Modakondamma Thalli Jatara in Paderu 2025: మన్యం దేవతగా గిరిజనుల దేవతగా పూజలందుకుంటున్న మోదకొండమ్మకు ప్రతి సంవత్సరం మే నెలలో జాతర నిర్వహిస్తారు. ఈ ఏడాది మే 11 నుంచి మూడు రోజుల పాటు జాతర చేయనున్నారు. ఈ మేరకు ఉత్సవ, ఆలయ కమిటీలు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు.  రాష్ట్ర విభజన తర్వాత దీనిని రాష్ట్ర గిరిజన జాతరగా ప్రకటించారు. మొదటి రెండేళ్లు ఏడాదికి 50 లక్షలు చొప్పున నిధులు విడుదల చేశారు. ఆ తర్వాత ఆ లెక్కను కోటికిపెంచారు. 

Continues below advertisement

మోదకొండమ్మ జాతర ఏటా మే నెలలో రెండో వారంలో నిర్వహించడం ఆనవాయితీ. విశాఖ పట్టణానికి 120 కిలోమీటర్ల దూరంలో పాడేరులో స్వయంభువుగా వెలసింది అమ్మవారు. మోదం అంటే సంతోషం అని అర్థం. గిరుల్లో వెలసిన దేవత కాబట్టి కొండమ్మ అని కలసి...మోదకొండమ్మ అని పూజలందిస్తున్నారు భక్తులు. 

ఒడిశా కోరాపుట్‌ జిల్లాలో నందపురం అనే ప్రాంతం కళింగ దేశంలో ఓ రాజ్యంగా ఉండేది. ఆ నందపురాన్ని రాణి మాకలశక్తి, భైరవుడు పాలించేవారు. వీరికి ఏడుగురు కుమార్తెలు, ఓ కొడుకు. వారిలో మొదటి సంతానమే మోదకొండమ్మ. చిన్నప్పటి నుంచీ మహిమలు చూపే మోదకొండమ్మ  మహిషాసుర సంహారం సమయంలో ఆదిపరాశక్తికి సహాయపడిందని పురాణాలు చెబుతున్నాయి. మోదకొండమ్మ మేనత్తకు ఏడుగురు కుమారులు ఉండేవారట. దేశిరాజులుగా పిలచే ఆ ఏడుగురిని మోదకొండమ్మ అక్కచెల్లెళ్లు ఏడుగురు వివాహం చేసుకున్నారు. ఆ తర్వాత  పాడేరులో పినవేనం అనే రాతి గుహ వద్ద స్వయంభువుగా కొలువుదీరిందనీ...మోదకొండమ్మ చెల్లెళ్లు కూడా వివిధ ప్రాంతాల్లో వెలిశారని కథనం. 

Continues below advertisement

కొన్నాళ్లక్రితం ఇక్కడ ఏటా ప్రత్యేక పూజలు చేసేవారు. ఓసారి పూజల అనంతరం అంతా వెళ్లిపోయాక మోదకొండమ్మ తన చెల్లెళ్లతో కలసి విందు ఆరగిస్తోందిట. ఆ సమయంలో పూజారి వెనక్కు వెళ్లాడు. అంతదూరం తిరిగి వచ్చిన పూజారిని చూసి మోదకొండమ్మ...తన దర్శనం కోసం ఇంత దూరం ఎవరూ రావొద్దని చెప్పి...ఈ చెంబు పడేచోట తాను కొలువై ఉంటాయనని విసిరిందట. ఆ చెంబు పడిన చోట అమ్మవారి పాదాలు కనిపించడంతో వాటినే ప్రతిష్టించి పూజలు చేస్తున్నారు భక్తులు.ఆ తర్వాత కాలంలో తహసిల్దార్‌ దాసరిశర్మ అనే భక్తుడి కలలో అమ్మవారు కనిపించడంతో పాడేరులో ఆలయం నిర్మించారని కథనం. ఏడాది మొత్తం విశేష పూజలు నిర్వహించి ఏడాదికోసారి మే నెలలో మూడు రోజుల పాటు వైభవంగా జాతర నిర్వహిస్తారు. ఈ జాతరకు తెలుగు రాష్ట్రాలతోపాటు ఒడిశా, ఛత్తీస్‌గఢ్‌ తదితర ప్రాంతాలకు చెందిన భక్తులు కూడా భారీగా తరలివస్తారు. మొదటి రెండు రోజులూ స్థానిక సతకంపట్టు వద్ద అమ్మవారి ఘటాలను మేళతాళాలతో  తీసుకొచ్చి పెడతారు. వాటిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేస్తారు భక్తులు. సాయంత్రం ఆ ఘటాలను పురవీధుల్లో ఊరేగిస్తారు. మూడో రోజు తెల్లవారుజామునుంచే మొక్కులు తీర్చుకునేందుకు భక్తులు బారులు తీరుతారు. విశేషమైన పూజలు, ఊరేగింపులతో ఉత్సవాలు ముగుస్తాయి. విశాఖ వరకూ ట్రైన్ లేదా బస్సులో చేరుకుంటే అక్కడి నుంచి మోదకొండమ్మ ఆలయానికి బస్సులు, ప్రేవేట్ వాహనాలు అందుబాటులో ఉంటాయి.

జాతరకు వచ్చే భక్తుల సంఖ్య పెరగడంతో ఏర్పాట్ల ఖర్చు కూడా పెరుగుతోంది అంటున్నారు నిర్వాహకులు. అందుకే ప్రభుత్వం ఇస్తున్న కోటి రూపాయల నిథులను మూడు కోట్లకు పెంచాలని స్థానిక అధికారులు ప్రభుత్వానికి ప్రతిపాదించారు.

తిరుమలలో ఉన్నది రాతి విగ్రహం కాదు.. సజీవంగా నిల్చున్న శ్రీ వేంకటేశ్వరుడు -  తిరుమలలో జరిగే సేవలేంటి? ఏ సేవలో ఏం చేస్తారు? ఏ సేవకు వెళితే మంచిది? ఈ వివరాల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి