Monthly Horoscope June 2023 : జూన్ నెలలో కొన్ని రాశులవారికి మంచి ఫలితాలుంటే మరికొన్ని రాశులవారికి ప్రతికూల ఫలితాలున్నాయి.
మేష రాశి
మేష రాశి వారికి జూన్ నెలల గ్రహసంచారం బావుంది. నెల ఆరంభంలో కొన్ని ఒడిదొడుకులు ఉన్నప్పటికీ ద్వితీయార్థం బావుంటుంది. జూన్ ఆరంభంలో మీరు సహనంగా ఉండాలి. విచక్షణతో వ్యవహరించాలి, ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి. జూన్ ద్వితీయార్థంలో పరిస్థితులు అన్నీ మీకు అనుకూలంగా మారుతాయి. వృత్తి-వ్యాపారంలో ఆశించిన విజయాన్ని పొందుతారు. ప్రయాణాలు, ప్రయత్నాలు ఫలిస్తాయి. ఈ సమయంలో కుటుంబ సభ్యులతో సమయాన్ని గడపడానికి పుష్కలమైన అవకాశాలు ఉంటాయి. ఈ సమయం కూడా ప్రేమ సంబంధాలకు అనుకూలంగా ఉంటుంది. మళ్లీ నెల చివర్లో చిన్న చిన్న ఇబ్బందులుంటాయి కానీ ఆలోచించి ముందుకుసాగితే మంచే జరుగుతుంది. నిత్యం హనుమాన్ చాలీశా చదువుకోండి.
వృషభ రాశి
వృషభ రాశివారికి గడిచిన నెలకన్నా ఈనెల అనుకూలంగా ఉంటుంది. ఆదాయం పెరుగుతుంది. ఆర్థిక సమస్యలు పరిష్కారం అవుతాయి. మీరు చేసే ప్రయత్నాల్లో విజయం సాధిస్తారు. వృత్తి, వ్యాపారాలలో ఆశించిన పురోగతి ఉంటుంది. నిరుద్యోగులు మంచి ఉద్యోగంలో స్థిరపడతారు. వ్యాపారంతో సంబంధం ఉన్న వ్యక్తులు ఆశించిన ప్రయోజనం పొందుతారు. ప్రేమ, స్నేహ సంబంధాలు మీకు అనుకూలంగా ఉంటాయి. మీ ఆహారం మరియు దినచర్యలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. మీ భావోద్వేగాలను నియంత్రించుకోవాలి. కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునేటప్పుడు ఒకటికి రెండుసార్లు ఆలోచించాలి. వివాదాలకు దూరంగా ఉండాలి. జూన్ మాసంలో ప్రేమ సంబంధంలో చాలా జాగ్రత్తగా ముందుకు సాగండి. వైవాహిక జీవితాన్ని సంతోషంగా ఉంచడానికి జీవిత భాగస్వామి అభిప్రాయాలను పరిగణలోకి తీసుకోవాలి. నిత్యం శివ స్తోత్రం పఠించాలి.
మిథున రాశి
ఈ నెలలో మీ మాటకు తిరుగుండదు. ఆదాయం పెరుగుతుంది.వ్యవహారాలు కలిసొస్తాయి. చేపట్టిన పనుల్లో విజయం సాధిస్తారు. శుభవార్తలు వింటారు. శత్రువులపై ఆధిక్యత సాధిస్తారు. కుటుంబంలో మీ పట్టు నిలుపుకుంటారు. అయితే పనిభారం అధికంగా ఉంటుంది. ఆరోగ్యం విషయంలో అస్సలు నిర్లక్ష్యం మంచిదికాదు. ఆర్థికపరిస్థితి ఆశాజనకంగా ఉన్నప్పటికీ ఖర్చులు పెరుగుతాయి. వ్యాపారులు పెట్టుబడులు పెట్టేందుకు మంచి సమయమే అయినా అనుభవజ్ఞుల సలహాలు స్వీకరించిన తర్వాతే ముందడుగు వేయాలి. లావాదేవీలు చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. జీవితంలో మీకు ఎదురయ్యే సవాళ్లకు పెద్ద ఉపశమనం మీ జీవిత భాగస్వామి అవుతారు. మీ బిజీ సమయం నుంచి కొంత సమయాన్ని మీ జీవిత భాగస్వామి, కుటుంబ సభ్యులతో గడపడానికి కేటాయించండి. ప్రతి రోజూ వినాయకుడిని పూజించండి.
Also Read: ఏరువాక పున్నమి ఎప్పుడొచ్చింది, ప్రత్యేకత ఏంటి!
