్శనం.
