స్ట్రేలియాలో  ట్రాఫిక్ రూల్స్ పట్ల పోలీసులు కఠినంగా వ్యవహరిస్తుంటారు. ఎవరైనా సరే కచ్చితంగా నిబంధనలకు అనుగుణంగా వాహనాలు నడపాల్సిందే! లేదంటే, పెద్ద మొత్తంలో జరిమానాలు చెల్లించాల్సి ఉంటుంది. ఒక్కోసారి జైలు శిక్షకూడా పడే అవకాశం ఉంటుంది. అవసరం లేకున్నా హారన్ మోగిస్తే 2,669 ఆస్ట్రేలియన్ డాలర్ల జరిమానా విధించే అవకాశం ఉంది. భారత కరెన్సీలో ఈ మొత్తం ఇంచు మించు రూ. 15 వేలుగా ఉంటుంది. 


 తాజాగా అమల్లోకి వచ్చిన ఈ కొత్త రూల్ కు సంబంధించి వివరాలను విక్టోరియా పోలీసులు తమ ఫేస్ బుక్ పేజిలో వెల్లడించారు. “ఒక వేళ మీరు హారన్ ను తప్పుగా ఉపయోగిస్తే  మీరు గరిష్టంగా AUD$2,669 (£1,608) వరకు జరిమానా కట్టాల్సి ఉంటుంది” అని తెలిపారు. ఈ విషయాన్ని డైలీ మెయిల్ వెల్లడించింది. అయితే, పోలీసుల కొత్త నిబంధన పట్ల వాహనదారుల నుంచి మిశ్రమ స్పందన వస్తోంది.


పలువురు వాహనదారులు ఈ నిర్ణయాన్ని స్వాగతిస్తుండగా.. ఎక్కువ మంది తప్పుబడుతున్నారు. ఈ చట్టం కనీస జ్ఞానం లేకుండా రూపొందిచినట్లుగా ఉందని ఓ నెటిజన్ కామెంట్ చేశాడు. అయితే, తప్పుగా హారన్ ఉపయోగిస్తేనే ఈ జరిమానా అనే విషయాన్ని మర్చిపోకూడదని మరో నెటిజన్ కౌంటర్ ఇచ్చాడు. రోడ్డును వదిలి ఫుట్ పాత్ ఉపయోగించాలని పాదచారులకు చెప్పే సమయంలో, మీ ఫోన్ ఆఫ్ మాట్లాడ్డం ఆపేసి ముందుకు కదలండని ఎదుటి వాహనదారులకు సిగ్నల్ ఇవ్వడంలో, ఓ వ్యక్తికి ఏదైనా విషయాన్ని చెప్పాలి అనుకున్నప్పుడు హారన్ ఉపయోగించడంలో తప్పులేదని వివరించాడు.


రాష్ట్రాన్ని బట్టి జరిమానాలలో మార్పు


ఇక ట్రాఫిక్ రూల్స్ బ్రేక్ చేసిన కేసులలో ఒక్కో రాష్ట్రంలో ఒక్కో రకంగా జరిమానాలు విధిస్తున్నారు పోలీసులు. నార్త్ సౌత్ వేల్స్ లో వాహనదారులు  అనవసరంగా హారన్ ను ఉపయోగిస్తే  AUD$344 (£207) జరిమానా విధించబడుతుంది.  అదే దక్షిణ ఆస్ట్రేలియాలో హారన్ ఉల్లంఘనకు AUD$193 (£116) జరిమానా కట్టాల్సి ఉంటుంది. పశ్చిమ ఆస్ట్రేలియాలో మరోలా ఫైన్  ఉంటుంది. టాస్మానియన్ డ్రైవర్లు అయితే AUD$126 (£75) జరిమానా చెల్లించాల్సి ఉంటుంది. 


నార్త్ ఆస్ట్రేలియాలో జైలు శిక్షతో పాటు భారీ జరిమానా  


అటు నార్త్ ఆస్ట్రేలియాలో ట్రాఫిక్ రూల్స్ బ్రేక్ చేసే వారికి చుక్కలు కనిపిస్తాయి. భారీగా జరిమానా విధించడంతో పాటు జైలు శిక్ష అనుభవించాల్సి ఉంటుంది. నార్తర్న్ టెరిటరీలో, ట్రాఫిక్ రెగ్యులేషన్స్ 2007 చట్టం ప్రకారం డ్రైవర్లు గరిష్టంగా ఆరు నెలల జైలు శిక్షను విధించే అవకాశం ఉంది.  AUD$2,600 (£,1565) వరకు జరిమానాలు చెల్లించాల్సి ఉంటుంది.   


సన్షైన్ స్టేట్ లోనూ భారీ జరిమానాలు 


క్వీన్స్‌ల్యాండ్‌లో జరిమానాలు AUD$66 (£39) నుంచి ప్రారంభం అవుతాయి, అయితే గరిష్టంగా 20 పెనాల్టీ యూనిట్‌లను కలిగి ఉంటాయి. అంటే డ్రైవర్‌లకు గరిష్టంగా AUD$2,669 (£1,608) వసూలు చేసే అవకాశం ఉంటుంది. సో ఆస్ట్రేలియాలో డ్రైవింగ్ చేసే వాళ్లు ఒళ్లు దగ్గర పెట్టుకుని వాహనాలను నడపాలి. లేదంటే జేబుకు చిల్లు, జైల్లో చిప్పకూడు తప్పదు.