కర్కాటక రాశి
కర్కాటక రాశి వారికి జూన్ నెల అనుకూల ఫలితాలు లేవు. జన్మంలో కుజుడి సంచారం వల్ల చీటికి మాటికి ఉద్రేకం ప్రదర్శిస్తారు. ఆరోగ్యం అంతగా అనుకూలించదు. మీ మాటతీరే మీకు వ్యక్తులను దూరం చేస్తుంది. సంఘంలో అపకీర్తి, అవమానకర సంఘటనలు జరుగుతాయి. అయితే ఆర్థిక పరిస్థితి బాగానే ఉంటుంది. ఉద్యోగులకు ఉన్నతాధికారులతో కొన్ని ఇబ్బందులు తప్పవు. ప్రత్యర్థులు యాక్టివ్ గా ఉంటారు మీరు అప్రమత్తంగా ఉండాలి. ఆహారంపై నిర్లక్ష్యం వహించవద్దు. ఖర్చులను నియంత్రించాల్సిన అవసరం ఉంది. ప్రేమ సంబంధాల పరంగా అనుకూలంగా ఉంటుంది. ప్రేమ భాగస్వామితో అపార్థాలు మీ సంబంధాలను ప్రభావితం చేస్తాయి. జీవిత భాగస్వామి ఆరోగ్యం మీకు ఆందోళన కలిగిస్తుంది. ప్రతిరోజూ శివుని ఆరాధించండి, మహామృత్యుంజయ మంత్రాన్ని ఎక్కువగా జపించండి.
సింహ రాశి
సింహరాశివారికి ఈ నెల అనుకూల ఫలితాలున్నాయి. వృత్తి వ్యాపారాల్లో రాణిస్తారు. ఆదాయం, ఆరోగ్యం బావుంటుంది. భాగస్వామ్య వ్యాపారం చేసేవారు లావాదేవీల విషయంలో జాగ్రత్తగా వ్యవహరించాలి. ఉద్యోగులు పనిపట్ల శ్రద్ధ వహించాలి లేదంటే మీ విశ్వసనీయతను కోల్పోతారు. ఈ నెల ఆరంభం కన్నా ద్వితీయార్థం బావుంటుంది. కుటుంబంలో సమస్యలు పరిష్కారం అవుతాయి. ప్రేమ సంబంధాల్లో మనస్పర్థలు తొలగిపోతాయి. అవివాహితులకు పెళ్లి సంబంధాలు కుదురుతాయి. జన్మంలో కుజుడి వల్ల కొన్ని విషయాల్లో దూకుడుగా వ్యవహరిస్తారు. తొందరగా కోప్పడతారు...ఇదే సమస్యలకు కారణం అవుతుంది. విద్యార్థులు పోటీ పరీక్షలలో మంచి ఫలితాలు సాధిస్తారు. ప్రతిరోజూ నారాయణ కవచం పఠించాలి.
కన్యా రాశి
కన్యా రాశివారికి జూన్ నెల కొంతవరకూ బాగానే ఉంది. చేయు వృత్తి వ్యాపారాల్లో రాణిస్తారు. ఆదాయం బావుంటుంది. మానసిక స్థితి మెరుగుపడుంది. ఆశించిన విజయాన్ని, గౌరవాన్ని పెంచుతుంది. ఈ నెల ప్రారంభంలో వృత్తి-వ్యాపారాలకు సంబంధించి కొన్ని శుభవార్తలు వింటారు. మీరు విదేశాల్లో ఉద్యోగం చేస్తుంటే లేదా మీరు విదేశాల్లో కెరీర్ కోసం ప్రయత్నిస్తుంటే ఈ నెల కలిసొస్తుంది. విద్యార్థులు కష్టపడితేనే మంచి ఫలితాలు అందుకుంటారు. ఈ నెలలో చేసే వ్యాపార ప్రయాణాలు ఆహ్లాదకరంగా ఉంటాయి. గడిచిన నెలవరకూ ఆర్థిక మాంద్యం ఎదుర్కొన్నట్టేతే ఈ నెలలో కొంత ఉపశమనం లభిస్తుంది. నూతన పథకాల్లో పెట్టుబడులు పెట్టేందుకు ఇదే మంచిసమయం. వ్యాపారన్ని విస్తరించేటప్పుడు మీ శ్రేయోభిలాషుల సలహాలు తీసుకోవడం మరిచిపోవద్దు. సమస్యలను పరిష్కరించుకోగల నేర్పు మీకుంటుంది. వైవాహిక జీవితం బావుంటుంది. ప్రేమ సంబంధాలు అనుకూలంగా ఉంటాయి. నిత్యం గణేష్ చాలీశా పఠించండి.
