Bharat Mobility Expo 2025 Date: భారత్ మొబిలిటీ ఎక్స్‌పో 2025 త్వరలో ప్రారంభం కానుంది. ఈ మోటార్ ఎక్స్‌పో వచ్చే ఏడాది జనవరి 17వ తేదీ నుంచి 22వ తేదీ వరకు దేశ రాజధాని ఢిల్లీలో జరగనుంది. ఈ మోటార్ షోలో అనేక కార్లు, ద్విచక్ర వాహనాల కంపెనీలు తమ ఉత్పత్తులతో రానున్నాయి. సొసైటీ ఆఫ్ ఇండియన్ ఆటోమొబైల్ మాన్యుఫ్యాక్చరర్స్ (SIAM) ఈ ఆటో ఎక్స్‌పోలో పాల్గొనే బ్రాండ్‌ల జాబితాను విడుదల చేసింది. ఈ ఈవెంట్‌కు 34 బ్రాండ్‌లు రాబోతున్నాయి. ఇప్పటివరకు జరిగిన్న అన్ని మోటార్ ఎక్స్‌పోల్లో వచ్చిన కార్ల కంపెనీలలో ఇదే అత్యధికం. ఇది ఇండియా మొబిలిటీ ఎక్స్‌పో 17వ ఎడిషన్. ఢిల్లీలోని ప్రగతి మైదాన్‌లో ఉన్న భారత్ మండపంలో ఈ మోటార్ షో జరగనుంది. ఈ ఆటో ఎక్స్‌పో భారతదేశంలో 1986లో ప్రారంభమైంది.
ఆటో ఎక్స్‌పోలో పాల్గొంటున్న కార్ల కంపెనీలు
ఆటో ఎక్స్‌పో 2025కి అనేక కార్ల తయారీదారులు రాబోతున్నారు. మారుతి సుజుకి, మహీంద్రా, టాటా మోటార్స్, టయోటా మోటార్, హ్యుందాయ్ మోటార్, కియా, జేఎస్‌డబ్ల్యూ ఎంజీ మోటార్స్, స్కోడా, వోక్స్‌వ్యాగన్ కూడా ఈ మోటార్ షో కోసం తమ పేర్లను నమోదు చేసుకున్నాయి. అనేక లగ్జరీ కార్ బ్రాండ్లు కూడా ఈ మోటార్ షోలో భాగం కానున్నాయి. మెర్సిడెస్, బీఎండబ్ల్యూ, పోర్షే కూడా ఈ ఆటో ఎక్స్‌పోకు రానున్నాయి. విదేశీ కంపెనీల జాబితాలో తమ ఎలక్ట్రిక్ వాహనాలను తీసుకురాబోతున్న బీవైడీ, విన్‌ఫాస్ట్ వంటి ప్రముఖ బ్రాండ్ల పేర్లు కూడా ఉన్నాయి.
Also Read: కవాసకి బైక్‌లపై కళ్లు చెదిరే ఆఫర్లు - ఏకంగా రూ.45 వేల వరకు డిస్కౌంట్!
ఆటో ఎక్స్‌పో 2025లో లాంచ్ కానున్న కార్లు ఇవే...
ఇండియా మొబిలిటీ ఎక్స్‌పోలో అనేక కొత్త వాహనాలను కూడా లాంచ్ చేసే అవకాశం ఉంది. ఈ మోటార్ షోలో మారుతి సుజుకి ఇ-విటారా, హ్యుందాయ్ క్రెటా ఈవీ, టాటా సియర్రాలను విడుదల చేయవచ్చు. ఈ వాహనాల కోసం మార్కెట్‌లో చాలా కాలంగా ఎదురుచూస్తున్నారు.
ఈ బైక్ బ్రాండ్లు కూడా...
ద్విచక్ర వాహనాల విభాగం గురించి చెప్పాలంటే... హీరో మోటోకార్ప్, బజాజ్ ఆటో, టీవీఎస్ మోటార్, హోండా మోటార్‌సైకిల్, స్కూటర్ ఇండియా, సుజుకి మోటార్‌సైకిల్, యమహా ఈ ఈవెంట్‌లో పాల్గొనబోతున్నాయి. ఎలక్ట్రిక్ స్కూటర్, మోటార్ సైకిల్ తయారీ కంపెనీలు ఏథర్ ఎనర్జీ, ఓలా ఎలక్ట్రిక్ కూడా ఈ మోటార్ షోలో భాగం కానున్నాయి.
Also Read: రోజువారీ వాడకానికి బెస్ట్ బడ్జెట్ సీఎన్‌జీ కార్లు ఇవే - టాప్-3 లిస్ట్‌లో ఏం ఉన్నాయి?