Car Care Tips in Summer: భారతదేశంలో శీతాకాలం మెల్లగా కనుమరుగు అవుతోంది. వేసవి వేడి ఊహించిన దానికంటే ముందే తాకడానికి సిద్ధం అయింది. వేసవి కాలంలో మనుషులు జాగ్రత్తగా ఉండాలి. అలాగే మీరు కారు ఉపయోగిస్తే దాన్ని కూడా జాగ్రత్తగా చూసుకోవాలి. అవసరమైన ఏసీ బాగుందా లేదా అనే దాంతో పాటు టైర్ ప్రెజర్ అడ్జస్ట్‌మెంట్లు, సేఫ్టీ చెకింగులు చేసుకుంటూ వేసవిలో కారుకు సంబంధించిన సమస్యలు తలెత్తకుండా చూసుకోవడం ముఖ్యం. వేసవిలో కారు ట్రబుల్ ఇవ్వకుండా ఉండాలంటే కొన్ని టిప్స్ ఫాలో అవ్వాలి. అవేంటో ఇప్పుడు చూద్దాం.
ఏసీని ఎప్పటికప్పుడు చెక్ చేయాలి
హైదరాబాద్ లాంటి మహానగరాల్లో ఉండేటప్పుడు కొన్నిసార్లు రోజులో ఎక్కువ సేపు ఇంట్లో కంటే ట్రాఫిక్‌లోనే గడపాల్సి వస్తుంది. ఒకవేళ ఏసీ పని చేయకపోతే కారులో కాదు కుంపట్లో ఉన్నట్లు ఉంటుంది. కాబట్టి ఏసీ సిస్టంను ఎప్పటికప్పుడు చెక్ చేయిస్తూ ఉండాలి. ఎటువంటి లీకులు లేకుండా చూసుకోవాలి. ఏసీ సిస్టంలో సమస్యలు లేకుండా చూసుకుంటే కారు లైఫ్ స్పాన్ కూడా పెరుగుతుందన్న విషయం గుర్తుంచుకోవాలి.
టైర్ ప్రెజర్ కూడా...
పెరుగుతున్న ఉష్ణోగ్రతలు టైర్ల ఒత్తిడిపై కూడా ప్రభావం చూపిస్తాయి. టైర్ ప్రెజర్ సరిగ్గా లేకపోతే అది కారు మైలేజీతో పాటు సేఫ్టీపై కూడా ప్రభావం చూపిస్తుంది. ఇటువంటి కాలంలో కార్ల టైర్ ప్రెజర్‌ను చెక్ చేయడం చాలా కీలకం. టైర్ ప్రెజర్ సరిగ్గా ఉన్నప్పుడే టైరుకు, రోడ్డుకు మధ్య కాంటాక్ట్ సరిగ్గా ఉంటుంది. అప్పుడే వాహనం సేఫ్‌గా కూడా ఉంటుంది. టైర్ మెయింటెయిన్స్ సరిగ్గా ఉంటే జీవితకాలం కూడా పెరుగుతుంది. దీంతో మీకు డబ్బులు కూడా ఆదా అవుతాయి.
బ్యాటరీ, ఇంజిన్ మెయింటెయిన్స్ కూడా కీలకమే
వేసవికాలంలో వేడిని కారుతో పాటు దాని బ్యాటరీ కూడా తట్టుకోవాలి. లేకపోతే బ్యాటరీ వీక్ అయిపోయి కారు ఆగిపోయే ప్రమాదం వస్తుంది. బ్యాటరీ ఏజ్, కండీషన్ ఎప్పటికప్పుడు చూసుకుంటూ ఉండాలి. ఇంజిన్ ఎలా ఉందో చూసుకోవడం కూడా ముఖ్యమే. ఇంజిన్ ఆయిల్ లెవల్ సరిగ్గా ఉందో లేదో అన్నది ఎప్పటికప్పుడు చూసుకుంటూ ఉండాలి. దీంతోపాటు వైర్ బ్లేడ్లు కూడా చెక్ చేసుకుంటూ ఉంటే బెస్ట్.
వాతావరణంలో మార్పులు జరిగేకొద్దీ కారు విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు కూడా మారుతూ ఉంటాయి. కానీ వేసవి కాలంలో ఈ జాగ్రత్తలు కాస్త ఎక్కువగా తీసుకోవాలి. వేసవి వేడికి తగ్గట్లు కారును సిద్ధం చేయడం పైనే కారు లైఫ్ ఆధారపడి ఉంటుంది.
భారతీయ ఆటోమొబైల్ పరిశ్రమ క్రమంగా ఎలక్ట్రిక్ వాహనాల వైపు మళ్లుతోంది. మారుతి సుజుకి, హోండా, స్కోడా, ఫోక్స్‌వ్యాగన్, టయోటా వంటి కార్ల తయారీ కంపెనీలు ఈ పెరుగుతున్న విభాగంలోకి ప్రవేశించడానికి సిద్ధమవుతున్నారు. హ్యుందాయ్, కియా, టాటా రాబోయే సంవత్సరాల్లో తమ ప్రస్తుత ఈవీ పోర్ట్‌ఫోలియోను మరింత విస్తరించాలని ప్లాన్ చేస్తున్నాయి.