Electric Car Battery Tips | ప్రస్తుతం ఎలక్ట్రిక్ కార్ల వాడకం భారత్‌లోనూ వేగంగా పెరుగుతోంది. పెట్రోల్, డీజిల్ ధరల నుండి ఉపశమనం కోసం, తక్కువ ఖర్చుతో ప్రయాణించడానికి EVలను కొనుగోలు చేస్తున్నారు. కొన్ని రాష్ట్రాల్లో అక్కడి ప్రభుత్వాలు ఈవీలపై రాయితీలు ఇస్తున్నాయి. అయితే చాలా మంది మనసులో ఒక ప్రశ్న ఖచ్చితంగా మెదలుతుంది. ఒకవేళ ఎలక్ట్రిక్ కార్ బ్యాటరీ పూర్తిగా అయిపోయి మీ డిస్‌ప్లేపై 0 శాతం అని కనిపిస్తే ఏం జరుగుతుంది? కారు వెంటనే ఆగిపోతుందా లేక కొంత దూరం వరకు వెళ్తుందా అని సందేహాలు ఉంటాయి. బ్యాటరీ అయిపోయే సమయంలో ఉపయోగపడే ఒక ప్రత్యేక ఫీచర్ గురించి వివరాలు ఇక్కడ అందిస్తున్నాం. దానినే టర్టిల్ మోడ్ (Turtle Mode) అని అంటారు. ఎలక్ట్రిక్ కార్లు అకస్మాత్తుగా ఆగిపోకుండా ఈ ఫీచర్ వాహనదారులకు హెల్ప్ చేస్తుంది. 

Continues below advertisement

ఎలక్ట్రిక్ కార్ బ్యాటరీ చాలా తక్కువగా ఉన్నప్పుడు, మొదట కారు డ్రైవర్‌కు రెగ్యూలర్‌గా వార్నింగ్ ఇస్తుంది. స్క్రీన్‌పై 'Low Battery' మెసేజ్ రావడంతో పాటు, పలు కార్లలో అలర్ట్ సౌండ్ కూడా వినిపిస్తుంది. సాధారణంగా 15 నుంచి 20 శాతం బ్యాటరీ మిగిలి ఉన్నప్పుడు, కారు దగ్గరలోని ఛార్జింగ్ స్టేషన్‌ను చూసుకోవాలిన డ్రైవర్‌కు సూచిస్తుంది. బ్యాటరీ ఇంకా తగ్గుతున్న కొద్దీ, కారు తన పవర్‌ను ఆదా చేసుకోవడానికి కొన్ని ఫీచర్లను లిమిట్ చేయడం ప్రారంభిస్తుంది.

టర్టిల్ మోడ్ ఎలా పనిచేస్తుంది?బ్యాటరీ అత్యంత తక్కువ స్థాయికి చేరుకున్నప్పుడు, EV టర్టిల్ మోడ్‌ (Turtle Mode) లోకి వెళ్తుంది. ఈ సమయంలో చాలా కార్ల స్క్రీన్‌లపై తాబేలు గుర్తు కనిపిస్తుంది. కనుక దీనికి టర్టిల్ పేరు వచ్చింది. ఈ మోడ్‌లో కారు వేగం, పవర్ ఒక్కసారిగా తగ్గుతాయి. దాంతో మిగిలి ఉన్న బ్యాటరీ ఎక్కువ సేపు వస్తుంది. కారు కొంచెం స్లోగా వెళ్తుంది. యాక్సిలరేషన్ కూడా చాలా తగ్గిపోతుంది. పలు  సందర్భాల్లో AC, క్లైమేట్ కంట్రోల్, ఇతర అనవసరమైన ఫీచర్లు ఆగిపోతాయి లేదా కంట్రోల్ అవుతాయి.  డ్రైవర్ ఏదైనా సురక్షిత ప్రాంతానికి లేదా దగ్గరలోని ఛార్జింగ్ స్టేషన్‌కు చేరుకోవాలని సూచించడమే దీని ఉద్దేశ్యం.

Continues below advertisement

బ్యాటరీ అయిపోతే EV ఎలా నడుస్తుంది.. ఆసక్తికరమైన విషయం ఏంటంటే, చాలా ఎలక్ట్రిక్ కార్లలో బ్యాటరీ 0 శాతం అని కనిపించిన తర్వాత కూడా కొద్దిపాటి బ్యాటరీ రిజర్వ్‌లో ఉంటుంది. బ్యాటరీ పూర్తిగా డిశ్చార్జ్ కాకుండా కాపాడటానికి కంపెనీలు ఒక హిడెన్ బఫర్ (Hidden Buffer)ను ఉంచుతాయి. దీనివల్ల కొన్ని EVలు 0 శాతం ఇండికేట్ చేసిన తర్వాత కూడా కొన్ని కిలోమీటర్ల వరకు వెళ్తాయి. అయితే ఈ దూరం కారు, వాతావరణం, వేగం, రోడ్డు కండీషన్లపై ఆధారపడి ఉంటుంది. సాధారణంగా EVలు 5 నుండి 15 మైళ్లు, అంటే దాదాపు 8 నుండి 24 కిలోమీటర్ల వరకు ప్రయాణించగలవు.

ఒకవేళ డ్రైవర్ సరైన సమయంలో ఛార్జింగ్ స్టేషన్‌కు తీసుకెళ్లకపోతే, బ్యాటరీ పూర్తిగా అయిపోతే కారు క్రమంగా నిలిచిపోతుంది. ఆ తర్వాత కారు నడపలేరు. అయితే హజార్డ్ లైట్లు, డోర్ లాక్, స్క్రీన్ వంటి కొన్ని బేసిక్ సిస్టమ్స్ మాత్రం కొద్దిసేపు పనిచేస్తాయి. ఎందుకంటే అవి విడిగా ఉండే 12 వోల్ట్ బ్యాటరీతో పనిచేస్తాయి. 

అలాంటి పరిస్థితిలో కారును తప్పనిసరిగా ఛార్జింగ్ చేయాలి. కొన్నిసార్లు రోడ్‌సైడ్ అసిస్టెన్స్ సహాయం తీసుకోవాల్సి ఉంటుంది. గమనించాల్సిన మరో విషయం ఏమిటంటే, సాధారణ పెట్రోల్ లేదా డీజిల్ కార్ల మాదిరిగా EVలను నేరుగా టో (Tow) చేసి తీసుకెళ్లకూడదు. చాలా ఎలక్ట్రిక్ కార్లను ఫ్లాట్‌బెడ్ ట్రక్కుపైనే తీసుకెళ్లాలి. తప్పుడు పద్ధతిలో టో చేయడం వల్ల ఎలక్ట్రిక్ మోటారు దెబ్బతినే అవకాశం ఉంటుందని గుర్తుంచుకోవాలి.