Car Mileage Improvement Tips: భారతీయులకు కారు అంటే కేవలం ప్రయాణ సాధనం మాత్రమే కాదు, అది కూడా ఒక కుటుంబ సభ్యుడు. అయితే, ఎక్కువ మంది, ఇష్టంగా కారు కొనుగోలు చేసిన తర్వాత దాని మెయింటెనెన్స్ విషయంలో అలసత్వం చూపుతుంటారు. అసలు, కారు సరిగ్గా పనిచేయాలంటే కేవలం సర్వీసింగ్ మాత్రమే చాలదు. రోజూ అతి కొద్ది సమయం కేటాయించి, కారులోని కొన్ని చిన్న భాగాలను చెక్ చేస్తే వాహనం పనితీరు మెరుగవుతుంది, మైలేజ్ పెరుగుతుంది, రిపేర్ల ఖర్చులు తగ్గుతాయి.

కారు మెరుగైన పనితీరు కోసం, నిత్యం కొన్ని ముఖ్యమైన భాగాల పరిస్థితిని తెలుసుకోవడం చాలా అవసరం. ఈ భాగాలు చిన్నవి అనిపించవచ్చు కానీ ఇవి కారు పనితీరులో గుండె లాంటివి.

మీరు ప్రతి రోజు చెక్ చేయాల్సిన ముఖ్యమైన కారు భాగాలు:

1. ఇంజిన్ ఆయిల్ స్థాయి:ఇది కారు "హార్ట్ బీట్" అని చెప్పొచ్చు. ఇంజిన్ ఆయిల్ తక్కువగా ఉండటం వల్ల ఫ్రిక్షన్ పెరుగుతుంది, ఇంజిన్ వేడెక్కుతుంది, చివరకు దెబ్బతింటుంది. కారు స్టార్ట్‌ అయ్యే ముందు డిప్ స్టిక్‌తో ఆయిల్ స్థాయిని చెక్ చేయాలి. అంతేకాదు, ఆయిల్ రంగు ముదురుగా మారితే, వెంటనే మార్చేయాలి.

2. టైర్ ప్రెషర్ & కండిషన్:టైర్లు కారు పెర్ఫార్మెన్స్‌, మైలేజ్‌, బ్రేకింగ్ సిస్టమ్ అన్నింటికీ పునాదుల్లాంటివి. ప్రతి మూడు రోజులకు టైర్ ప్రెషర్ చెక్ చేయండి. ప్రెషర్ తక్కువగా ఉంటే మైలేజ్ తగ్గుతుంది. టైర్ ట్రెడ్ డెప్త్ కూడా పరిశీలించండి, టైర్లు మరీ మెత్తగా ఉంటే డ్రైవింగ్ ప్రమాదకరం.

3. కూలెంట్ లెవల్:ఇంజిన్ వేడి నుంచి కాపాడే కూలెంట్ స్థాయిని చెక్ చేయడం కూడా చాలా ముఖ్యం. రేడియేటర్‌లో గరిష్ట, కనిష్ట గుర్తుల మధ్య కూలెంట్ ఉండాలి. అవసరమైతే, నమ్మకమైన కూలెంట్‌ను మాత్రమే యాడ్ చేయాలి.

4. బ్రేక్ ఆయిల్:బ్రేకింగ్ రెస్పాన్స్ మీద దీని ప్రభావం బాగా ఉంటుంది. బ్రేక్ ఆయిల్ లెవల్ తక్కువగా ఉంటే, బ్రేక్స్ సరిగ్గా పని చేయకపోవచ్చు. ఇది డ్రైవింగ్ సమయంలో ప్రమాదకరం కావచ్చు.

5. బ్యాటరీ హెల్త్:కారు వెంటనే స్టార్ట్ కావడం లేదా?, సోమరితనం ప్రదర్శిస్తోందా?, హెడ్‌లైట్లు డిమ్‌గా ఉన్నాయా? చెక్‌ చేయాలి. ఇవి, బ్యాటరీ వీక్ అయిందన్న సంకేతాలు. టెర్మినల్స్‌ను తడి లేకుండా ఉంచండి. వారం లోపు ఒకసారి వోల్టేజ్ చెక్ చేయించుకోవడం మంచిది.

6. విండ్‌షీల్డ్ క్లీనర్ లిక్విడ్ & వైపర్స్:వాన చినుకులు లేదా పొడి ధూళి కారణంగా విండ్‌షీల్డ్ మసగ్గా మారుతుంది. అందుకే వాషర్ లిక్విడ్ సరైన లెవల్‌లో ఉండేలా చూసుకోవాలి. వైపర్ బ్లేడ్‌లు బాగా పనిచేస్తున్నాయా లేదా కూడా పరిశీలించండి.

7. లైట్ల పరిస్థితి:హెడ్‌ లైట్స్, టెయిల్ లైట్స్, టర్న్ ఇండికేటర్లు అన్నీ సరిగా పని చేస్తున్నాయో, లేదో ప్రతిరోజూ ఒకసారి చూసుకోవాలి. రాత్రిపూట ప్రయాణాల్లో మీ భద్రతకు ఇది చాలా అవసరం.

8. ఇంధన స్థాయి (పెట్రోల్‌, డీజిల్‌ లేదా CNG):కొన్ని సందర్భాల్లో, పాత కార్లలో ఫ్యూయెల్ గేజ్ సరిగ్గా చూపించకపోవచ్చు. కారు ఇంధనం కనీస స్థాయి కంటే ఎప్పుడూ ఎక్కువగా ఉండేలా చూసుకోండి.

కథనం చదువుతుంటే ఈ లిస్ట్‌ చాలా పెద్దది అనిపించవచ్చు. కానీ, వాస్తవంగా వీటన్నింటినీ చెక్‌ చేయడానికి 5 నుంచి 10 నిమిషాలు చాలు. రోజూ కారు స్టార్ట్ చేసే ముందు ఈ చిన్న చెకింగ్స్‌ చేస్తే, మీరు ఊహించని విధంగా కారును కొత్తదానిలా ఉంచుకోవచ్చు. ఇవి కేవలం మెయింటెనెన్స్‌కు మాత్రమే కాదు – మీ సురక్షిత డ్రైవింగ్‌కు కూడా కీలకం. ఒక్కసారి అలవాటు చేసుకుంటే, కారు జీవిత కాలాన్ని పెంచడం, మైలేజ్ మెరుగుపరచడం, ఆకస్మిక ఖర్చుల్ని తగ్గించడం వంటివన్నీ మీ కంట్రోల్‌లో ఉంటాయి. అంతేకాదు, కొత్త కారు తరహాలో మీ ప్రయాణం ప్రతి రోజు కొత్తగా, సురక్షితంగా మారుతుంది!.