Prakasam Earthquake News Today | అమరావతి: మే 5న తెలంగాణలోని ఉమ్మడి కరీంనగర్ జిల్లాల్లో భూకంపం సంభవించింది. ఆ మరుసటి రోజే ఆంధ్రప్రదేశ్ లో ప్రకాశం జిల్లాలో భూ ప్రకంపనలు వచ్చాయి. ప్రకాశం జిల్లా పొదిలిలో స్వల్ప భూకంపం సంభవించింది. మే 6 (మంగళవారం) ఉదయం 9.54 గంటలకు భూమి కంపించినట్లు స్థానికులు చెబుతున్నారు. దాదాపు 5 సెకన్లపాటు భూమి కంపించినట్లు తెలుస్తోంది. కొత్తూరులోని బ్యాంకు కాలనీ, రాజు ఆసుపత్రి వీధి, ఇస్లాంపేటలో భూ ప్రకంపణలు వచ్చాయి. భూమి కంపించినట్లు గుర్తించిన వారు ఇండ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. తీవ్రత చాలా తక్కువ కావడంతో ఎలాంటి నష్టం జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.
ఏపీలో పలు జిల్లాల్లో వర్షాలు.. పిడుగులు పడతాయని వార్నింగ్
నేడు శ్రీకాకుళం, విజయనగరం, అల్లూరి సీతారామరాజు, పార్వతీపురం మన్యం, అనకాపల్లితో పాటు పల్నాడు, ప్రకాశం జిల్లాల్లో పలుచోట్ల పిడుగులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ రోణంకి కూర్మనాథ్ తెలిపారు. 50 నుంచి 60కిమీ వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని.. ప్రజలు హోర్డింగ్స్ పక్కన, చెట్ల కింద, శిథిలావస్థలో ఉన్న భవనాలు దగ్గర, వాటి కింద తలదాచుకునేందుకు వెళ్లొద్దని సూచించారు.
అలాగే విశాఖపట్నం, తూర్పు గోదావరి, కాకినాడ, కోనసీమ, పశ్చిమ గోదావరి, కృష్ణా, ఎన్టీఆర్, ఏలూరు, గుంటూరు, బాపట్ల, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, శ్రీ సత్యసాయి, అనంతపురం, వైఎస్సార్, అన్నమయ్య, తిరుపతి, చిత్తూరు జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేశారు.
ఓవైపు వర్షాలు, కొన్నిచోట్ల పిడుగులతో కూడిన వర్షాలు కురుస్తుంటే.. మరికొన్ని జిల్లాలో ఎండలు దంచి కొడుతున్నాయి. మంగళవారం నాడు గరిష్ట ఉష్ణోగ్రతలు 41 నుంచి 43 డిగ్రీల మధ్య రికార్డయ్యే అవకాశం ఉందన్నారు. సోమవారం నాడు నంద్యాల జిల్లా పసుపులలో 42.5 డిగ్రీలు, వైఎస్సార్ జిల్లా జమ్మలమడుగులో 42.4 డిగ్రీలు, పల్నాడు జిల్లా రావిపాడులో 42.1 డిగ్రీలు, కర్నూలు జిల్లా కలుగోట్ల 41.8 డిగ్రీల చొప్పున అధిక పగటి ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.