Harsish Rao on Kaleshwaram project Facts | హైదరాబాద్: కాళేశ్వరం ప్రాజెక్టుపై పీసీ ఘోష్ కమిషన్ ఇచ్చిన నివేదిక నిజమైతే.. తెలంగాణ ప్రభుత్వం తప్పుపడుతున్న బీఆర్ఎస్ నేతలను కాదని, కేంద్ర ప్రభుత్వాన్ని అని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు అనుమతి ఇచ్చింది కేంద్ర ప్రభుత్వం అని.. కేంద్ర వాటర్ కమిషన్, ఇంజినీర్లను తప్పుపట్టినట్లేనని స్పష్టం చేశారు. కమిషన్ ఒకవైపు నిలబడి రిపోర్ట్ ఇచ్చినట్లు కనిపిస్తుందని, అది బేస్ లెస్ గా ఉందన్నారు. రైతులకు నీళ్లు ఇవ్వాలని కేసీఆర్ (KCR), బీఆర్ఎస్ ప్రభుత్వం బాధ్యతగా తీసుకుంటే రాజకీయ జోక్యం అని చెప్పడం హాస్యాస్పదంగా ఉందన్నారు.

కమిషన్ల రిపోర్టులు నిలబడవు.. రేవంత్ సీరియల్స్ డ్రామా.

తెలంగాణ ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్టు రిపోర్ట్ లీకులు, చేసిన ఆరోపణలపై స్పందించిన మాజీ మంత్రి హరీష్ రావు తెలంగాణ భవన్‌లో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. గతంలో ఎన్నో కమిషన్లు రిపోర్టులు ఇచ్చినా అవి న్యాయస్థానంలో నిలబడలేదు. మాజీ ప్రధాని ఇందిరా గాంధీ మీద అప్పటి జనతా ప్రభుత్వం వేసిన షా కమిషన్,  చంద్రబాబు మీద కమిషన్లు వేశారు. కానీ ఏ కమిషన్ కోర్టుల్లో నిలబడవు. ఎప్పటికైనా సత్యం, ధర్మమే గెలుస్తుంది. తన వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు రేవంత్ రెడ్డి డ్రామాలు ఆడుతున్నారు. అంతా గమనిస్తే సీరియల్స్ గా వ్యవహారం ఉంది. ఫేమస్ సీరియస్ కార్తీకదీపం, దాని తరువాత గుడి గంటలు, బ్రహ్మముడి అనే సీరియల్స్ లా రేవంత్ రెడ్డి డ్రామాలు ఆడుతున్నారు. రైతుల ప్రయోజనాలు ఫణంగా పెట్టి, వ్యక్తిగతంగా కేసీఆర్ ను హింసించాలని రేవంత్ రెడ్డి ప్లాన్ చేశారు.

కాళేశ్వరం ద్వారా రైతులకు నీళ్లు ఇచ్చే అవకాశం ఉన్నా ఆ పని చేయకుండా ఇబ్బంది పెడుతున్నారు. కన్నెపల్లి పంప్ హౌస్ కు వెళ్తే అడ్డుకున్నారు. తుమ్మిడిహట్టి వద్ద గత కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు పనులు చేయలేదు. అక్కడ నీటి లభ్యత లేదు. అక్కడ వైల్డ్ లైఫ్ సాంక్చుయరీ ఉంది. ఒకవేళ నీళ్లు ఉంటే కాంగ్రెస్ అధికారం లోకి ఏడాదిన్నర పూర్తయినా తట్ట మట్టి కూడా ఎందుకు తీయలేదు. తుమ్మిడిహట్టి వద్ద ప్రాజెక్టు అనేందుకు మీతో ఏ రిపోర్ట్ ఉంది. 152 మీటర్లకు మహారాష్ట్ర నుంచి పర్మిషన్ తీసుకున్నామని ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పారు. గంటసేపు ఇక్కడే ఉంటానని బేగంపేట ఎయిర్ పోర్టులో కేసీఆర్ సవాల్ విసిరితే సమాధానం లేదు. ఈరోజు అయినా వచ్చి ఆ అగ్రిమెంట్ పేపర్లు చూపాలని డిమాండ్ చేస్తున్నాం. 

