దేశీయ మార్కెట్లో మంచి ఆదరణ పొందుతున్న ఫ్రెంచ్ సంస్థ  సిట్రోయెన్(Citroen).. సరికొత్త  'సి5 ఎయిర్‌క్రాస్ ఫేస్‌లిఫ్ట్‌' (C5 Aircross Facelift) కారును విడుదల చేసింది.  ఈ కొత్త ఫేస్‌ లిఫ్ట్‌ ధర రూ. 36.67 లక్షలుగా(ఎక్స్-షోరూమ్, ఇండియా) కంపెనీ నిర్ణయించింది. ఈ లేటెస్ట్ కారును కొనాలనుకునే  వినియోగదారులు కంపెనీ వెబ్‌సైట్  తో పాటు ఆన్ లైన్ ద్వారా బుక్ చేసుకునే వెసులుబాటు ఉంది. దేశీయ మార్కెట్లో జీప్ కంపాస్, హ్యుందాయ్ టక్సన్, వోక్స్‌వ్యాగన్ టైగన్ వాహనాలకు పోటీగా వస్తున్నది. ఇప్పటికే సిట్రోయెన్ సి5,  సి3 మైక్రో SUV అనే రెండు మోడల్స్ అందుబాటులో ఉండగా.. ఇప్పుడు సిట్రోయెన్ సి5 ఫేస్‌లిఫ్ట్‌ మూడవ మోడల్ గా విడుదలైంది.


ప్రస్తుతం భారత మార్కెట్లోకి ఈ కారు ఒకే వేరియంట్ లో అందుబాటులోకి వచ్చింది. సి5 ఎయిర్‌క్రాస్ షైన్‌ వేరియంట్ ను మాత్రమే వినియోగదారులు కొనుగోలు చేయడానికి అవకాశం ఉంది. ఇందులో మాత్రం రెండు వేరియంట్స్ ఉన్నాయి. సి5 ఎయిర్‌క్రాస్ ఫీల్, సి5 ఎయిర్‌క్రాస్ షైన్ అనే రెండు వేరియంట్స్ అందుబాటులో ఉన్నాయి. ఇక కలర్స్ విషయానికి వస్తే మొత్తం నాలుగు కలర్ ఆప్సన్స్‌తో  అందుబాటులోకి వచ్చింది. పెర్ల్ వైట్, పెర్ల్ నెరా బ్లాక్, క్యుములస్ గ్రే, ఎక్లిప్స్ బ్లూ రంగుల్లో అమ్మకానికి సిద్ధమయ్యాయి.  వీటిలో ఎక్లిప్స్ బ్లూ అనేది కొత్త కలర్.  


ఆకర్షణీయమైన డిజైన్


తాజాగా విడుదలైన సరికొత్త సి5 ఫేస్‌లిఫ్ట్‌ కారు అత్యంత ఆకర్షణీయమైన డిజైన్ ను కలిగి ఉన్నది. అప్ డేట్ చేయబడిన ఫీచర్స్ తో వస్తుంది. డ్యూయెల్ టోన్ లో అందుబాటులో ఉంది. ఈ కారుకు ముందు భాగంలో బ్రాండ్ లోగో, ర్యాప్ అరౌండ్ హెడ్‌ ల్యాంప్‌లు, ఎల్ఈడీ డిఆర్ఎల్ ను కలిగి ఉన్నది. దీని బ్లాక్ గ్రిల్‌ చాలా అట్రాక్టివ్ గా కనిపిస్తుంది. సైడ్ ప్రొఫైల్ లో 18 అంగుళాల  డైమండ్ కట్ అల్లాయ్ వీల్స్‌ ఉన్నాయి. వెనుక భాగంలో ఎల్ఈడీ లైట్ వున్నాయి. మొత్తంగా మంచి డిజైన్ ను కలిగి ఉంది.  


ఇంటీరియర్ ఎలా ఉందంటే?


ఇందులో 10 అంగుళాల టచ్‌ స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, 12.3 అంగుళాల డిజిటల్ డిస్‌ప్లేను కలిగి ఉంది.  ఇన్ఫోటైన్‌మెంట్ స్క్రీన్‌కి ఆనుకుని క్యూబ్-ఆకారంలో ఉన్న AC వెంట్‌ లను కలిగి ఉంది. స్టాండర్డ్ గేర్ లివర్ స్థానంలో కొత్త టోగుల్ స్విచ్‌ తో సెంటర్ కన్సోల్ అప్ డేట్ చేయబడింది. గత మోడల్ లాగే ఇందులో  రెండవ వరుస ప్రయాణికుల కోసం స్లైడింగ్, రిక్లైనింగ్ తో పాటు ఫోల్డింగ్ సీట్లు ఉన్నాయి. పవర్డ్ డ్రైవర్ సీట్, డ్యూయల్ జోన్ క్లైమేట్ కంట్రోల్ తో పాటు పనోరమిక్ సన్‌రూఫ్ ను కలిగి ఉంది.   


ఇంజిన్ విషయానికి వస్తే..


సిట్రోయెన్ సి5 ఫేస్‌లిఫ్ట్ 2.0-లీటర్ డీజిల్ ఇంజన్‌ పొందుతుంది. 177 హెచ్‌పి పవర్, 400 ఎన్ఎమ్ గరిష్ట టార్క్‌ ను అందిస్తుంది. ఇది 8-స్పీడ్ టార్క్ కన్వర్టర్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌ తో యాడ్ చేయబడి ఉంది. ఒక లీటరుకు  17.5 కిలో మీటర్ల మైలేజ్ వస్తుందని కంపెనీ వెల్లడించింది. అటు సిట్రోయెన్ కంపెనీ ప్రపంచ వ్యాప్తంగా నెమ్మదిగా తన డీజిల్ ఇంజిన్ ను తొలగిస్తున్నది. ఇండియన్ మార్కెట్లో మాత్రం కంటిన్యూ చేసే అవకాశం ఉంది. సిట్రోయెన్ C5 ఎయిర్‌క్రాస్ కి 3 సంవత్సరాలు లేదంటే  1 లక్ష కిమీ వారంటీ లభిస్తుంది. 


Also Read: కారులో ప్రయాణిస్తున్నప్పుడు సీట్ బెల్ట్ ఎందుకు ధరించాలి? అది ఎలా ప్రాణాలు కాపాడుతుంది?
Also Read: కారు కొంటున్నారా? అయితే, ఈ టాప్ 10 భద్రతా ఫీచర్లను పరిశీలించండి