KVP Letter To Jagan : పోలవరం నిర్మాణంలో ఇతర రాష్ట్రాలను ఒప్పించే బాధ్యతను కేంద్రమే తీసుకోవాలని మాజీ ఎంపీ , కాంగ్రెస్ నేత కేవీపీ రామచంద్రరావు స్పష్టం చేసారు. రాష్ట్ర విభజన సమస్యలను పరిష్కరించే పూర్తి బాధ్యత కేంద్రం తీసుకునేలా ఒత్తిడి చేయాలని సీఎం జగన్ మోహన్ రెడ్డికి లేక రాశారు. కేంద్రం తన బాధ్యతలను రాష్ట్రానికి వదిలేసి చోద్యం చూస్తోందన్నారు. పోలవరంపై ఇతర రాష్ట్రాలను ఒప్పించే బాధ్యత పోలవరం అథారిటేనని.. ఈ నెల 29న కేంద్రం సమక్షంలో జరిగే సమావేశంలో గట్టిగా డిమాండ్ చేయాలని లేఖలో కోరారు. కేంద్రం తీరు వల్లే పోలవరం ప్రాజెక్టుపై అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయని.. ఒడిస్సా, ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వాలు సుప్రీంకోర్టుకు వెళ్లాయని చెప్పారు. పోలవరం ప్రాజెక్టు కరకట్టల నిర్మాణానికి ఒడిస్సా, ఛత్తీస్‌గఢ్ ప్రజాభిప్రాయ సేకరణ జరపాల్సిన బాధ్యత కూడా కేంద్రానిదేనని జగన్‌కు లేఖలో కేవీపీ తెలిపారు.
29 వ తేదీన పోలవరం ముంపుపై సమావేశం
కేవీపీ జగన్‌కు ఇలా లేక రాయడానికి కారణం ఈ నెల 29న పోలవరం ముంపు అంశంపై సమావేశం జరగనుంది. సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు కేంద్ర జలవనరుల మంత్రిత్వ శాఖ పోలవరం బ్యాక్‌వాటర్ ఎఫెక్ట్‌పై అధ్యయనం చేసేందుకు చర్యలు చేపట్టింది. అందులో భాగంగా ప్రాజెక్టు ప్రభావిత రాష్ర్టాలైన తెలంగాణ, ఏపీ, ఒడిశా, ఛత్తీస్‌గఢ్ రాష్ర్టాలతో ఈ నెల 29న సమావేశం నిర్వహించాలని నిర్ణయించింది. ఈ మేరకు ఆయా రాష్ర్టాలకు కేంద్ర జలవనరుల శాఖ లేఖలు రాసింది. సీడబ్ల్యూసీ కార్యదర్శి పంకజ్‌కుమార్ ఆధ్వర్యంలో ఈ సమావేశం ఇప్పటికే జరగాల్సి ఉంది. కానీ ముంపుపై అధ్యయనానికి సంబంధించి చర్చించాల్సిన అంశాలపై సిద్ధమయ్యేందుకు తమకు తగినంత సమయం ఇవ్వలేదని, హడావుడిగా సమావేశం ఏర్పాటు చేయడమేంటని ఒడిశా అభ్యంతరం వ్యక్తం చేయగా, ఆ సమావేశాన్ని వాయిదా వేశారు. ఈ నేపథ్యంలో కేంద్ర జలవనరుల శాఖ ఆ సమావేశాన్ని 29న నిర్వహించాలని నిర్ణయించింది.
అభ్యంతరం వ్యక్తం చేసిన రాష్ట్రాలతో చర్చించాలని సుప్రీంకోర్టు ఆదేశం
పొలవరం ప్రాజెక్టు కారణంగా తమ భూభాగంలోని ప్రాంతాలకు ముంపు ఉంటుందని తెలంగాణ, ఒడిశా, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాలు కోర్టుకెళ్లాయి. ఆ ప్రాజెక్టుతో కొన్నిచోట్ల వరద ముంపు తలెత్తుతుందని పేర్కొనగా, మొదట్లో తెలిపిన ప్రకారం కాకుండా పెద్ద ఎత్తున ప్రాజెక్టును విస్తరించడంతో సమస్యలు మొదలయ్యాయని సుప్రీంకోర్టుకు తెలిపారు. పర్యావరణ అనుమతుల మేరకు నిర్మాణం జరిగిందో లేదో మరోసారి సమీక్షించాలని ధర్మాసనాన్ని ఈ మూడు రాష్ట్రాలు కోరాయి. భాగస్వామ్య పక్షాలన్నింటితో కేంద్రం ఉన్నత స్థాయి సమావేశం ఏర్పాటు చేసి, సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని జస్టిస్ సంజయ్ కిషన్ కౌల్ గత సెప్టెంబర్‌లో ఆదేశాలు జారీ చేశారు.
అయితే ఇది ఏపీ చేపడుతున్న ప్రాజెక్టు కాదని, కేంద్రం నిధులతో నిర్మిస్తున్న ప్రాజెక్టు అని ఏపీ వాదిస్తోంది. ఇది కేంద్ర ప్రాజెక్టు కాబట్టి.. ఇందులో ఉన్న వివాదాస్పద అంశాల పరిష్కారానికి ఇతర రాష్ట్రాల సీఎస్‌లతో కేంద్రం ఓ సమావేశం ఏర్పాటు చేయ్నారు. ప్రాజెక్టుకు ఇబ్బందులు తలెత్తకుండా పర్యావరణ అనుమతుల సమస్యనూ పరిష్కరించాలని కోరుతోంది.