How Much Car Can I Really Afford: కారు కొనడం అంటే చాలామందికి ఓ పెద్ద కల. కొత్త కారు ఇంటికి వస్తే ఆనందమే. కానీ ఆ ఆనందం కోసం ఆర్థిక భారం పెంచుకోవడం మాత్రం మంచిది కాదు. కారు కొనేముందు ఒక విషయం తప్పకుండా ఆలోచించాలి. మన ఆదాయానికి ఎంత ధర ఉన్న కారు సరిపోతుంది?. చాలామంది షోరూమ్‌కు వెళ్లగానే కారు ధరను కాకుండా నెలవారీ EMIని చూస్తారు. ఇదే పెద్ద తప్పు. నెలకు మరో రూ.2,000 లేదా రూ.5,000 ఎక్కువ చెల్లిస్తే ఖరీదైన కారు తీసుకోవచ్చని అనిపిస్తుంది. కానీ రుణ కాలం పెరిగితే మొత్తం వడ్డీ కూడా పెరుగుతుంది. అందుకే ముందుగా మొత్తం కారు బడ్జెట్‌ను నిర్ణయించుకోవాలి. తర్వాతే కారు కోసం వెతకాలి.
సాధారణంగా, ఆదాయాన్ని బట్టి కారు ధరను నిర్ణయించుకునే ఓ సూత్రం ఉంది. వార్షిక స్థూల ఆదాయంలో సుమారు 20 నుంచి 30 శాతానికి కారు ధరను పరిమితం చేసుకోవడం వల్ల పెద్ద బర్డెన్ లేకుండా ఉంటుంది. అయితే, ఈ లెక్క ప్రకారం.. ఏడాదికి రూ.6 లక్షలు సంపాదించే వ్యక్తి రూ.1.50 లక్షలు నుంచి రూ.1.80 లక్షల విలువైన కారు మాత్రమే కొనాలని కాదు. ఇక్కడ కారు ధరను నిర్ణయించేటప్పుడు ఇతర ఆర్థిక బాధ్యతలను కూడా పరిగణనలోకి తీసుకోవాలి. భారత మార్కెట్‌లో రూ.5 లక్షల నుంచి రూ.8 లక్షల వరకు ఉండే చిన్న కార్లు లేదా సెకండ్‌హ్యాండ్ కార్లు కొందరికి సరైన ఎంపిక కావచ్చు.
ఏడాదికి రూ.10 లక్షల ఆదాయం ఉన్న వ్యక్తి రూ.10 లక్షల కారు కొనాల్సిన అవసరం లేదు. రూ.6-8 లక్షల పరిధిలో కారు తీసుకుంటే ఆర్థిక ఒత్తిడి తగ్గవచ్చు. ఆదాయం పెరిగినంత మాత్రాన ఖరీదైన కారు కొనాల్సిన అవసరం లేదు.
స్టోరీ ఇంకా ఉంది..
కారు ధరను నిర్ణయించుకున్నంత మాత్రాన కథ ముగిసినట్లు కాదు. డౌన్ పేమెంట్, EMI, రిజిస్ట్రేషన్, ఇన్సూరెన్స్, ఇంధనం, సర్వీసింగ్, పార్కింగ్ వంటి నిర్వహణ ఖర్చులు కూడా ఉంటాయి. కొన్ని కార్ల నిర్వహణ ఖర్చు తక్కువగా ఉంటుంది. మరికొన్ని కార్లకు ఇంధనం & సర్వీసింగ్ ఖర్చు ఎక్కువగా ఉంటుంది. అందుకే.. నెలకు కారు కోసం ఎంత ఖర్చు చేయగలమో ముందే లెక్కించాలి. ఉదాహరణకు, మీకు రూ.15,000 EMI చెల్లించడం సులభంగా అనిపించినా, ఇంధనం, ఇన్సూరెన్స్, నిర్వహణ కలిపి నెలకు రూ.20,000 వరకు ఖర్చు కావచ్చు.
