Bajaj Pulsar NS160 and NS200: ప్రముఖ ద్విచక్ర వాహన తయారీ సంస్థ బజాజ్ ఆటో తన అప్‌డేటెడ్ పల్సర్ ఎన్ఎస్160, పల్సర్ ఎన్ఎస్200లను భారతదేశంలో లాంచ్ చేసింది. ఇందులో పల్సర్ ఎన్ఎస్160 ఎక్స్ షోరూమ్ ధర రూ. 1.46 లక్షలుగానూ, పల్సర్ ఎన్ఎస్200 ఎక్స్ షోరూమ్ ధర రూ. 1.55 లక్షలుగా ఉంది. ఈ అప్‌డేట్‌తో పాత ఎన్ఎస్ లైనప్‌కి తాజా స్టైలింగ్, కొత్త ఎల్సీడీ డాష్ రూపంలో కొన్ని ముఖ్యమైన మార్పులు చేశారు. కొత్త ఎల్సీడీ డాష్ బ్లూటూత్ కనెక్టివిటీతో వస్తుంది.


పల్సర్ ఎన్ఎస్160, పల్సర్ ఎన్ఎస్200ల్లో అతిపెద్ద మార్పు కొత్త ఎల్ఈడీ హెడ్‌లైట్ రూపంలో వస్తుంది. దాని చుట్టూ ఉన్న డీఆర్ఎల్స్ ఇప్పుడు థండర్ షేప్‌లో అందించారు. ఎన్ఎస్200 కూడా చుట్టూ ఎల్ఈడీ లైటింగ్‌ను పొందుతుంది. ఇప్పుడు ఇండికేటర్ల కోసం కూడా ఎల్ఈడీలు అందించారు. ఇది పల్సర్ ఎన్250ని పోలి ఉంటుంది.


కొత్త డిజిటల్ డ్యాష్‌బోర్డ్‌ కూడా...
ఇటీవల విడుదల చేసిన కొత్త పల్సర్ ఎన్150, ఎన్160ల్లో కనిపించే కొత్త డిజిటల్ డాష్‌బోర్డును వీటిలో కూడా అందించారు. నోటిఫికేషన్ అలెర్ట్స్ కోసం ఇప్పుడు మీ స్మార్ట్‌ఫోన్‌ను డిస్‌ప్లేకు కనెక్ట్ చేయవచ్చు.


ధర ఎంతంటే?
పల్సర్ ఎన్ఎస్160 కొత్త మోడల్ ఎక్స్ షోరూమ్ ధర రూ. 1.46 లక్షలుగా ఉంది. ఇది టీవీఎస్ అపాచీ ఆర్‌టీఆర్ 160 4వీ (ధర రూ. 1.24 లక్షల నుంచి రూ. 1.38 లక్షల మధ్య), హీరో ఎక్స్‌ట్రీమ్ 160ఆర్ 4వీ (ధర రూ. 1.27 లక్షల నుంచి రూ. 1.23 లక్షల మధ్య) కంటే కొంచెం ఖరీదైనది. పల్సర్ ఎన్ఎస్200 కూడా ఇప్పుడు దాని సమీప ప్రత్యర్థుల కంటే కొంచెం ఎక్కువ ప్రీమియంగా ఉంది. టీవీఎస్ అపాచీ ఆర్‌టీఆర్ 200 4వీ (రూ. 1.47 లక్షలు), హోండా హార్నెట్ 2.0 (రూ. 1.39 లక్షలు)తో పోలిస్తే పల్సర్ ఎన్ఎస్200 ఎక్స్ షోరూమ్ ధర రూ. 1.55 లక్షలుగా నిర్ణయించారు.


Also Read: రూ.8 లక్షల్లోపు ధరలో టాప్-5 కార్లు ఇవే - బడ్జెట్‌లో కార్లు కావాలనుకునేవారికి బెస్ట్ ఆప్షన్ - ఈవీ కూడా!