Affordable 7 seater cars in low budget 2025: మీ ఇంట్లో ఎక్కువ మంది ఉండి, మీకు పెద్ద కారు కావాలంటే, 7-సీటర్ MPV అవసరం అవుతుంది. అయితే, 7-సీటర్ కారు కొనేంత స్థోమత అందరికీ ఉండకపోవచ్చు. 7-సీటర్ కారుపై ఆశ చంపుకోలేక, ఎక్కువ ధర పెట్టలేక కారు కొనడాన్ని వాయిదా వేస్తూ ఉండవచ్చు. ఇకపై వాయిదాల అవసరం రాదు. తెలుగు రాష్ట్రాల్లో చాలా బడ్జెట్ MPVలు అందుబాటులో ఉన్నాయి. ఇవి తక్కువ ధరలోనే ఎక్కువ స్పేస్, మెరుగైన మైలేజ్ & ఆధునిక ఫీచర్లను అందిస్తాయి. ఈ విభాగంలో, పాపులర్ అయిన 3 అత్యంత తక్కువ ధర 7-సీటర్ MPVల (రెనాల్ట్ ట్రైబర్, మారుతి ఎర్టిగా & టయోటా రూమియన్) గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
రెనాల్ట్ ట్రైబర్ ఫేస్‌లిఫ్ట్
Renault Triber Facelift రీసెంట్‌గా లాంచ్ అయింది, ఇది మన దేశంలోనే అత్యంత తక్కువ ధర 7-సీట్ల MPV. ఈ కారు ఎక్స్-షోరూమ్ ధర కేవలం రూ. 6.30 లక్షల నుంచి ప్రారంభం అవుతుంది, వేరియంట్‌ను బట్టి రూ. 9.17 లక్షల వరకు ఉంటుంది. దీనికి 1.0 లీటర్ 3-సిలిండర్ పెట్రోల్ ఇంజిన్ లభిస్తుంది, ఇది 71 bhp పవర్ & 96 Nm టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఈ కారు మాన్యువల్ & AMT ట్రాన్స్‌మిషన్ ఎంపికలలో లభిస్తుంది. కంపెనీ లెక్క ప్రకారం, ట్రైబర్ మైలేజ్ లీటరుకు 18 నుంచి 20 కిలోమీటర్ల మధ్య ఉంటుంది. 40-లీటర్ ఇంధన ట్యాంక్‌ను పూర్తిగా నింపితే దాదాపు 800 కిలోమీటర్ల దూరం ప్రయాణించగలదని చెబుతున్నారు.
రెనాల్ట్ ట్రైబర్‌ను కొన్ని డీలర్‌షిప్‌లలో CNG కిట్‌తో కొనుగోలు చేసే ఆప్షన్ కూడా ఉంది, ఇది ఇంకా ఎక్కువ మైలేజ్ ఇస్తుంది. ఈ MPVలో డ్యూయల్ ఫ్రంట్ ఎయిర్‌బ్యాగులు, ABS, EBD, రియర్ పార్కింగ్ సెన్సార్ & కెమెరా వంటి భద్రతా ఫీచర్లు ఉన్నాయి.
మారుతి సుజుకి ఎర్టిగా
Maruti Suzuki Ertiga భారతదేశంలో ఎక్కువ మంది ఇష్టపడే 7-సీటర్ MPV. తెలుగు రాష్ట్రాల్లో దీని ధర రూ. 9.11 లక్షల నుంచి రూ. 13.40 లక్షల (ఎక్స్-షోరూమ్) మధ్య ఉంటుంది. ఇది 1.5 లీటర్ స్మార్ట్ హైబ్రిడ్ పెట్రోల్ ఇంజిన్‌తో నడుస్తుంది. ఈ ఇంజిన్ 103 bhp పవర్ & 138 Nm టార్క్‌ను అందిస్తుంది. ఈ కారు మాన్యువల్ & ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఎంపికలలో లభిస్తుంది & CNG వెర్షన్‌లో కూడా కొనుగోలు చేయవచ్చు.
కంపెనీ డేటా ప్రకారం, ఎర్టిగా పెట్రోల్ మోడల్ లీటరుకు 20.51 కి.మీ. మైలేజీని ఇస్తుంది, CNG వెర్షన్ కిలోగ్రాముకు 26.08 కి.మీ. మైలేజీని ఇవ్వగలదు. ఈ MPVలో 4 ఎయిర్ బ్యాగులు, ABS, EBD, ISOFIX చైల్డ్ సీట్ మౌంట్స్ వంటి సేఫ్టీ ఫీచర్లు ఉన్నాయి. ఇంటీరియర్‌లో 7-అంగుళాల టచ్‌స్క్రీన్, స్మార్ట్ హైబ్రిడ్ టెక్నాలజీ, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ & స్టీరింగ్ మౌంటెడ్ కంట్రోల్స్, మరికొన్ని ఆధునిక లక్షణాలు ఉన్నాయి.
టయోటా రూమియన్
Toyota Rumion అనేది మారుతి ఎర్టిగాకు రీ-బ్యాడ్జ్‌డ్ వెర్షన్. ఈ కారు ఎర్టిగా డిజైన్, ప్లాట్‌ఫామ్ & ఇంటీరియర్‌తోనే రూపొందింది, కంపెనీ లోగో మాత్రం టయోటా అని ఉంటుంది. దీని ఎక్స్-షోరూమ్ ధర రూ. 10.67 లక్షల నుంచి రూ. 13.96 లక్షల వరకు ఉంటుంది, ఇది ఎర్టిగా కంటే కొంచెం ఎక్కువ. రూమియన్ 1.5-లీటర్ K-సిరీస్ పెట్రోల్ ఇంజిన్‌తో పని చేస్తుంది. ఇది 102 bhp శక్తిని & 137 Nm టార్క్‌ను ఇస్తుంది. దీనిని 5-స్పీడ్ మాన్యువల్ & 6-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌తో కొనుగోలు చేయవచ్చు & CNG వెర్షన్‌లోనూ కొనే ఛాయిస్ ఉంది.
రూమియన్ పెట్రోల్ వెర్షన్ లీటరుకు 20.51 కిలోమీటర్ల మైలేజీని ఇస్తుంది & CNG వెర్షన్ కిలోగ్రాముకు 26.08 కిలోమీటర్ల వరకు మైలేజీని ఇస్తుంది. ఎర్టిగా మాదిరిగానే ఇంజన్ & ఫీచర్లు కలిగి ఉన్నప్పటికీ టయోటా బ్యాడ్జ్ దీనికి ప్రీమియం టచ్ ఇస్తుంది. టయోటా బలమైన సర్వీస్ నెట్‌వర్క్ దీనిని ప్లస్ పాయింట్.