తులా రాశి
తులా రాశివారికి జూన్ నెల కొన్ని ఇబ్బందులు, ఆందోళనకర పరిస్థితులు ఉన్నప్పటికీ మీ విచక్షణతో ధైర్యంగా ఎదుర్కొంటారు. కుటుంబానికి సంబంధించిన సమస్యలను కూర్చుని మాట్లాడుకోవడం ద్వారా పరిష్కరించుకోవాలి. తల్లిదండ్రుల నుంచి ఆశించిన సహాయ సహకారాలు లభిస్తాయి. ఈ సమయంలో కెరీర్ లో కొన్ని ఒడిదొడుకులు ఎదురవుతాయి. చిన్న పొరపాటు లేదా సోమరితనం కారణంగా ఓ పెద్ద అవకాశాన్ని కోల్పోతారు. మీ బాధ్యతలు సక్రమంగా నిర్వర్తించండి. చెడు అలవాట్లకు దూరంగా ఉండాలి. ప్రేమ వ్యవహారాలను పెళ్లిదిశగా తీసుకెళ్లాలంటే నెలాఖరు వరకూ ఆగాలి. వైవాహిక జీవితంలో సంతోషం ఉంటుంది. ప్రభుత్వ సంబంధిత వ్యవహారాలు పూర్తవుతాయి. దుర్గా చాలీశా పఠిస్తే మీకు మంచి జరుగుతుంది.
Also Read: ఈ రాశులవారికి ఈ రోజు(మే 30) నుంచి లక్ష్మీయోగం
వృశ్చిక రాశి
వృశ్చిక రాశివారికి జూన్ నెల మిశ్రమ ఫలితాలున్నాయి. అష్టమంలో రవి, బుధుడు సంచారం వల్ల చిన్న చిన్న ఇబ్బందులుంటాయి. శారీరక శ్రమ పెరుగుతుంది. అకాల భోజనం చేయాల్సి రావొచ్చు. ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయవద్దు. మానసిక సమస్యలుంటాయి కానీ వాటిని మనోబలంతో అధిగమిస్తారు, ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. ఖర్చుల విషయంలో నియంత్రణ పాటించాల్సిన సమయం ఇది. వ్యాపారులు తమ విశ్వసనీయతను కాపాడుకోవాలంటే పోటీదారుల వ్యూహాలు గమనిస్తూ అడుగులేయాలి. వృత్తి వ్యాపారాల్లో షార్ట్ కట్ లు ఫాలో అవొద్దు..నేరుగా పనిచేయడం మంచిది. స్పెక్యులేషన్, లాటరీలకు దూరంగా ఉండండి. నూతన పెట్టుబడులు పెట్టేముందు అనుభవజ్ఞుల సలహాలు అడిగి తీసుకోవడం మంచిది. ప్రేమ సంబంధాల పరంగా జూన్ నెల కాస్త గందరగోళంగా ఉంటుంది. జీవిత భాగస్వామి ఆరోగ్యం గురించి మనసు కాస్త ఆందోళన చెందుతుంది. ప్రతిరోజూ హనుమంతుడి ఆరాధనచేయండి, సుందరాకాండ పఠించండి.
ధనస్సు రాశి
ధనస్సు రాశివారికి జూన్ నెలలో అష్టమంలో కుజుడు, శుక్రుడు సంచరిస్తున్నందున జాగ్రత్తగా వ్యవహరించాల్సి ఉంటుంది. అకాల భోజనం, శారీరక శ్రమ, ప్రయాణంలో ఇబ్బందులు ఉంటాయి.వాహనం నడిపేటప్పుడు జాగ్రత్త. ఆర్థిక వ్యవహారాల్లో అప్రమత్తంగా ఉండాలి. అయితే ఇన్ని సమస్యలున్నప్పటికీ వ్యవహారాల్లో విజయం సాధిస్తారు. ఖర్చులు పెరుగుతాయి. సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి.ధార్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. మీ మాటతీరు, ప్రవర్తన విషయంలో జాగ్రత్తగా ఉండాలి లేదంటే ఈ సమయంలో జీవిత భాగస్వామితో ఏదో విషయంలో విభేదాలు తలెత్తుతాయి. వివాదం పెరగకముందే కూర్చుని మాట్లాడి సమస్యలు పరిష్కరించుకోవాలి. విద్యార్థులకు చదువుపట్ల శ్రద్ధ తగ్గుతుంది. వ్యాపారులు ఈ నెల ద్వితీయార్థంలో జాగ్రత్తగా ఉండాలి. ఉద్యోగులకు ఈ సమయం కాస్త సవాలుగా ఉంటుంది. ఆరోగ్యం జాగ్రత్త. సూర్యభగవానుడిని ఆరాధిస్తే మంచి ఫలితాలు పొందుతారు.
