మనదేశంలో ఎండా కాలం సూర్యుడి భగభగలకు బై చెప్పేసి, వర్షాకాలం వరుణుడి హాయ్ చెప్పాల్సిన టైం వచ్చేసింది. తెలుగు రాష్ట్రాల్లో గత కొద్ది రోజులుగా వర్షాలు ఆగకుండా కురుస్తూనే ఉన్నాయి. ఈ వర్షాకాలంలో రోడ్ల మీదకు నీరు చేరడం చాలా కామన్. కాబట్టి ఈ రోడ్ల మీద డ్రైవింగ్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండటం అవసరం. ముఖ్యంగా నీరు నిలిచి ఉన్న ప్రాంతాల్లో కారు డ్రైవ్ చేసేటప్పుడు ఈ 10 విషయాలు తప్పకుండా పాటించాలి.


1. నీటిలోకి వెళ్లకుండా లోతును అంచనా వేయకూడదు
మనకు తెలిసిన దారే కదా అని చాలా సార్లు రోడ్లపై నీరు ఉన్నప్పటికీ ధైర్యంతో వెళ్లిపోతూ ఉంటాం. కానీ అది కరెక్టు కాదు. ఒక్కోసారి నీళ్లు నిలవడం కారణంగా రోడ్లు దెబ్బ తిని గుంతలు ఏర్పడవచ్చు. అలాంటి సమయంలో కారు దెబ్బ తినడమే కాకుండా రోడ్డు ప్రమాదం జరిగే అవకాశం కూడా ఉంటుంది.


2. నీటిలో వేగంగా నడపకూడదు
రోడ్డుపై నిలిచి ఉన్న నీటిలో కారును వేగంగా నడిపి నీటిని గాల్లోకి ఎగిరేలా చేయడం చూడటానికి స్టైల్‌గా ఉంటుంది. కానీ అది చాలా ఇబ్బందికరమైన అంశంగా మారే అవకాశం ఉంది. ఎందుకంటే మీరు వేగంగా ఆగి ఉన్న నీటిలోకి వచ్చినప్పుడు కారు బంపర్, నీటిని బలంగా ఢీకొంటుంది. వేగం మరీ ఎక్కువైతే బంపర్ డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ కూడా కొట్టి పారేయలేం. కాబట్టి మీరు నీటిలో కారు డ్రైవ్ చేసేటప్పుడు ప్రారంభ గేర్లలో, ఎక్కువ ఆర్పీఎంతో డ్రైవ్ చేయడం మంచిది.


3. ముందు వాహనానికి, మీ కారుకు మధ్యలో గ్యాప్ ఉండాలి
నీటిలో వాహనాలు నడిపేటప్పుడు... ముందు కారుకు, మీ కారుకు మధ్యలో గ్యాప్ ఉండాలి. లేకపోతే ప్రమాదం జరిగే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ముందు ఒక వాహనం కదిలేటప్పుడు రోడ్డుపై నీరు కూడా కదులుతూ ఉంటుంది. అటువంటి సమయంలో నీటి మట్టం అంచనా వేయడం కష్టం అవుతుంది.


4. ఎదుటి వాహనాన్ని బ్లైండ్‌గా ఫాలో అవ్వకూడదు
రోడ్లపై సాధారణంగా మనకు ముందు ఒక వాహనం వేగంగా వెళ్తున్నప్పుడు మనం కూడా వేగంగా వెళ్లాలని అనుకుంటాం. కానీ రోడ్లపై నీరు నిలిచి ఉంటే అది ప్రమాదకరంగా మారవచ్చు. మీకు ఎదురుగా వెళ్లే వ్యక్తికి ఆ రోడ్డు గురించి బాగా తెలిసి ఉండవచ్చు. కాబట్టి ఇలాంటి సమయంలో అది ప్రమాదానికి దారి తీస్తుంది. దీనికి తోడు వారు డ్రైవ్ చేసే వాహనం, మీరు డ్రైవ్ చేసే వాహనం వేర్వేరువి అయితే... మీ కారు ఆ రోడ్డును ఎలా హ్యాండిల్ చేస్తుందో అంచనా వేయడం కూడా కష్టమే.


