మైక్రోసాఫ్ట్ అధినేత, ప్రపంచ కుబేరులలో ఒకరైన బిల్ గేట్స్ భారత్ లో పర్యటిస్తున్నారు. ఈ పర్యటనలో కీలకమైన సమావేశాలతో పాటు సరదా సరదా కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. ఇటీవలే కేంద్ర మంత్రి స్మృతి ఇరానీతో కలిసి వంట చేశారు. ఈ వీడియోను సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో బాగా వైరల్ అయ్యింది. తాజాగా తన క్లాస్ మేట్, మహీంద్రా అధినేత ఆనంద్ మహీంద్రాను కలిశారు. ఈ సందర్భంగా మహీంద్రా ట్రియో ఆల్ ఎలక్ట్రిక్ రిక్షాను నడిపారు. ఈ వీడియోను తన ఇన్ స్టా గ్రామ్ లో పోస్ట్ చేశారు. గ్రీన్ ఇన్నోవేషన్స్‌కు పూర్తిగా సపోర్టు చేస్తూ మహీంద్ర ఎలక్ట్రిక్ రిక్షాపై ఆయన ప్రశంసలు కురిపించారు.
రవాణ రంగంలోకి ఎలక్ట్రిక్ రిక్షాలు రావడం సంతోషకరం - గేట్స్
“మహీంద్ర లాంటి సంస్థలు రవాణా రంగంలో ఎలక్ట్రిక్ రిక్షాలను పరిచయం చేయడం శుభ పరిణామం. ఈ రిక్షాలు డీకార్బనైజేషన్‌కి ఉపయోగపడటం బాగుంది. 131 కిలో మీటర్లు అంటే సుమారు 81 మైళ్లు వరకు ప్రయాణించే ఎలక్ట్రిక్ రిక్షాను నడిపా. దీనిపై నలుగురిని తీసుకెళ్లే అవకాశం ఉంటుంది. వ్యవసాయం నుంచి రవాణా వరకు కార్బన్ ఉద్గారాలు లేని ప్రపంచం కోసం కృషి చేయాల్సిన అవసరం ఉంది” అని ఈ సందర్భంగా బిల్ గేట్స్ అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది.
2021 చివరలో ట్రియో ఎలక్ట్రిక్ ఆటో రిక్షాను మహీంద్రా కంపెనీ లాంచ్ చేసింది. దీని ధర రూ. 2.09 లక్షలు (ఎక్స్-షోరూమ్)గా కంపెనీ నిర్ణయించింది. ఈ రిక్షా 7.37 kWh సామర్థ్యంతో 48V లిథియం అయాన్ బ్యాటరీని కలిగి ఉంటుంది. పూర్తిగా ఛార్జ్ చేయడానికి దాదాపు 4 గంటల సమయం పడుతుంది. గరిష్ట వేగం గంటకు 50 కిలో మీటర్లు కలిగి ఉంటుంది. ఒక్కసారి ఛార్జింగ్ చేస్తే దాదాపు 80 కిలో మీటర్లు ప్రయాణిస్తుంది. రియర్, అండ్ ఫ్రంట్ హైడ్రాలిక్ బ్రేక్స్ తో పాటు పార్కింగ్ కోసం మెకానికల్ లివర్ బ్రేక్ ఆప్షన్ ను కలిగి ఉంటుంది.
బిల్ గేట్స్ వీడియోపై ఆనంద్ మహీంద్ర ఏమన్నారంటే?
బిల్ గేట్స్ షేర్ చేసిన వీడియోపై ఆనంద్ మహీంద్రా స్పందించారు. ‘చల్తీ కా నామ్ బిల్ గేట్స్ కీ గాడి’ అంటూ వీడియోను షేర్ చేశారు. మహీంద్ర ట్రియోని చూడటానికి బిల్ గేట్స్ కి టైం దొరకడం సంతోషంగా ఉందన్నారు. ఈ మేరకు బిల్ గేట్స్ వీడియోను ఆయన ట్విట్టర్ లో షేర్ చేశారు. నెక్ట్స్ ఎజెండాలో నాతోపాటు, మీరు, సచిన్ టెండూల్కర్, ముగ్గురి మధ్య త్రీ వీలర్ ఈవీ డ్రాగ్ రేస్ ఉండేలా చూడండి అంటూ చమత్కరించడం విశేషం.
Read Also: వివాదాల్లోకి స్కార్పియో ఎన్ - దిమ్మదిరిగే ఆన్సర్ ఇచ్చిన మహీంద్రా!