Car Sales Report February 2024: ప్రముఖ కార్ల తయారీ కంపెనీలు 2024 ఫిబ్రవరి నెలలో తమ సేల్స్ నంబర్లను విడుదల చేశాయి. ఇందులో గత నెలలో అత్యధికంగా అమ్ముడైన కార్ల జాబితాలో మారుతి వ్యాగన్ఆర్ అగ్రస్థానంలో నిలిచింది. 2024 ఫిబ్రవరిలో అమ్ముడుపోయిన టాప్ 5 ఎస్‌యూవీ కార్ల గురించి తెలుసుకుందాం.
ఎస్‌యూవీ సెగ్మెంట్ మార్కెట్లో హాట్ ఫేవరెట్‌గా టాటా మోటార్స్ రెండు ఎంట్రీ లెవల్ ఎస్‌యూవీలు ఉన్నాయి. అవే టాటా పంచ్, టాటా నెక్సాన్. గత సంవత్సరంలో అత్యధికంగా అమ్ముడైన ఎస్‌యూవీల్లో ఒకటి. టాటా నెక్సాన్ గత నెలలో అత్యధికంగా అమ్ముడైన ఎస్‌యూవీల జాబితాలో ఐదో స్థానంలో నిలిచింది. కానీ టాటా పంచ్ ఫిబ్రవరి నెలలో అత్యధికంగా అమ్ముడైన ఎస్‌యూవీగా మారింది. రెండు, మూడు, నాలుగో స్థానాల్లో వరుసగా మారుతి సుజుకి బ్రెజా, హ్యుందాయ్ క్రెటా, మహీంద్రా స్కార్పియో ఎన్ ఉన్నాయి. కాగా మారుతీ సుజుకి ఫ్రాంక్స్ క్రాసోవర్ గత నెలలో 14,168 యూనిట్ల విక్రయాలతో ఆరో స్థానానికి చేరుకుంది.
టాప్‌లో టాటా పంచ్...
2024 ఫిబ్రవరిలో టాటా మోటార్స్ 18,438 యూనిట్ల పంచ్ మైక్రో ఎస్‌యూవీలను విక్రయించింది. 2023 ఫిబ్రవరిలో 11,169 యూనిట్లు అమ్ముడుపోయాయి. సంవత్సరానికి అమ్మకాలలో 65.08 శాతం వృద్ధిని నమోదు చేసింది. భారతదేశంలో టాటా మోటార్స్ అమ్మకాలు పెరగడానికి పంచ్ ఈవీ ప్రధాన కారణం.
మారుతి బ్రెజ్జా గత నెలలో 15,765 యూనిట్ల అమ్మకాలతో రెండో స్థానంలో ఉంది. 2023 ఫిబ్రవరిలో ఈ కారుకు సంబంధించి 15,787 యూనిట్లు అమ్ముడుపోయాయి. కేవలం 0.14 శాతం స్వల్ప క్షీణతను నమోదు చేసింది. బ్రెజాలో ఎస్‌హెచ్‌వీఎస్ మైల్డ్ హైబ్రిడ్ టెక్నాలజీతో కూడిన 1.5 లీటర్ నేచురల్లీ యాస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజన్ అమర్చారు. మాన్యువల్, 6 స్పీడ్ టార్క్ కన్వర్టర్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్లు ఇందులో అందుబాటులో ఉన్నాయి.
హ్యుందాయ్ క్రెటా ఫిబ్రవరి 2024లో 15,276 యూనిట్ల అమ్మకాలతో మూడో స్థానంలో ఉంది. ఇది వార్షిక ప్రాతిపదికన 46.59 శాతం భారీ వృద్ధిని నమోదు చేసింది. 2023 ఫిబ్రవరిలో దీనికి సంబంధించి 10,421 యూనిట్లు అమ్ముడయ్యాయి. స్కార్పియో గత నెలలో 15,051 యూనిట్ల విక్రయాలతో నాలుగో స్థానంలో ఉండగా, వార్షిక ప్రాతిపదికన 116.56 శాతం వృద్ధిని సాధించింది. గత ఏడాది ఇదే నెలలో మహీంద్రా స్కార్పియో 6,950 యూనిట్లు మాత్రమే అమ్ముడయ్యాయి.
వార్షిక విక్రయాల్లో 3.46 శాతం వృద్ధి ఉన్నప్పటికీ, టాటా నెక్సాన్ 2024 ఫిబ్రవరిలో టాప్ 5 సెల్లింగ్ ఎస్‌యూవీల జాబితాలో ఐదో స్థానానికి పడిపోయింది. కంపెనీ గత నెలలో 14,395 టాటా నెక్సాన్ మోడల్స్‌ను విక్రయించింది. 2023 ఫిబ్రవరిలో 13,914 యూనిట్లు అమ్ముడుపోయాయి.
మరోవైపు దేశంలోనే నంబర్ వన్ ప్యాసింజర్ కార్ కంపెనీ మారుతి సుజుకీ మహిళలకు అతిపెద్ద ఆప్షన్‌గా మారింది. ఇప్పటి వరకు తొమ్మిది లక్షలకు పైగా కార్లను మహిళలకు విక్రయించినట్లు మారుతి సుజుకీ అధికారికంగా తెలిపింది. దీనికి సంబంధించి మారుతి సుజుకీ మహిళా దినోత్సవం సందర్భంగా ఒక నివేదికను కూడా విడుదల చేసింది. మహిళలను దృష్టిలో ఉంచుకుని ప్రత్యేక క్యాంపెయిన్‌ను కూడా ప్రారంభించింది.