డౌన్ పేమెంట్ విషయంలో కూడా జాగ్రత్త అవసరం. వీలైతే కారు ధరలో కనీసం 20 శాతం వరకు ముందుగా చెల్లించడం మంచిది. దీంతో రుణ మొత్తం తగ్గుతుంది. వడ్డీ భారం కూడా కొంత తగ్గుతుంది. అయితే, డౌన్ పేమెంట్ కోసం మొత్తం మీ పొదుపును ఖాళీ చేయకూడదు. అత్యవసర పరిస్థితులకు కొంత డబ్బు తప్పనిసరిగా మిగిలి ఉండాలి.
ఇది కూడా చదవండి: కారు సైడ్ మిర్రర్‌పై కనిపించే ఆ నిలువు గీత 'తయారీ లోపం కాదు'.. మీ భద్రత కోసమే!
రుణ కాలపరిమితి
ఏడు సంవత్సరాల వరకు సుదీర్ఘ కాలానికి కారు లోన్ తీసుకోవడం ఇప్పుడు సాధారణంగా మారింది. తక్కువ EMI కనిపించడం వల్ల ఖరీదైన కారు కూడా అందుబాటులో ఉన్నట్లు అనిపిస్తుంది. కానీ రుణ కాలం పెరిగే కొద్దీ మొత్తం వడ్డీ పెరుగుతుంది. కారు విలువ తగ్గిపోతున్న సమయంలో కూడా మీరు రుణం చెల్లిస్తూనే ఉంటారు. ఈ విషయాన్ని కూడా గుర్తు పెట్టుకోవాలి.
మీ పాత కారును అమ్మేటప్పుడు కూడా జాగ్రత్త అవసరం. పాత కారుపై రుణం ఇంకా ఉంటే, ఆ మొత్తాన్ని కొత్త రుణంలో కలిపేయడం మంచిది కాదు. ఇలా చేస్తే పాత కారు రుణం కూడా కొత్త కారుపై పడుతుంది. ఫైనల్‌గా.. మీపై ఆర్థిక భారం పెరుగుతుంది. అందుకే.. బ్యాంకు ఎంత లోన్ ఇస్తుందో చూసి కారు కొనకండి. మీ అవసరాలు, ఆదాయం, పొదుపు, నెలవారీ ఖర్చులు చూసి బడ్జెట్ నిర్ణయించండి. కారు మీ జీవితాన్ని సులభతరం చేయాలిగానీ మీ మొత్తం జీవితాన్ని EMIల చుట్టూ తిప్పేలా ఉండకూడదు.
ఇది కూడా చదవండి: ఒక్కసారి ఛార్జ్ చేస్తే హైదరాబాద్ నుంచి విశాఖకు నాన్ స్టాప్ జర్నీ.. లగ్జరీ ఈవీ Volvo ex90 రెడీ
ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన ముఖ్యమైన విషయం ఒక్కటే. మీకు బ్యాంకు ఇచ్చే గరిష్ఠ రుణం మీ కారు బడ్జెట్ కాదు. మీరు ఒత్తిడి లేకుండా చెల్లించగలిగే మొత్తమే మీ అసలైన కారు బడ్జెట్. షోరూమ్‌కు వెళ్లేముందే మీ బడ్జెట్‌ను నిర్ణయించుకోండి. ఆ బడ్జెట్‌లోనే కారు ఎంచుకోండి. అవసరమైతే కొంచెం తక్కువ ధర ఉన్న కారును ఎంచుకోవడం మంచిదే. ఎందుకంటే.. మంచి కారు అంటే ఖరీదైన కారు కాదు, కొన్న తర్వాత కూడా మీ చేతిలో డబ్బును మిగిల్చే కారు.
ఇంకా ఇలాంటి ఆటోమొబైల్ వార్తలు & అప్‌డేట్స్ కోసం "ABP దేశం" 'ఆటో' సెక్షన్‌ని ఫాలో అవ్వండి.
