Lunar eclipse 2023: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం చంద్రగ్రహణం అశుభ చర్యగా పరిగణిస్తారు. గ్రహణం జాతక చక్రంపై  చెడు ప్రభావాన్ని చూపుతుంది, జీవితంలో సమస్యలకు కూడా కారణమవుతుందని జ్యోతిష్య శాస్త్ర పండితులంటే.. గ్రహణం అంటే కేవలం గ్రహాలలో మార్పు మాత్రమే..భూమి సూర్యుడు, చంద్రుని మధ్య జరిగే ఒక చర్య అంటారు శాస్త్రవేత్రలు. ఈ ఏడాది చివరి చంద్రగ్రహణం అక్టోబర్ 28న ఏర్పడుతోంది.  సూర్యగ్రహణం , చంద్రగ్రహణం సూతకాలం భిన్నంగా ఉంటుంది. సూర్యగ్రహణం సూతకాలం గ్రహణానికి 12 గంటల ముందు ప్రారంభమవుతుంది. చంద్రగ్రహణం సూతకాలం 9 గంటల ముందు ప్రారంభమవుతుంది. సూతకాలం ప్రారంభం కాగానే పూజలు ఆగిపోతాయి. ఆలయాల తలుపు మూసేస్తారు. ఆలయాల్లోకి ప్రవేశించరు..ఎలాంటి పూజలు నిర్వహించరు. 


Also Read: ఇవాళే చంద్రగ్రహణం - మీ రాశిపై ఎలాంటి ప్రభావం ఉంటుందో తెలుసా!


అక్టోబరు 28 శనివారం ఈ ఏడాది చివరి చంద్రగ్రహణం
శ్రీ శోభకృత్ నామ సంవత్సరం ఆశ్వయుజ పౌర్ణమి అక్టోబరు 28 శనివారం  రాహుగ్రస్త పాక్షిక చంద్రగ్రహణం ఏర్పడుతుంది. ఈ గ్రహణం మన దేశంలో కనిపిస్తుంది. అందుకే సూతకాలం సహా గ్రహణ నియమాలు పాటించాలి. 



  • చంద్రగ్రహణ స్పర్శ కాలం 28 రాత్రి 1.04

  • చంద్రగ్రహణం మధ్యకాలం రాత్రి 1.43 నిముషాలు

  • గ్రహణం మొక్ష కాలం రాత్రి 2 గంటల 23 నిముషాలు


భారతదేశం మొత్తం ఈ గ్రహణం కనిపిస్తుంది. అందుకే అక్టోబరు 28 సాయంత్రం నుంచి సూతకాలం ప్రారంభమవుతుంది. ఆ సమయానికి ఆలయాల తలుపులు మూసేసి మళ్లీ గ్రహణం అనంతరం శుద్ధి చేసి పూజలు ప్రారంభిస్తారు, భక్తులను అనుమతిస్తారు.అంటే అక్టోబరు 29న ఆలయాలు మళ్లీ తెరుచుకుంటాయి. ఈ చంద్రగ్రహణం అశ్విని నక్షత్రం మేషరాశిలో పడుతోంది. అందుకే అశ్విని నక్షత్రం జాతకులు, మేషరాశివారు ఈ గ్రహణం చూడరాదు..మేషరాశి వారంటే  అశ్విని, భరణి, కృత్తిక నక్షత్రం మొదటి పాదం వారు ఈ గ్రహణం చూడరాదు. 


ఎక్కడెక్కడ గ్రహణం కనిపిస్తుంది


ఈ చంద్రగ్రహణం మనదేశంలోనే కాదు.. బెల్జియం, థాయ్ లాండ్, పోర్చుగల్, హంగేరి, ఈజిప్టు, టర్కీ, ఇండోనేషియా, గ్రీసు, ఇటలీ, మయన్మార్, స్పెయిన్, ఇంగ్లండ్, దక్షిణ ఆఫ్రికా, పారిస్, నైజిరీయా, జపాన్, చైనా, రష్యా దేశాల్లో కనిపిస్తుంది..


Also Read: శరద్ పూర్ణిమ, చంద్రగ్రహణం , గజకేసరి యోగం - ఈ 4 రాశులవారికి గోల్డెన్ టైమ్!


గ్రహణం సమయంలో చేయకూడని పనులివే


గ్రహణం సమయంలో పూజలు నిషిధ్దం, ఈ సమయంలో ఆహారం వండకూడదు, తినకూడదు. గ్రహణం సమయంలో,గ్రహణం పూర్తైన వెంటనే ఆరుబయటకు వెళ్లడం ఆరోగ్యానికి మంచిది కాదు. గ్రహణ సమయంలో గాయత్రి మంత్రం, మహామృత్యుంజయ మంత్రాన్ని జపించాలి.


గాయత్రి మంత్రం
ఓం భూర్భువస్వః  తత్స వితుర్వరేణ్యం |
భర్గో దేవస్య ధీమహి ధియోయోనఃప్రచోదయాత్ ||


మహామృత్యుంజయ మంత్రం
"ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టి వర్ధనం 
ఉర్వారుకమివ బంధనాన్ మృత్యోర్ ముక్షీయ మామృతాత్"


గ్రహణం ముగిసిన వెంటనే తీసుకోవాల్సిన జాగ్రత్తలు



  • సూర్యగ్రహణం , చంద్రగ్రహణం ఏదైనా కానీ ముగిసిన తర్వాత ఇంటి సభ్యులందరూ స్నానం చేయాలి

  • గ్రహణం ముగిసిన తర్వాత ఇంటిని శుభ్రం చేయాలి. ఆ తర్వాత ఇంట్లో గంగాజలం చల్లాలి. ఇలా చేయడం వల్ల ప్రతికూలత తొలగిపోతుంది

  • గ్రహణం ముగిసిన తర్వాత ఇంట్లో దేవతామూర్తుల విగ్రహాలను కూడా శుభ్రం చేసి గంగాజలం చల్లాలి

  • గ్రహణం తర్వాత దానం చేయడం చాలా పవిత్రమైనదిగా పరిగణిస్తారు. దానం చేయడం వల్ల జీవితంలో సుఖసంతోషాలు, శ్రేయస్సు లభిస్తాయని పండితులు చెబుతారు.

  • గ్రహణం ముగిసిన తర్వాత ఆహార పదార్థాలలో కలిపిన గరిక లేదా తులసి ఆకులను తీసివేయాలి

  • గ్రహణ సమయంలో గోళ్లు కత్తిరించడం, జుట్టు దువ్వడం, పళ్లను శుభ్రం చేయడం వంటివి అశుభమైనవిగా పరిగణిస్తారు.

  • గ్రహణ సమయంలో నిద్రపోకూడదు

  • గ్రహణ సమయంలో కత్తులు లేదా పదునైన వస్తువులు ఉపయోగించరాదు


గమనిక: వివిధ శాస్త్రాలు, గ్రంథాలు, పండితులు పేర్కొన్న కొన్ని ఆధ్యాత్మిక అంశాలు, పరిష్కారాలను ఇక్కడ యథావిధిగా అందించాం. వీటిని ఏ మేరకు పరిగణలోకి తీసుకోవాలన్నది పూర్తిగా మీ వ్యక్తిగతం...