2024 Maruti Suzuki Swift: మారుతి సుజుకి భారతదేశంలో తన తదుపరి అతిపెద్ద లాంచ్‌గా రాబోయే నెలల్లో కొత్త స్విఫ్ట్‌ను విడుదల చేయబోతోంది. వైఈడీ (YED) అనే కోడ్‌నేమ్‌తో రానున్న తదుపరి తరం స్విఫ్ట్ దాని మునుపటి మోడల్ కంటే ఎక్కువ ఫీచర్లతో రానుందని భావిస్తున్నారు.


ఇంటీరియర్, ఫీచర్లు, సెక్యూరిటీ ఎలా ఉంటాయి?
రాబోయే కొత్త తరం స్విఫ్ట్ ఇప్పటికే జపాన్, యూరోప్‌లో అమ్మకానికి ఉంది. ఇది ఇండియా స్పెక్ మోడల్ ఫీచర్ లిస్టింగ్ గురించి ఒక ఐడియాను అందిస్తుంది. దీని ఇంటీరియర్ భారతదేశంలోని బలెనో, ఫ్రంట్, బ్రెజ్జా వంటి కొత్త మారుతి సుజుకి కార్లను పోలి ఉంటుంది.


గ్లోబల్ స్పెక్ స్విఫ్ట్‌లో ఎల్ఈడీ హెడ్‌లైట్లు, టెయిల్ లైట్లు, ఎల్ఈడీ డీఆర్ఎల్స్, 16 అంగుళాల అల్లాయ్ వీల్స్, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, ఎలక్ట్రికల్ అడ్జస్టబుల్, ఫోల్డబుల్ వింగ్ మిర్రర్స్, ఆటో హెడ్‌ల్యాంప్‌లు, వైర్‌లెస్ యాపిల్ కార్‌ప్లే, ఆండ్రాయిడ్ ఆటోతో కూడిన ఫ్రీ స్టాండింగ్ 9 అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ వంటి ఎన్నో ఫీచర్లు ఉన్నాయి.


అలాగే సెక్యూరిటీ కోసం ఇందులో ఆరు ఎయిర్‌బ్యాగ్‌లు, టైర్ ప్రెజర్ మానిటర్, ఈబీడీ, బ్రేక్ అసిస్ట్‌తో కూడిన ఏబీఎస్, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ ప్రోగ్రామ్, హిల్ హోల్డ్ కంట్రోల్ అలాగే లేన్ కీపింగ్ అసిస్ట్, బ్లైండ్ స్పాట్ మానిటర్, అడాప్టివ్ క్రూయిజ్ కంట్రోల్, లేన్ డిపార్చర్ వార్నింగ్ వంటి ఫీచర్లు ఉన్నాయి.


భారతదేశంలో స్విఫ్ట్‌లో ఇప్పటికే ఉన్న ఫీచర్లు కాకుండా కంపెనీ ఇతర మోడళ్లతో కూడా పోటీ పడేందుకు తదుపరి తరం వెర్షన్‌లో చాలా ఫీచర్లు చేర్చనున్నారు. అయితే ఇందులో ఏడీఏఎస్ టెక్నాలజీ మాత్రం అందుబాటులో ఉండదు.


డిజైన్, ప్లాట్‌ఫాం ఇలా...
కొత్త తరం స్విఫ్ట్‌లోని డిజైన్ మార్పులు చాలా ఆకర్షణీయంగా ఉన్నాయి. అయినప్పటికీ డిజైన్ ఫిలాసఫీలో ఎటువంటి మార్పు లేదు. స్టైలింగ్ మాత్రం చాలా షార్ప్‌గా, అడ్వాన్స్‌డ్‌గా ఉంది. కొత్త స్విఫ్ట్ అవుట్‌గోయింగ్ మోడల్ కంటే 15 మిల్లీమీటర్లు పెద్దగా, 40 మిల్లీమీటర్లు వెడల్పు, 30 మిల్లీమీటర్లు పొడవు ఉంటుంది. అయితే వీల్‌బేస్ అవుట్‌గోయింగ్ మోడల్‌గా 2,450 మిల్లీమీటర్ల వద్ద ఉంది. కంపెనీ దీనిని నాలుగో తరం మోడల్‌గా పిలుస్తోంది. అయితే కొత్త తరం స్విఫ్ట్ అదే హార్ట్‌టెక్ ప్లాట్‌ఫారమ్‌పై ఆధారపడి ఉంటుంది.


లాంచ్ ఎప్పుడు? ధర ఎంత?
మారుతి సుజుకి కొత్త స్విఫ్ట్ కోసం అధికారిక లాంచ్ తేదీని కంపెనీ ఇంకా ప్రకటించలేదు. అయితే ఇది రాబోయే కొన్ని నెలల్లో లాంచ్ కానుందని భావిస్తున్నారు. కొత్త తరం డిజైర్ లాంచ్ అయిన కొంత కాలం తర్వాత ఇది లాంచ్ అవుతుంది. అయితే కొత్త స్విఫ్ట్‌లో కంపెనీ చేసిన మార్పులు, కొత్త ఫీచర్ల కారణంగా కొంచెం ఖరీదైనదిగా మారనుందని సమాచారం. మారుతి స్విఫ్ట్ ప్రస్తుత ధర రూ.5.99 లక్షల నుంచి రూ.9.03 లక్షల మధ్య ఉంది. హ్యుందాయ్ గ్రాండ్ ఐ10 నియోస్, టాటా టియాగోతో ఇది పోటీ పడనుంది.


Also Read: రూ.8 లక్షల్లోపు ధరలో టాప్-5 కార్లు ఇవే - బడ్జెట్‌లో కార్లు కావాలనుకునేవారికి బెస్ట్ ఆప్షన్ - ఈవీ కూడా!