మకర రాశి
మకర రాశివారికి జూన్ నెల అనూకూలంగా ఉంటుంది. ఆరోగ్యం, ఆదాయం బావుంటుంది. వృత్తి వ్యాపారాలు కలిసొస్తాయి. వ్యాపారాలకు సంబంధించిన ప్రయాణాలు లాభాన్నిస్తాయి...ఈ సమయంలో ప్రభావవంతమైన వ్యక్తులతో మీ సంబంధాలు ఏర్పడతాయి. వ్యాపారంతో సంబంధం ఉన్నవారు తమ వ్యాపారాన్ని విస్తరించగలుగుతారు. కుటుంబ సభ్యులే నుంచి మీకు సహాయసహకారాలు లభిస్తాయి కానీ ఎవరో ఒకరితో విభేదాలు రావొచ్చు. ఆరోగ్యం జాగ్రత్త. ఉద్యోగులకు కార్యాలయంలో ఏవైనా వివాదాలు తలెత్తినా త్వరలోనే సమస్య పరిష్కారం అవుతుంది. అదనపు ఆదాయ వనరులు వెతుక్కోవడంలో సక్సెస్ అవుతారు.భూ సంబంధిత వ్యవాహారాలు కలిసొస్తాయి. శత్రువులపై పైచేయి సాధిస్తారు. జీవిత భాగస్వామి ఆరోగ్యం విషయంలో కొంత ఆందోళన నెలకొంటుంది. నిత్యం హనుమాన్ ఆరాధనలో ఉండండి.
కుంభ రాశి
ఈ నెల ఈ రాశివారికి అనుకూల ఫలితాలున్నాయి. అనుకున్న పనులన్నీ నెరవేరుతాయి. ఆర్థిక ఇబ్బందులు తీరిపోతాయి. ఆరంభంలో ఇబ్బందులున్నా ఆఖరి నిముషంలో పనులు పూర్తవుతాయి. ఉద్యోగులకు జూన్ నెల ప్రథమార్థం కన్నా ద్వితీయార్థం బావుంటుంది. ప్రభుత్వ ఉద్యోగులకు బదిలీలు ఉండొచ్చు. వ్యాపారులు లాభాలు పొందుతారు. సమర్థుడైన వ్యక్తి సహాయంతో అధికార-ప్రభుత్వానికి సంబంధించిన వ్యవహారాలు పరిష్కారమవుతాయి. మీరు విదేశాల్లో చదువుకోవాలని లేదా అక్కడ చేరడం ద్వారా వ్యాపారం చేయాలని ఆలోచిస్తుంటే ఈ విషయంలో అడుగు ముందుకుపడుతుంది. ప్రేమ సంబంధాల పరంగా జూన్ ప్రారంభం అనుకూలంగా ఉండకపోవచ్చు. వైవాహిక జీవితం బావుంటుంది. 'ఓం నమః శివాయ' అనే మంత్రాన్ని పఠించండి.
మీన రాశి
మీన రాశి వారికి జూన్ నెల బాగానే ఉంటుంది. వ్యాపారం బాగా సాగుతుంది. ఉద్యోగులు మంచి ఫలితాలను అందుకుంటారు. నిరుద్యోగులకు ఇంకొంతకాలం నిరీక్షణ తప్పదు. చిన్న చిన్న పొరపాట్లు మీకు మచ్చ తీసుకొస్తాయి జాగ్రత్త పడాలి. కుటుంబంతో సంతోషంగా ఉంటారు. పిల్లల నుంచి శుభవార్తలు వింటారు. వివాదాలకు దూరంగా ఉండాలి. ప్రయాణాలు కలిసొస్తాయి. ప్రేమికులకు శుభసమయం. వైవాహిక జీవితం బావుంటుంది. మార్కెట్లో మీ విశ్వసనీయతను కాపాడుకోవడానికి, ఈ సమయంలో మీరు మీ పోటీదారులతో గట్టిగా పోటీ పడాల్సి ఉంటుంది. ఈ సమయంలో. ప్రతిరోజూ శ్రీ మహావిష్ణువును పూజించండి.