2026 Tata Punch EV Price, Range And Features Telugu: ఎలక్ట్రిక్ కారు కొనే ప్రతి ఒక్కళ్లు ఎదుర్కొనే సమస్య ఒకటే.. కంపెనీ చెప్పే రేంజ్ ఒకటి, రోజువారీ వినియోగంలో వచ్చే రేంజ్ మరొకటి. ఎలక్ట్రిక్‌ కారు కొన్నవాళ్లు, కొనబోతున్నవాళ్లు ఈ వ్యత్యాసం గురించి తెలుసుకోవడం చాలా అవసరం. 2026 టాటా పంచ్ ఈవీ వాస్తవ పరిస్థితుల్లో ఎంత రేంజ్ ఇస్తుందనే విషయాన్ని ఆటో ఎక్స్‌పర్ట్‌లు పరీక్షించారు. ఫలితాలు ఆసక్తికరంగా ఉన్నాయి.

Continues below advertisement

టాటా కంపెనీ, 2026 పంచ్ ఈవీలో డిజైన్‌లో మార్పులు చేసింది. పవర్‌ట్రెయిన్‌ను కూడా అప్‌డేట్ చేసింది. లార్జ్‌ బ్యాటరీ ఆప్షన్లు తీసుకొచ్చింది. ముఖ్యంగా, ఈ కారు ప్రారంభ ధర కూడా తగ్గింది. ప్రస్తుతం ఈ కారు ధర రూ.9.69 లక్షల నుంచి రూ.12.79 లక్షల (ఎక్స్ షోరూమ్) వరకు ఉంది.

2026 టాటా పంచ్ EV రెండు బ్యాటరీ ఎంపికలతో అందుబాటులో ఉంది, అవి - 30 కిలోవాట్ అవర్ & 40 కిలోవాట్ అవర్ బ్యాటరీలు. పాత మోడల్‌తో పోలిస్తే బ్యాటరీ సామర్థ్యం పెరిగింది.

Continues below advertisement

ఆటో ఎక్స్‌పర్ట్‌లు ఆ కారు అసలైన రేంజ్ పరీక్ష కోసం 40 కిలోవాట్ అవర్ బ్యాటరీ ఉన్న పంచ్ ఈవీని ఉపయోగించారు. ఇందులో PMSM మోటార్ ఉంటుంది. ఈ మోటార్ 129hp శక్తిని & 154Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.

డ్రైవింగ్ కోసం ఎకో, సిటీ & స్పోర్ట్ అనే మూడు మోడ్‌లు ఉన్నాయి. ఆటో ఎక్స్‌పర్ట్‌లు.. రేంజ్ పరీక్ష కోసం ఎకో మోడ్‌ను ఉపయోగించారు. నగరంలో రీజనరేటివ్ బ్రేకింగ్ స్థాయి L3గా ఉంచారు. హైవేపై L1 స్థాయిని ఉపయోగించారు.

పంచ్ ఈవీ నిజంగా ఎంత రేంజ్ ఇచ్చింది?

సిటీ రోడ్లపై ఈ కారు కిలోవాట్ అవర్‌కు 7.92 కిలోమీటర్ల దూరం ప్రయాణించింది. దీని ఆధారంగా, పూర్తి ఛార్జ్‌పై సుమారు 317 కిలోమీటర్ల రేంజ్ వస్తుందని లెక్కించారు.

హైవేపై మాత్రం రేంజ్ కొంత తగ్గింది. అక్కడ కిలోవాట్ అవర్‌కు 7.29 కిలోమీటర్ల రేంజ్‌ ఇచ్చింది. దీని ఆధారంగా, సుమారు 291 కిలోమీటర్ల రేంజ్ వస్తుందని తేలింది.

నగరం & హైవే రెండింటినీ కలిపి చూస్తే, కిలోవాట్ అవర్‌కు సగటున 7.61 కిలోమీటర్లు నమోదైంది. అంటే.. ఫుల్‌ ఛార్జ్‌పై వాస్తవ పరిస్థితుల్లో సుమారు 304 కిలోమీటర్లు ప్రయాణించవచ్చని పరీక్షలో తేలింది.