ఏడాది పాలనలోనే కేసీఆర్ ఎంతో చేసి చూపించారు. మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ ప్రాజెక్టులతో తాగునీటిని, సాగునీటిని ఇచ్చారు. రెండేళ్లు కావొస్తున్నా ఒక్క ఎకరానికైనా రేవంత్ రెడ్డి నీళ్లు ఇచ్చారా. ? ఢిల్లీకి కమీషన్ల మూటలు తీసుకెళ్లావు. ప్రతిపక్షాల మీద కమీషన్లు వేశావు. వచ్చే రెండేళ్లు కూడా డ్రామాలు తప్పా కాంగ్రెస్ పాలనతో ప్రయోజనం లేదు. కాళేశ్వరం నీళ్లు రైతులకు ఇవ్వకుండా, ఏపీ ప్రాజెక్టు బనకచర్లకు నీళ్లు ఇవ్వడానికి కుట్రలు చేస్తున్నారు. సర్ ఆర్థర్ కాటన్ ధవళేశ్వరం వద్ద డ్యామ్ కడితే అప్పటి బ్రిటీష్ ప్రభుత్వం కమిషన్లు వేసి వేధించింది. కానీ కాటన్ ప్రజల గుండెల్లో దేవుడిగా మిగిలిపోయారు. రేపు కేసీఆర్ తెలంగాణ ప్రజల గుండెల్లో శాశ్వతంగా నిలిచిపోతారు. కాళేశ్వరం తెలంగాణకు వరప్రదాయని. కాళేశ్వరం కూలిందని చెబుతాడు. మొన్న నల్గొండలో గందమల్ల ప్రాజెక్టుకు వెళ్లి టెంకాయ కొట్టింది రేవంత్ రెడ్డి. కాళేశ్వరం ప్రాముఖ్యత తెలుసు కనుక మూసీకి తెచ్చి నీళ్లు కలుపుతా అంటున్నారు. 

ప్రాణహిత- చేవెళ్లలో రూ. 11 వేల కోట్లు ఖర్చు చేశామని ఉత్తమ్‌ చెబుతున్నాడు. 2014 రాష్ట్ర ఏర్పాటు నాటికి ప్రాణహిత చేవెళ్ల పనులకు పెట్టిన ఖర్చు రూ. 3,700 కోట్లు మాత్రమే. అబద్ధాలకు కూడా హద్దులు ఉండాలి. సర్వే, మొబిలైజేషన్‌ అడ్వాన్లు పేరుమీద రూ. 2,300 కోట్లు దొబ్బారు. 

తుమ్మిడిహట్టిని కాదని మేడిగడ్డలో బ్యారేజీఇక్కడ నీటి లభ్యత లేకపోవడంతో బ్యారేజీని మేడగడ్డ వద్ద కట్టాం. కేంద్ర వాటర్ కమిషన్ 2015లో ఫిబ్రవరి, మార్చి నెలలో రాసిన రిపోర్టును చూపించారు. ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టులో 165 టీఎంసీలలో ఎగువరాష్ట్రాలకు 63 టీఎంసీల నీళ్లు పోతే తెలంగాణకు 102 టీఎంసీలు వస్తాయని సీడబ్ల్యూసీ పంపిన రిపోర్టులను హరీష్ రావు ప్రదర్శించారు. 100 టీఎంసీలు ఉంటే ప్రామాణికంగా 75 టీఎంసీలను తీసుకుంటారు. ఎగువ రాష్ట్రాలు ఎక్కువ నీటిని వాడాయని అప్పుడే తేలింది. అప్పటి కేంద్ర జలవనరుల మంత్రి హైడ్రాలజీ పర్మిషన్ గురించి పేర్కొన్న లెటర్ లోనే 163 టీఎంసీల నీటి లభ్యత ఉండదని.. ప్రత్యామ్నాయం చూసుకోవాలని సూచించారు. కాళేశ్వరం ప్రాజెక్టు మీరు సూచించిన ప్రతిపాదన మేరకు మేడిగడ్డకు బ్యారేజీ మార్చామని కేంద్రానికి ఇచ్చిన డీపీఆర్ లో అప్పటి మా ప్రభుత్వం స్పష్టం చేసింది. నీటి ఎత్తిపోతల కోసం మేడిగడ్డకు అనుసంధానంగా అన్నారం, సుందిళ్ల బ్యారేజీలు కడుతున్నామని కేంద్రానికి మేం తెలిపాం. ఇందులోకి దాపరికం ఏముందని హరీష్ రావు ప్రశ్నించారు.