సిట్రోయెన్ ఇండియా మనదేశంలో కొత్త బడ్జెట్ హ్యాచ్‌బ్యాక్ కారును లాంచ్ చేసింది. అదే సిట్రోయెన్ సీ3 షైన్. దీని ధర మనదేశంలో రూ.6.16 లక్షల (ఎక్స్-షోరూం) నుంచి ప్రారంభం కానుంది. ఇది లైవ్ ట్రిమ్ లెవల్ ధర. ఇక హైఎండ్ అయిన ఫీల్ ట్రిమ్ వేరియంట్ ధర రూ.8.92 లక్షలుగా ఉంది. టాటా పంచ్, మారుతి బ్రెజా, మారుతి బలెనో, మారుతి స్విఫ్ట్, నిస్సాన్ మ్యాగ్నైట్ వంటి కార్లతో సిట్రోయెన్ సీ3 షైన్ పోటీ పడనుంది.


గతేడాది మనదేశంలో లాంచ్ అయిన సిట్రోయెన్ సీ3ని కొంచెం అప్‌గ్రేడ్ చేసి సిట్రోయెన్ సీ3 షైన్‌గా లాంచ్ చేశారు. ఈ వేరియంట్‌లో ఎలక్ట్రికల్‌గా అడ్జస్ట్ చేసుకోగల ఓఆర్వీఎంలు, వెనకవైపు పార్కింగ్ కెమెరా, డే/నైట్ ఐఆర్వీఎం, 15 అంగుళాల డైమండ్ కట్ అలోయ్ వీల్స్, ఫాగ్ లైట్స్, వెనకవైపు వైపర్, వాషర్, స్కిడ్ ప్లేట్స్, డీఫాగర్ వంటి ఫీచర్లు ఉన్నాయి. దీంతోపాటు 35 స్మార్ట్ కనెక్టివిటీ ఫీచర్లు కూడా ఇందులో అందించారు.


సిట్రోయెన్ సీ3 హ్యాచ్‌బ్యాక్‌లో రెండు పెట్రోల్ ఇంజిన్ ఆప్షన్లు అందుబాటులో ఉన్నాయి. వీటిలో ఒకటి 1.2 లీటర్ నాచురల్లీ యాస్పిరేటెడ్ త్రీ-సిలిండర్ ఆప్షన్. ఇది 82 హెచ్‌పీ, 115 ఎన్ఎం టార్క్‌ను అందించనుంది. ఇక టర్బో చార్జ్‌డ్ 1.2 లీటర్ 3 సిలిండర్ ఇంజిన్ ఆప్షన్ కూడా ఉంది. ఈ ఇంజిన్ 110 హెచ్‌పీ, 190 ఎన్ఎం పీక్ టార్క్‌ను అందించనుంది. నాచురల్లీ యాస్పిరేటెడ్ ఇంజిన్‌లో 5-స్పీడ్ మాన్యువల్, టర్బోచార్జ్‌డ్ ఇంజిన్‌లో 6-స్పీడ్ మాన్యువల్ గేర్ బాక్స్‌లు ఉండనున్నాయి. 19.3 కిలోమీటర్ల మైలేజ్‌ను ఇవి అందించనున్నాయని తెలుస్తోంది.


 సిట్రోయెన్ కూడా తన ఎలక్ట్రిక్ కారు సిట్రోయెన్ ఈసీ3ని భారత దేశ మార్కెట్లో విడుదల చేసింది. ఇది రెండు ట్రిమ్‌లలో లాంచ్ అయింది. దేశీయ మార్చెట్లో ఈ ఎలక్ట్రిక్ కారు టాటా టియాగోతో పోటీపడనుంది.


కంపెనీ సిట్రోయెన్ ఈసీ3 కారును రూ.11.50 నుంచి రూ.12.43 లక్షల వరకు ఎక్స్-షోరూమ్ ధరతో మార్కెట్లో పరిచయం చేసింది. దాని పోటీదారు టాటా టియాగో ఎలక్ట్రిక్ కంటే సిట్రోయెన్ ఈసీ3 కారు ధర రూ. 1.31 లక్షలు ఎక్కువ కావడం విశేషం.


Citroën EC3 కారులో, కంపెనీ 29.2 kWh బ్యాటరీ ప్యాక్‌ను అందించింది. అలాగే ఇది 320 కిలో మీటర్ల రేంజ్‌ను అందించనుందని కంపెనీ ప్రకటించింది.. ఈ ఎలక్ట్రిక్ కారులో ఒకే ఎలక్ట్రిక్ మోటార్ అందించారు. ఇది కారు ముందు చక్రానికి గరిష్టంగా 57 PS పవర్, 143NM గరిష్ట టార్క్ ఇస్తుంది.


ఈ ఎలక్ట్రిక్ కారు టాప్ స్పీడ్ గంటకు 107 కిలో మీటర్లుగా ఉంది. ఇది కాకుండా ఛార్జింగ్ చేయడానికి రెండు ఛార్జింగ్ ఆప్షన్లు అందుబాటులో ఉన్నాయి. మొదటి 15A ఛార్జింగ్ సాకెట్ ద్వారా ఈ కారును పూర్తిగా ఛార్జ్ చేయడానికి 10 గంటల 30 నిమిషాలు పడుతుంది. రెండోది డీసీ ఫాస్ట్ ఛార్జర్. దీని ద్వారా ఈ కారు కేవలం 57 నిమిషాల్లోనే 10 నుంచి 80 శాతం వరకు ఛార్జ్ అవ్వగలదు.


Citroen EC3 కారులో అందించిన ఫీచర్ల గురించి చెప్పాలంటే ఇందులో మాన్యువల్ AC ఉండనుంది. డ్యూయల్ ఫ్రంట్ ఎయిర్‌బ్యాగ్‌లు, కీలెస్ ఎంట్రీ, ఎత్తు సర్దుబాటు చేయగల డ్రైవర్ సీటు, పవర్ విండోస్, ఆండ్రాయిడ్ ఆటో, Apple CarPlay ద్వారా కనెక్ట్ అయిన కార్ టెక్నాలజీ, 10 అంగుళాల టచ్‌స్క్రీన్ సిస్టమ్ వంటి ఫీచర్లను అందించారు.