Delhi Liquor Scam Arrest :   దేశ రాజ‌ధాని ఢిల్లీలో వెలుగు చూసిన లిక్క‌ర్ స్కాంలో సీబీఐ తొలి అరెస్ట్ చేసింది.  ఓన్లీ మ‌చ్ లౌడ‌ర్ సీఈఓగా ప‌నిచేస్తున్న విజ‌య్ నాయ‌ర్‌ను అరెస్ట్ చేశారు. 
ముంబై కేంద్రంగా ఈవెంట్ మేనేజ్‌మెంట్ రంగంలో సేవ‌లు అందిస్తున్న ఓన్లీ మ‌చ్ లౌడ‌ర్ కంపెనీ ఢిల్లీ లిక్క‌ర్ స్కాంలో కీల‌కంగా వ్య‌వ‌హ‌రించిన‌ట్లు ఆరోప‌ణ‌లు ఉన్నాయి. ఈ క్ర‌మంలోనే ఈ సంస్థ సీఈఓగా ఉన్న విజ‌య్ నాయ‌ర్‌ను ఈ కేసులో ఐదో నిందితుడిగా సీబీఐ అధికారులు త‌మ ఎఫ్ఐఆర్‌లో పేర్కొన్నారు. కేసు ద‌ర్యాప్తులో భాగంగా విజ‌య్ నాయ‌ర్‌కు చెందిన కీల‌క ఆధారాలు ల‌భించ‌డంతో మంగ‌ళ‌వారం ముంబైలో ఉన్న ఆయ‌న‌ను సీబీఐ అరెస్ట్ చేసింది. అదుపులోకి తీసుకున్న నాయ‌ర్‌ను సీబీఐ ఢిల్లీకి త‌ర‌లించింది.


ఇప్పటి వరకూ కీలక విచారణలు జరుపుతున్న సీబీఐ ఇప్పటి వరకూ ఎవరినీ అరెస్ట్ చేయలేదు. మంగ‌ళ‌వారం నుంచి అరెస్ట్‌ల ప‌ర్వం మొద‌లైన‌ట్టైంది. ఢిల్లీలో అధికారంలో ఉన్న ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వం అమల్లోకి తీసుకొచ్చిన నూతన మద్య విధానంలో పెద్ద ఎత్తున అవినీతి చోటు చేసుకుందనే ఆరోపణల మేరకు సీబీఐ కేసులు నమోదు చేసింది.  ఆమ్ ఆద్మీ పార్టీ సీనియర్ నాయకుడు, ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా, ఎక్సైజ్ కమిషనర్ అరవ గోపీకృష్ణ సహా కొందరిని నిందితులుగా ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఎఫ్ఐఆర్‌లో మొత్తం 15 మంది పేర్లను చేర్చింది సీబీఐ.  తొమ్మిది నెలలపాటు అమలు చేసిన ఢిల్లీ ఎక్సైజ్ పాలసీలో అవినీతి చోటుచేసుకున్నదనేది ప్రధాన ఆరోపణ.ఈ పాలసీ గత నెలనే రద్దు చేశారు. 11 పేజీల ఆ ఎఫ్ఐఆర్ కాపీలో నేరపూరిత కుట్ర, ఫాల్సిఫికేషన్‌లు ప్రధాన ఆరోపణలుగా సీబీఐ చేర్చింది.


సీబీఐ కేసులు నమోదు చేసిన తర్వాత ఈడీ కూడా ఈ కేసులో విచారమ జరుపుతోంది. తమ బినామీల ద్వారా ఢిల్లీలో లిక్కర్ దందాలో పెట్టుబడులు పెట్టారన్న కోణంలో విచారణ చేస్తున్నారని అంటున్నారు. బినామీలను ముందుపెట్టి అనధికారికంగా పెట్టుబడులు పెట్టి.. బ్లాక్ మనీనీ వైట్ చేసుకున్నారా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇందుకు సంబంధించిన కీలక సమాచారం ఈడీ అధికారులకు లభించిందని తెలుస్తోంది.  అనుమానిత సంస్థలు, వాటికి సంబంధించిన అనుమానాస్పద లావాదేవీల గుట్టు రట్టు చేసే పనిలో ఈడీ అధికారులు ఉన్నారు. ఈ ఖాతాల వెనుక బినామీలు ఉన్నారని తేలితే... ఆ బినామీలెవరో తేల్చనున్నారు ఈడీ అధికారులు.  


ఢిల్లీ లిక్కర్ స్కాంకు సంబంధించి ఈడీ అధికారులు ఇప్పటికే హైదరాబాద్ లో పలు సార్లు సోదాలు జరిపారు. సీబీఐ నమోదు చేసిన కేసులో ఏ14గా ఉన్న మద్యం వ్యాపారి అరుణ్‌ రామచంద్ర పిళ్లై నివాసం, కార్యాలయాల్లో సోదాలు జరిగాయి. ఆయన వ్యాపార భాగస్వామిలుగా ఉన్న బోయినపల్లి అభిషేక్‌,  గండ్ర ప్రేమసాగర్‌ ఇళల్లోనూ సోదాలు నిర్వహించింది. తర్వాత  దోమల్‌గూడకు చెందిన గోరంట్ల అసోసియేట్స్‌ సంస్థలో సోదాలు చేశారు. ఈడీ పలువుర్ని ఢిల్లీలో ప్రశ్నిస్తోంది. ఈ క్రమంలో సీబీఐ అరెస్టులు ప్రారంభించడం కలకలం రేపుతోంది.