2023 Honda Unicorn: కొత్త డియో హెచ్ స్మార్ట్‌ను లాంచ్ చేసిన తర్వాత, హోండా మోటార్‌సైకిల్, స్కూటర్ ఇండియా కొత్త ఓబీడీ2 కంప్లైంట్ 2023 యూనికార్న్‌ను కూడా మన దేశంలో విడుదల చేసింది. దీని ప్రారంభ ఎక్స్ షోరూమ్ ధర రూ.1,09,800గా ఉంది. ఇది పెర్ల్ ఇగ్నియస్ బ్లాక్, ఇంపీరియల్ రెడ్ మెటాలిక్, మ్యాట్ యాక్సిస్ గ్రే మెటాలిక్, పెర్ల్ సైరన్ బ్లూ కలర్ ఆప్షన్లలో ఎంట్రీ ఇచ్చింది.


ఇంజిన్ ఎలా ఉంది?
కొత్త 2023 హోండా యూనికార్న్‌లో బీఎస్6 OBD2 కంప్లైంట్ 160 సీసీ PGM-FI ఇంజన్ అందించారు. ఇది మెరుగైన పనితీరు, మైలేజీని అందిస్తుందని పేర్కొన్నారు. ఈ ఇంజన్ 7,500 ఆర్పీయం వద్ద 12.9 బీహెచ్‌పీ శక్తిని, 5,500 rpm వద్ద 14 ఎన్ఎం టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది 5 స్పీడ్ గేర్‌బాక్స్‌తో పెయిర్ అయింది. కౌంటర్ వెయిట్ బ్యాలెన్సర్‌ను కూడా అమర్చారు. ఇది వైబ్రేషన్‌ను తగ్గిస్తుంది. తక్కువ నుంచి అధిక rpm వరకు యాక్సెలరేషన్ వేగంగా లభిస్తుంది.


ఫ్రేమ్ డిజైన్
2023 హోండా యూనికార్న్‌లో సింగిల్ ఛానల్ యాంటీ లాక్ బ్రేకింగ్ సిస్టమ్, ముందు వెనుక ట్యూబ్‌లెస్ టైర్‌లు ఉన్నాయి. ఫ్లెక్సిబుల్ డైమండ్ ఫ్రేమ్ ఆధారంగా ఈ కొత్త మోటార్‌సైకిల్ వెనుక వైపు మోనోషాక్ సస్పెన్షన్ యూనిట్‌ను కలిగి ఉంది. దీని గ్రౌండ్ క్లియరెన్స్ 187 మిల్లీమీటర్లు కాగా, వీల్ బేస్ 1335 మిల్లీమీటర్లుగా ఉంది. మోటార్‌సైకిల్ సైడ్ కవర్, ఫ్రంట్ కౌల్, ఫ్యూయల్ ట్యాంక్‌పై 3D హోండా వింగ్ మార్క్‌పై క్రోమ్ ట్రీట్‌మెంట్‌ను అందించారు.


10 సంవత్సరాల వారంటీ
2023 యూనికార్న్ సీటు ఎత్తు 715 మిల్లీమీటర్లుగా ఉంది. ఇంధన ట్యాంక్ సామర్థ్యం 13 లీటర్లు కాగా, మోటార్‌సైకిల్ మొత్తం బరువు 140 కిలోలు. దీని ముందు భాగంలో డిస్క్ బ్రేక్, వెనుక డ్రమ్ బ్రేక్‌లను పొందుతుంది. హోండా కొత్త యూనికార్న్ కోసం ప్రత్యేక వారంటీ ప్రోగ్రామ్‌ను కూడా ప్రవేశపెట్టింది. ఇది మూడు సంవత్సరాల స్టాండర్డ్, ఏడు సంవత్సరాల ఆప్షనల్ ఎక్స్‌టెండెడ్ వారంటీని కలిగి ఉన్న ప్రత్యేకమైన 10 సంవత్సరాల వారంటీ ప్యాకేజీతో వస్తుంది.


పల్సర్ ఎన్ఎస్ 160తో పోటీ పడనుంది
ఈ బైక్ పల్సర్ ఎన్ఎస్ 160తో పోటీపడుతుంది. దీనిలో 160.3 సీసీ బీఎస్6 ఇంజన్ అందుబాటులో ఉంది. ఇది 17.03 bhp శక్తిని, 14.6 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ బైక్‌లో ముందు, వెనుక డిస్క్ బ్రేక్‌లు ఉన్నాయి. వీటితో పాటు యాంటీ-లాకింగ్ బ్రేకింగ్ సిస్టమ్‌ను కూడా అమర్చారు.


మరోవైపు హీరో మోటోకార్ప్ కూడా తన పోర్ట్‌ఫోలియోను విస్తరించేందుకు సిద్ధమవుతోంది. దీని కారణంగా జూన్ 14వ తేదీన కొత్త ఆర్డీఈ నిబంధనలతో తను అప్‌డేట్ చేసిన బైక్ Xtreme 160R మోటార్‌సైకిల్‌ను లాంచ్ చేసే అవకాశం ఉంది. ఈ బైక్ ఇప్పటికే చాలా సార్లు టెస్టింగ్‌లో కనిపించింది. 


Hero Xtreme 160R 2023 అనేక ముఖ్యమైన మార్పులతో లాంచ్ అవుతుందని భావిస్తున్నారు. అయితే ఈ బైక్ గురించి ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక సమాచారం ఇవ్వలేదు. కానీ ఇప్పటి వరకు లీక్ అయిన ఫొటోలు చూసుకుంటే అప్ డేట్ చేసిన బైక్ టెలిస్కోపిక్ సస్పెన్షన్‌కు బదులుగా యూఎస్‌డీ ఫోర్క్‌లను ఇందులో చూడవచ్చు. ఇది కాకుండా బ్లూటూత్ కనెక్టివిటీతో కూడిన ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్‌ను కూడా అందించారు. దీనితో పాటు కంపెనీ ఈ అప్‌డేట్ చేసిన మోడల్‌ను కొత్త డ్యూయల్ టోన్ కలర్ ఆప్షన్‌తో లాంచ్ చేయవచ్చు.


Read Also: రూ.10 లక్షలలోపు లాంచ్ కానున్న లేటెస్ట్ కార్లు ఇవే - కొత్త కారు కొనాలనుకుంటే కొంచెం ఆగండి!