ఇక్కడ మరో విషయం గమనించాలి. కంపెనీ ప్రకటించే ARAI రేంజ్ 468 కిలోమీటర్లు. కానీ వాస్తవ వినియోగంలో 304 కిలోమీటర్ల రేంజ్ మాత్రమే వచ్చింది. అంటే కారు రేంజ్‌ను అంచనా వేసేటప్పుడు అధికారిక గణాంకాలతో పాటు వాస్తవ పరీక్ష ఫలితాలను కూడా పరిగణనలోకి తీసుకోవాలి.

ఇది కూడా చదవండి: రూ.1.10 లక్షల ధరతో సింపుల్‌ వేవ్‌ ఎలక్ట్రిక్‌ స్కూటర్‌ లాంచ్‌.. సింగిల్‌ ఛార్జ్‌తో 243km తిరిగిరావచ్చు!

ఛార్జింగ్ టైమ్‌

గత మోడల్‌తో పోలిస్తే, 2026 పంచ్ ఈవీ DC ఫాస్ట్ ఛార్జింగ్ సామర్థ్యాన్ని కూడా కంపెనీ పెంచింది. పాత మోడల్‌లో 50 కిలోవాట్ల సామర్థ్యం ఉండగా, ఇప్పుడు 65 కిలోవాట్ల వరకు సపోర్ట్‌ చేస్తుందని టాటా చెబుతోంది.

ఈ పరీక్షలో 180 కిలోవాట్ల DC ఫాస్ట్ ఛార్జర్‌ను ఉపయోగించారు. ఇందులో గరిష్ఠంగా సుమారు 67.3 కిలోవాట్ల ఛార్జింగ్ స్పీడ్‌ నమోదైంది. అయితే బ్యాటరీ 50 శాతం దాటిన తర్వాత ఛార్జింగ్ వేగం తగ్గింది. 90 శాతం దాటిన తర్వాత వేగం మరింత తగ్గింది.

20 శాతం నుంచి 80 శాతం వరకు బ్యాటరీని ఛార్జ్ చేయడానికి 27 నిమిషాలు పట్టింది. పూర్తిగా 100 శాతం ఛార్జ్ చేయడానికి మరో 31 నిమిషాలు పట్టింది.

ఇది కూడా చదవండి: బ్యాంక్‌ ఇచ్చే లోన్‌ను బట్టి కాదు.. మీ ఆదాయానికి తగ్గట్లు ఎంత విలువైన కారు కొనాలో ఇలా లెక్కించండి!

పరీక్ష సమయంలో, కారులోని క్లైమేట్‌ కంట్రోల్‌ను 22 డిగ్రీల వద్ద ఉంచారు. మ్యూజిక్‌ సిస్టమ్‌, ఇండికేటర్లు & ముందు సీట్ల వెంటిలేషన్ వంటి ఫీచర్లను సాధారణ వినియోగదారుల తరహాలనే అవసరమైనప్పుడు ఉపయోగించారు. అందుకే ఈ పరీక్ష ఫలితాలు రోజువారీ వినియోగానికి దగ్గరగా ఉంటాయని చెప్పొచ్చు. నగరంలో 317 కిలోమీటర్లు, హైవేపై 291 కిలోమీటర్లు & సగటున 304 కిలోమీటర్ల వాస్తవ రేంజ్‌ను పంచ్ ఈవీ 40 కిలోవాట్ అవర్ వెర్షన్ అందించింది. కాబట్టి 468km అధికారిక రేంజ్ చూసి నిర్ణయం తీసుకోకుండా, వాస్తవ పరిస్థితుల్లో సుమారు 300 కిలోమీటర్ల పరిధిని అంచనా వేసుకుని కారు కొనుగోలు చేయడం మంచిది.

ఇంకా ఇలాంటి ఆటోమొబైల్‌ వార్తలు & అప్‌డేట్స్‌ కోసం "ABP దేశం" 'ఆటో' సెక్షన్‌ని ఫాలో అవ్వండి.