ABP News CVoter Opinion Poll 2024: లోక్‌సభ ఎన్నికల ప్రక్రియ (Lok Sabha Elections 2024) మరి కొద్ది రోజుల్లో మొదలు కానుంది. ఏప్రిల్ 19న తొలి విడత పోలింగ్ జరగనుంది. మొత్తం 7 విడతల్లో జూన్ 1వ తేదీ వరకూ ఈ ఎన్నికలు కొనసాగనున్నాయి. ఈ క్రమంలోనే దేశ ప్రజల అభిప్రాయాలు ఎలా ఉన్నాయో తెలుసుకునే ప్రయత్నం చేసింది ABP CVoter Opinion Poll. ప్రధాని అభ్యర్థిగా ఎవరు ఉండాలని సర్వే చేపట్టగా అందులో 58% మంది ప్రస్తుత ప్రధాని నరేంద్ర మోదీకే ఓటు వేశారు. ఆయనే ఆ పదవికి సరైన వ్యక్తి అని తేల్చి చెప్పారు. ఇక ఎప్పటి నుంచో ప్రతిపక్షాల తరపున రాహుల్ ప్రధాని అభ్యర్థి అన్న ప్రచారం జరుగుతోంది. అందుకే ఈ ఒపీనియన్ పోల్‌లో రాహుల్ గురించీ అభిప్రాయాలు సేకరించింది ఏబీపీ సీఓటర్స్ ఒపీనియన్ పోల్. అందులో 16% మంది రాహుల్‌కి అనుకూలంగా ఓటు వేశారు. ఆయన ప్రధానిగా ఉండడానికి అర్హులే అని తమ అభిప్రాయాన్ని వెల్లడించారు.
అయితే...నరేంద్ర మోదీ, రాహుల్ గాంధీల్లో ఎవరినైనా ఒకరిని నేరుగా ఎన్నుకోవాల్సి వస్తే ఎవరికి ఓటు వేస్తారన్న కోణంలోనూ సర్వే జరిగింది. అందులో 62.4% మంది మోదీకి మద్దతునిచ్చారు. ఆయననే ప్రధానిగా ఎన్నుకుంటామని చెప్పారు. 28% మంది ఓటర్లు రాహుల్‌కి ఓటు వేశారు. ఇక ఈ సర్వేలో పాల్గొన్న వారిలో 2.4% మంది ప్రధాని పదవికి అరవింద్ కేజ్రీవాల్ కూడా సరైన వ్యక్తే అని చెప్పారు. 1.6% మంది ఓటర్లు మమతా బెనర్జీకి మద్దతు తెలిపారు. అఖిలేష్ యాదవ్‌కీ 1.5% మంది ఓటు వేశారు. 11.1% మంది ఇతరుల పేర్లు చెప్పగా...8.2% మంది చెప్పలేమని సమాధానమిచ్చారు.
సర్వేలో పాల్గొన్న ఓటర్లలో 23.6% మంది భారత్ అభివృద్ధి దిశగా దూసుకుపోతుందని అభిప్రాయపడ్డారు. 47.5% మంది తమ జీవితాలు ఎంతో మెరుగయ్యాయని చెప్పారు. 4.3% మంది తాము బాగానే ఉన్నప్పటికీ భారత్ మాత్రం ఇంకా పేదరికంలోనే ఉండిపోతోందని అసహనం వ్యక్తం చేశారు. 21.8% మంది తమ జీవితాలు ఏమీ బాగుపడలేదని, ప్రభుత్వం కూడా సమస్యల్లోనే ఉందని వెల్లడించారు. 11.1% ఓటర్లు ప్రధాని మోదీ పని తీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇక 11.8% మంది ఓటర్లు తమ రాష్ట్ర ముఖ్యమంత్రిని మార్చేయాలని చెప్పారు. ప్రస్తుతం దేశం ఎదుర్కొంటున్న సమస్యల్లో నిరుద్యోగం చాలా కీలకమైందని 31.9% మంది ఓటర్లు అభిప్రాయపడ్డారు. ఇక 23.1% మంది ఓటర్లు ద్రవ్యోల్బణం, ఆదాయం, ఆర్థిక సమస్యలతో సతమతం అవుతున్నట్టు చెప్పారు.
ఏప్రిల్ 1 నుంచి 9వ తేదీ వరకూ దాదాపు 2,600 మంది ఓటర్ల అభిప్రాయాలు సేకరించి ఈ ఫలితాలు విడుదల చేశారు. గతంలోనూ ఇలాంటి సర్వేలు జరగగా నరేంద్ర మోదీకే ఎక్కువ ఓట్లు పడ్డాయి. రాహుల్ గాంధీ రెండో స్థానానికి పరిమితమయ్యారు. మొదటి టర్మ్ కన్నా రెండో టర్మ్‌కి ప్రధాని నరేంద్ర మోదీ చరిష్మా పెరిగిపోయింది. అందుకే..కచ్చితంగా ఈ సారి హ్యాట్రిక్ కొడతామని బీజేపీ చాలా ధీమాగా చెబుతోంది. ఓటర్లను ఆకట్టుకునేలా మోదీ గ్యారెంటీల పేరుతో మేనిఫెస్టో కూడా విడుదల చేసింది.
Also Read: Voter Registration: ఓటు నమోదుకు లాస్ట్ ఛాన్స్, రేపటితో ముగియనున్న గడువు