Pothole+ Alerts For Ather Scooters: దేశీయ ఎలక్ట్రిక్‌ ద్విచక్ర వాహన తయారీ సంస్థ అథర్‌ ఎనర్జీ, తన యూజర్ల కోసం మరో వినూత్న ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. రోడ్లపై ప్రయాణాన్ని మరింత సురక్షితంగా మార్చే లక్ష్యంతో రూపొందించిన 'పోత్‌హోల్‌ ప్లస్‌ అలర్ట్స్‌' ఫీచర్‌ను Gen 2 & ఆ తర్వాతి తరం అథర్‌ ఎలక్ట్రిక్‌ స్కూటర్లకు విడుదల చేయడం ప్రారంభించింది. ఈ ఫీచర్‌ ద్వారా... ప్రయాణికులకు రోడ్డుపై గుంతలు, పాడైన రహదారులు, ఎత్తుపల్లాలు & స్పీడ్‌ బ్రేకర్ల గురించి ముందుగానే హెచ్చరికలు అందుతాయి.

Continues below advertisement

ప్రస్తుతం ఈ సాఫ్ట్‌వేర్‌ అప్‌డేట్‌ అథర్‌ 450 అపెక్స్‌, 450ఎక్స్‌ & రిజ్టా జెడ్‌ మోడళ్లకు అందుబాటులోకి వస్తోంది. ఇది పూర్తిగా సాఫ్ట్‌వేర్‌ ఆధారిత ఫీచర్‌ కావడంతో కొత్త హార్డ్‌వేర్‌ను అమర్చాల్సిన అవసరం లేదు. అప్‌డేట్‌ పూర్తయ్యాక స్కూటర్‌లో ఈ సదుపాయం ఆటోమేటిక్‌గా పనిచేస్తుంది.

రాత్రి వేళల్లో & వర్షాకాలంలో చాలా ఉపయోగంనావిగేషన్‌ను ఉపయోగిస్తున్న సమయంలో ముందున్న రహదారిపై గుంతలు, పాడైన రోడ్డు భాగాలు, ఎత్తుపల్లాలు లేదా స్పీడ్‌ బ్రేకర్లు ఉన్నట్లు గుర్తిస్తే స్కూటర్‌ డ్యాష్‌బోర్డుపై విజువల్‌ అలర్ట్‌ కనిపిస్తుంది. దీంతో రైడర్‌కు ముందుగానే అప్రమత్తం అయ్యే అవకాశం ఉంటుంది. రాత్రి వేళల్లో, పొగమంచు సమయంలో & వర్షాకాలంలో రోడ్లపై కనిపించని గుంతలను గుర్తించడంలో ఈ ఫీచర్‌ మరింత ఉపయోగపడుతుంది.

Continues below advertisement

ఇది కూడా చదవండి: కొత్త Toyota Hiluxలో వచ్చిన మార్పులేంటి? పాత మోడల్‌తో పోలిస్తే కీలక తేడాలు ఇవే

విజువల్‌ అలర్ట్స్‌తో పాటు ఆడియో హెచ్చరికలు కూడా అందుబాటులో ఉంటాయి. స్కూటర్‌లోని స్పీకర్ల ద్వారా లేదా అథర్‌ హాలో స్మార్ట్‌ హెల్మెట్‌ ద్వారా లేదా Bluetooth హెడ్‌సెట్‌కు ఈ అలర్ట్స్‌ వినిపిస్తాయి. దీంతో రైడర్‌ డ్యాష్‌బోర్డ్‌ను పదేపదే చూడాల్సిన అవసరం లేకుండా పూర్తిగా రోడ్డుపైనే దృష్టి సారిస్తూ సురక్షితంగా ప్రయాణించవచ్చు.

కనెక్టెడ్‌ స్కూటర్ల నుంచి డేటా సేకరణఈ ఫీచర్‌కు బలం అథర్‌ రూపొందించిన కనెక్టెడ్‌ రోడ్‌ ఇంటెలిజెన్స్‌ సిస్టమ్‌. కంపెనీ కనెక్టెడ్‌ స్కూటర్ల నుంచి వినియోగదారుల వ్యక్తిగత వివరాలను వెల్లడించకుండా సేకరించిన డేటాను విశ్లేషించి.. తరచుగా గుంతలు ఉండే ప్రాంతాలు, పాడైన రహదారులు & స్పీడ్‌ బ్రేకర్ల సమాచారాన్ని గుర్తిస్తుంది. ఈ సమాచారం ఆధారంగా తర్వాత అదే మార్గంలో ప్రయాణించే ఇతర అథర్‌ వినియోగదారులకు ముందుగానే హెచ్చరికలు పంపిస్తుంది. దీంతో రోడ్డు పరిస్థితులపై మరింత ఖచ్చితమైన సమాచారం అందించగలుగుతోంది.

ఇది కూడా చదవండి: మీది E20 పెట్రోల్‌కు అనుకూలమైన వాహనమేనా? ప్రభుత్వం ఏం చెప్పింది? ఏ పార్ట్స్ ఎఫెక్ట్ అవుతాయి?

అథర్‌ ఈ పోత్‌హోల్‌ ప్లస్‌ అలర్ట్స్‌ ఫీచర్‌ను తొలిసారిగా 2025లో నిర్వహించిన కమ్యూనిటీ డే కార్యక్రమంలో ప్రదర్శించింది. అయితే దీనిని యూజర్లకు అందుబాటులోకి తీసుకురావడానికి కొంత సమయం పట్టిందని కంపెనీ తెలిపింది. విశ్వసనీయమైన హెచ్చరికలు ఇవ్వాలంటే పెద్ద మొత్తంలో కనెక్టెడ్‌ స్కూటర్ల నుంచి డేటా సేకరించి విశ్లేషించాల్సి వచ్చిందని అథర్‌ ఎనర్జీ సీఈఓ తరుణ్‌ మెహతా వెల్లడించారు.

ప్రస్తుతం ఈ ఫీచర్‌ను దశలవారీగా సాఫ్ట్‌వేర్‌ అప్‌డేట్‌ రూపంలో విడుదల చేస్తున్నారు. Gen 2 & ఆ తర్వాతి తరం అథర్‌ స్కూటర్లకు మాత్రమే ఇది అందుబాటులో ఉంటుంది. ముఖ్యంగా 450 అపెక్స్‌, 450ఎక్స్‌ & రిజ్టా జెడ్‌ వినియోగదారులు ఈ కొత్త భద్రతా ఫీచర్‌ను ఉపయోగించుకోగలరు. రోడ్డు భద్రతకు ప్రాధాన్యం ఇస్తూ స్మార్ట్‌ టెక్నాలజీని వినియోగిస్తున్న అథర్‌ ఈ కొత్త ఫీచర్‌తో ఎలక్ట్రిక్‌ స్కూటర్‌ రంగంలో మరో ముందడుగు వేసిందని చెప్పవచ్చు. ప్రయాణాన్ని మరింత సురక్షితంగా & సౌకర్యవంతంగా మార్చే ఈ అప్‌డేట్‌కు వినియోగదారుల నుంచి మంచి స్పందన లభించే అవకాశాలు కనిపిస్తున్నాయి.

ఇంకా ఇలాంటి ఆటోమొబైల్‌ వార్తలు & అప్‌డేట్స్‌ - "ABP దేశం" 'ఆటో' సెక్షన్‌ని ఫాలో అవ్వండి.