చాలా మంది సొంతంగా కారు కొనుగోలు చేయాలని కలలు కంటారు. ప్రస్తుత పరిస్థితుల్లో కుటుంబంతో కలిసి బస్సులో, ఇతర వాహనాల్లో ప్రయాణం చేయాలంటే చాలా కష్టం. అందుకే కుటుంబ అసరాల కోసం ఓ కారు కొనుక్కోవాలి అనుకుంటారు. డబ్బు ఉన్న వాళ్లు కొత్త కారు కొనుక్కుంటారు. తక్కువగా డబ్బు ఉన్నవాళ్లు సెకెండ్ హ్యాండ్ కారు కొనుగోలు చేస్తుంటారు. ప్రస్తుతం పాత కారు కొనే వారికి సైతం బ్యాంకులు రుణాలు ఇస్తున్నాయి. లోన్ తీసుకునే ముందు కొన్ని ముఖ్యమైన విషయాలను గుర్తు పెట్టుకోవాలి. దరఖాస్తుదారుడు సెకండ్ హ్యాండ్ కారు కొనడానికి రుణం పొందటానికి అర్హత కలిగి ఉండాలి. మూడేళ్ల కంటే పాత కార్లను కొనడానికి చాలా సార్లు బ్యాంకులు రుణాలు ఇవ్వవు.


ఎవరు దరఖాస్తు చేసుకోవచ్చు?


మధ్య తరగతి కుటుంబాలు ఎక్కువగా సెకెండ్ హ్యాండ్ కార్ల మీద రుణాలు తీసుకుంటాయి. కొత్త కారును కొనుగోలు చేయడం ఖర్చుతో కూడుకున్న వ్యవహారం. అంతేకాదు.. మెయింటెనెన్స్ కోసం చాలా డబ్బు ఖర్చు చేయాల్సి ఉంటుంది. ఎక్కువ ఇన్సూరెన్స్ ప్రీమియం అవసరం కావచ్చు. సెకండ్ హ్యాండ్ కారు కొనుగోలుతో చాలా వరకు డబ్బు ఆదా చేసుకోవచ్చు. కారు విలువలో తరుగుదల కారణంగా బీమా ప్రీమియం చౌకగా ఉంటుంది. లోన్ పై ఎక్కువ ఒత్తిడి లేకుండా కారును సొంతం చేసుకునే అవకాశం ఉంటుంది. రుణగ్రహీతల వయసు 21 సంవత్సరాల నుంచి 65 సంవత్సరాల వరకు ఉండవచ్చు.  


ఇలా కూడా లోన్ తీసుకొచ్చు!


పాత వాహనాన్ని కొనుగోలు చేయడానికి సెక్యూర్డ్ లేదంటే అన్ సెక్యూర్డ్ లోన్ తీసుకోవచ్చు. మీరు అధిక వడ్డీ, ఛార్జీలు చెల్లించడానికి సిద్ధంగా ఉండటంతో పాటు బ్యాంక్‌ లో ఏదైనా వస్తువు కుదువ పెట్టకూడదు అనుకుంటే వ్యక్తిగత రుణాన్ని ఎంచుకోవచ్చు. మరోవైపు, మీకు సురక్షితమైన రుణం కావాలంటే,  బంగారం వంటి ఆస్తులను, KVP, LIP, NSC, FDలు మొదలైన సెక్యూరిటీలను ఉపయోగించవచ్చు.  


లోన్ తీసుకునే వారికి సలహాలు 


సెకండ్ హ్యాండ్ వెహికల్‌ని కొనుగోలు చేయడానికి కారు లోన్ కోసం దరఖాస్తు చేస్తున్నప్పుడు బ్యాంక్ అందించే లోన్ టు వాల్యూ (LTV) అనే దాని విషయంలో జాగ్రత్తగా ఉండాలి.  LTV సాధారణంగా రుణదాత నుంచి  రుణదాతకు మారుతూ ఉంటుంది. సెకండ్ హ్యాండ్ కారు అంచనా విలువలో 50% నుండి 90% వరకు ఉంటుంది. మీరు వాహనాన్ని బ్యాంక్ ప్రీ-ఓన్డ్ కార్ డీలర్‌ల నుంచి కొనుగోలు చేస్తే,  మెరుగైన LTV నిష్పత్తి, తక్కువ వడ్డీ రేటుతో లోన్ పొందవచ్చు.  


ఈ విషయాలు గుర్తుంచుకోండి


పాత కారు కొనడానికి ముందు అనేక విషయాలను గుర్తుంచుకోవాలి.


⦿ కారు  డీలర్లు సెకండ్ హ్యాండ్ కార్ల విషయంలో కొనుగోలుదారులను మోసం చేస్తుంటారు.


⦿ మంచి పెయింట్,  మంచి ఇంటీరియర్ ఏర్పాటు చేయించి కస్టమర్లను ఆకట్టుకునేలా ప్రయత్నిస్తారు.


⦿ పై పై హంగులను చూసి అసలు విషయాలను మర్చిపోతారు.


⦿ ఆన్‌లైన్‌కు బదులుగా కారును ఆఫ్‌లైన్‌లో కొనడానికి ప్రయత్నించండి.


⦿ మెకానిక్ తో చెక్ చేయించి తీసుకోండి. ఎక్కువ డిస్కౌంట్ ఆఫర్లను చూసి మోసపోవద్దు.


⦿ టెస్ట్ డ్రైవ్ చేయకుండా కారును కొనుగోలు చేయకూడదు.


⦿ పూర్తి డాక్యుమెంట్స్ ఉన్నప్పుడే కారు కొనుగోలు చేయాలి.


Also Read: కారులో ప్రయాణిస్తున్నప్పుడు సీట్ బెల్ట్ ఎందుకు ధరించాలి? అది ఎలా ప్రాణాలు కాపాడుతుంది?
Also Read: మనదేశంలో అత్యంత చవకైన కార్లు ఇవే - రూ.4 లక్షలలోపు కూడా!