Delhi EV policy 2.0: దేశ రాజధాని ఢిల్లీలో ఎలక్ట్రిక్ వాహనాల వినియోగాన్ని మరింత వేగవంతం చేసే దిశగా అక్కడి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. Delhi EV Policy 2026కు రాష్ట్ర మంత్రివర్గం అధికారిక ఆమోదం తెలిపింది. ఈ కొత్త పాలసీ జులై 1, 2026 నుంచి అమల్లోకి రానుండగా, మార్చి 31, 2030 వరకు అమలులో ఉంటుంది. ఈ పాలసీలో అత్యంత కీలకమైన నిర్ణయం ఏమిటంటే... 2028 ఏప్రిల్ 1 నుంచి ఢిల్లీలో కొత్తగా కేవలం ఎలక్ట్రిక్ టూవీలర్లకే రిజిస్ట్రేషన్లు మాత్రమే అనుమతిస్తారు. అంటే, ఆ తేదీ తర్వాత కొత్త పెట్రోల్ & డీజిల్ టూవీలర్ల రిజిస్ట్రేషన్‌కు అవకాశం ఉండదు.
ఎలక్ట్రిక్ వాహనాల కొనుగోలును ప్రోత్సహించేందుకు ఢిల్లీ ప్రభుత్వం ఆకర్షణీయమైన ప్రోత్సాహకాలను కూడా ప్రకటించింది. కొత్త ఎలక్ట్రిక్ టూవీలర్ కొనుగోలు చేసే వారికి గరిష్ఠంగా రూ.30,000 వరకు కొనుగోలు ప్రోత్సాహకం అందించనుంది. ఎలక్ట్రిక్ త్రీ వీలర్లకు రూ.50,000 వరకు & N1 గూడ్స్ వాహనాలకు రూ.1 లక్ష వరకు ప్రోత్సాహకం లభించనుంది. ఈ మొత్తాలను నేరుగా లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో జమ చేయనున్నట్లు ప్రభుత్వం తెలిపింది.
ఇది కూడా చదవండి: ఒకసారి ఛార్జ్ చేస్తే 500 కిలోమీటర్లకుపైనే! సరికొత్త మారుతి సుజుకి 7 సీటర్ ఈవీ ఫీచర్స్ ఇవే!
స్క్రాపేజ్ బెనిఫిట్ కూడా...కాలుష్యాన్ని తగ్గించే లక్ష్యంతో పాత వాహనాలను తొలగించి కొత్త ఎలక్ట్రిక్ వాహనాలను కొనుగోలు చేసే వారికి ప్రత్యేక స్క్రాపేజ్ ప్రోత్సాహకాలు కూడా అందించనున్నారు. వాహనం కేటగిరీని బట్టి రూ.5,000 నుంచి రూ.1 లక్ష వరకు స్క్రాపేజ్ బెనిఫిట్ ఇవ్వనున్నారు. దీంతో పాత కాలుష్యకారక వాహనాల స్థానంలో EVలను కొనుగోలు చేయడానికి వినియోగదారులకు మరింత ప్రోత్సాహం లభించనుంది.
ఈ పాలసీలో వాహనాల కేటగిరీల వారీగా ప్రత్యేక గడువులు కూడా నిర్ణయించారు. ఆటోరిక్షాలు & N1 గూడ్స్ వాహనాలకు మరింత ముందుగానే నిబంధనలు అమల్లోకి రానున్నాయి. 2027 జనవరి 1 నుంచి ఢిల్లీలో కొత్తగా నమోదయ్యే ఆటోరిక్షాలు & N1 గూడ్స్ వాహనాలు పూర్తిగా ఎలక్ట్రిక్ మోడళ్లే కావాలి. టూవీలర్లకు మాత్రం 2028 ఏప్రిల్ 1 నుంచి ఈ నిబంధన అమల్లోకి వస్తుంది.
EVల వినియోగం పెరిగే నేపథ్యంలో ఛార్జింగ్ సదుపాయాలను కూడా భారీగా విస్తరించేందుకు ప్రభుత్వం ప్రణాళిక సిద్ధం చేసింది. ఢిల్లీ వ్యాప్తంగా 30,000కు పైగా EV ఛార్జింగ్ పాయింట్లను ఏర్పాటు చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. దీనివల్ల వినియోగదారులు ఛార్జింగ్ సౌకర్యాలపై ఆందోళన చెందాల్సిన అవసరం లేకుండా EVలను సులభంగా ఉపయోగించే అవకాశం ఉంటుంది.
ఇది కూడా చదవండి: టీవీఎస్ ఆర్బిటర్ vs బజాజ్ చేతక్! బడ్జెట్ ఈవీ రేసులో ఏ స్కూటర్ కింగ్?
ఈ నిర్ణయం దేశ టూవీలర్ మార్కెట్‌పై కూడా ప్రభావం చూపే అవకాశం ఉందని మార్కెట్ నిపుణులు భావిస్తున్నారు. Crisil అంచనాల ప్రకారం ఢిల్లీలో ఈ పాలసీ అమలుతో FY29 నాటికి దేశవ్యాప్తంగా టూవీలర్ అమ్మకాలలో EVల వాటా 21 నుంచి 23 శాతానికి చేరుకునే అవకాశం ఉంది. ఈ పాలసీ లేకపోతే అది 18 నుంచి 20 శాతం మధ్యే ఉండేదని నివేదిక పేర్కొంది. అలాగే దేశవ్యాప్తంగా అదనంగా సుమారు 6 లక్షల ఎలక్ట్రిక్ టూవీలర్ల విక్రయాలకు ఈ నిర్ణయం దోహదపడే అవకాశం ఉందని విశ్లేషించింది.
ప్రస్తుతం ఢిల్లీలో నమోదైన మొత్తం వాహనాల్లో దాదాపు 67 శాతం టూవీలర్లే ఉన్నాయి. అందువల్ల ఈ నిర్ణయం దేశంలోనే అతి పెద్ద EV మార్పుల్లో ఒకటిగా నిలవనుంది. ఢిల్లీ తీసుకున్న ఈ అడుగును చూసి ఇతర రాష్ట్రాలు కూడా ఇలాంటి విధానాలను అమలు చేసే అవకాశాలు ఉన్నాయని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. దీంతో రాబోయే సంవత్సరాల్లో భారత ఆటోమొబైల్ రంగంలో ఎలక్ట్రిక్ వాహనాల ప్రాధాన్యం మరింత పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి.
ఇంకా ఇలాంటి ఆటోమొబైల్ వార్తలు & అప్‌డేట్స్ - "ABP దేశం" 'ఆటో' సెక్షన్‌ని ఫాలో అవ్వండి.
