సాధారణంగా విమానాలు గంటకు 740 నుంచి 930 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తాయి. అయితే చైనాకు చెందిన స్పేస్ ట్రాన్స్‌పొర్టేషన్ అనే కంపెనీ గంటలకు ఏడువేల కిలోమీటర్ల వేగంతో ప్రయాణించే హైపర్ సోనిక్ ప్లేన్‌ను రూపొందిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రపంచంలో ఎక్కడి నుంచి ఎక్కడికి అయినా కేవలం గంటలోనే ప్రయాణం చేయగలగడం ఈ ప్లేన్ స్పెషాలిటీ.


వెబ్‌సైట్ తెలుపుతున్న దాని ప్రకారం.. ఇందులో చిన్న పోడ్ ఉండనుంది. అవసరమైన ఎత్తుకు చేరాక పోడ్ డిటాచ్ అయిపోయి.. పైకి తీసుకెళ్లిన రాకెట్ భూమికి చేరుకుంటుంది. ఈ ప్లేన్‌ను కంపెనీ గత కొన్ని సంవత్సరాల నుంచి రూపొందిస్తుంది. 2025 నాటికి దీన్ని పూర్తి స్థాయిలో లాంచ్ చేసే అవకాశం ఉంది.


దీనికి సంబంధించిన యానిమేషన్ వీడియోలను కంపెనీ తన వెబ్‌సైట్‌లో ప్రదర్శించింది. ఈ వీడియోలో ఇన్ఫోగ్రాఫిక్ ప్రకారం.. గంటకు 6,400 కిలోమీటర్ల వేగంతో ఈ విమానం ప్రయాణిస్తుంది. దీనికి టియాక్సింగ్ I అని పేరు పెట్టారు. ‘దీని కోసం ఒక వింగ్డ్ రాకెట్‌ను కంపెనీ రూపొందిస్తుందని కంపెనీ తెలిపింది. శాటిలైట్లను మోసుకెళ్లే రాకెట్ల కంటే తక్కువ ధరకే దీన్ని రూపొందించవచ్చు. సాధారణ విమానం కంటే ఎంతో వేగంతో ఇది ప్రయాణిస్తుంది.’ అని కంపెనీ తన ప్రకటనలో తెలిపింది.


వినిపిస్తున్న కథనాల ప్రకారం.. దీనికి సంబంధించిన టెస్ట్ ఫ్లైట్లు వచ్చే సంవత్సరం గాల్లోకి ఎగరనున్నాయి. సిబ్బంది లేకుండా 2024లో, పూర్తి సిబ్బందితో 2025లో ఈ విమానం లాంచ్ కానుంది. దీనికి సంబంధించిన ఆర్బిటల్ వెర్షన్‌ను కూడా కంపెనీ 2030 లోపు లాంచ్ చేయనున్నట్లు ప్రకటించింది. అంటే అంతరిక్షంలోకి కూడా వెళ్లే అవకాశం ఉందన్న మాట.


ఈ స్పేస్ క్రాఫ్ట్ అయితే గంటకు 10 వేల కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుందని కంపెనీ తన వెబ్‌సైట్లో ప్రకటించింది. అయితే హైపర్ సోనిక్ ఎయిర్‌క్రాఫ్ట్‌ను కేవలం చైనా మాత్రమే రూపొందిండచం లేదు. అమెరికా ఎయిర్ ఫోర్స్ కూడా హెర్మియస్ అనే కంపెనీతో భాగస్వామ్యం ఏర్పరచుకుంది. ఈ భాగస్వామ్యం విలువ 60 మిలియన్ డాలర్లు. ప్రస్తుతం అందుబాటులో ఉన్న విమానాలకు ఇవి అప్‌గ్రేడెడ్ వెర్షన్లు అనుకోవచ్చు.