5. రోడ్డు ఎడ్జ్‌లో నడపడం ప్రమాదం
మనదేశంలో రోడ్లను ఇటీవల వాతావరణానికి తగ్గట్లు వేస్తున్నారు. మెట్రో సిటీస్‌లో, ప్రధాన సిటీల్లో భారీగా వర్షం పడినప్పుడు నీరు ఆగకుండా ఉండేలా రోడ్లను డిజైన్ చేస్తున్నారు. దీని కారణంగా రోడ్లలో మధ్యలో ఉండే లేన్‌లో నీరు తక్కువగా ఉంటుంది. చివరి లేన్లలో కొంచెం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి మధ్యలో ఉండే లేన్‌లో బండి నడపడం ఉత్తమం.


6. కారు నీటిలో ఉన్నప్పుడు స్టార్ట్ చేయకండి
ఒక్కోసారి కారు నీటిలో నుంచి వెళ్లేటప్పుడు సడెన్‌గా ఆగిపోతూ ఉంటుంది. అలాంటి సమయంలో నీటిలోనే స్టార్ట్ చేయడం మంచిది కాదు. కారులో గాలి తగలాల్సిన ప్రదేశాల్లో నీరు చేరి ఉంటుంది. కాబట్టి కారును నీటి నుంచి బయటకు తోసి అప్పుడు స్టార్ట్ చేయడం మంచిది. ఒకవేళ హైడ్రో లాక్ అయితే అప్పుడు మెకానిక్ సాయం తీసుకోవడం తప్పనిసరి.


7. తెలియని దార్లలో బండి నడపకండి
ఇప్పుడు గూగుల్ మ్యాప్స్ కారణంగా తెలియని దార్లలో వెళ్లడం కూడా సులభం అయింది. కానీ వర్షం పడుతున్న సమయంలో తెలియని దారిలో కారులో వెళ్లడం అంత మంచిది కాదు. ఎందుకంటే ఆ దారిలో రోడ్లు ఎలా ఉంటాయో చెప్పలేం. రోడ్లు బాలేకపోతే కారు దెబ్బతినే అవకాశం ఉంటుంది.


8. నీరు ఆగిన చోట కారు ఆపకండి
సాధారణంగా రోడ్డు కండీషన్ గురించి మనకు తెలియనప్పుడు బ్రేకులు వేస్తూ బండి నడపడం సహజమే. అయితే నీటితో మునిగిన రోడ్డు మీద బండి నడపడం మాత్రం చాలా కష్టం. ఎందుకంటే ఆ రోడ్డు మీ గుంటలు, స్పీడ్ బ్రేకర్లు ఎక్కడ ఉంటాయో మనకు కనిపించవు. అలాంటి చోట బండి ఆపితే మళ్లీ స్టార్ట్ అవ్వడం కూడా కష్టం అవుతుంది.


9. బ్రేకులు వేసుకుంటూ ఉండండి
నీటితో నిండిన రోడ్డులో నుంచి వెళ్లాక బ్రేకులు వేసి ఒకసారి చెక్ చేసుకోండి. ఎందుకంటే వాహనం కింది భాగంలో నీరు నిలిచే అవకాశం ఉంటుంది. ఇలా బ్రేకులు వేసినప్పుడు అవి జారిపోతాయి. దీంతో పాటు ఇంజిన్ కూడా వేగంగా డ్రై అవుతుంది.


10. ఓపికతో ఉండండి
పైన పేర్కొన్న తొమ్మిది టిప్స్ కంటే ఇది అత్యంత ముఖ్యమైన టిప్. నీటితో మునిగిన రోడ్డులో నడిపేటప్పుడు తొందర పడకుండా ఓపికతో ఉండటం మంచిది.


Read Also: వర్షంలో ఎలక్ట్రిక్ వాహనాలు నడపడం, ఛార్జ్ చేయడం సురక్షితమేనా?


Read Also: రూ.10 లక్షలలోపు లాంచ్ కానున్న లేటెస్ట్ కార్లు ఇవే - కొత్త కారు కొనాలనుకుంటే కొంచెం ఆగండి!


ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.


Join Us on Telegram: https://t.me/abpdesamofficial