Chandra Grahan 2023: గ్రహణాలకు సంబంధించి హిందూమతంలో ప్రాముఖ్యత ఉంది. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం చంద్రగ్రహణం అశుభ చర్యగా పరిగణిస్తారు. గ్రహణం జాతక చక్రంపై  చెడు ప్రభావాన్ని చూపుతుంది, జీవితంలో సమస్యలకు కూడా కారణమవుతుందని జ్యోతిష్య శాస్త్ర పండితులంటే.. గ్రహణం అంటే కేవలం గ్రహాలలో మార్పు మాత్రమే..భూమి సూర్యుడు, చంద్రుని మధ్య జరిగే ఒక చర్య అంటారు శాస్త్రవేత్రలు.


Also Read: ఏప్రిల్ 27 గంగా సప్తమి, గంగావతరణం గురించి ఈ పాటల్లో అత్యద్భుతంగా చెప్పారు


తొలి చంద్రగ్రహణం


శ్రీ శోభకృత్ నామ సంవత్సరంలో మొత్తం 4 గ్రహణాలు సంభవిస్తున్నాయి. అందులో 2 సూర్య గ్రహణాలు, 2 చంద్ర గ్రహణాలున్నాయి. ఈ ఏడాది ఇప్పటికే తొలి సూర్యగ్రహణం ఏర్పడగా.. మొదటి చంద్రగ్రహణం మే 5 న ఏర్పడబోతోంది. ఆరోజు వైశాఖ పౌర్ణమి.  చంద్రుడు, సూర్యుడి మధ్య భూమి వచ్చినప్పుడు చంద్రగ్రహణం ఏర్పడుతుంది.2023 సంవత్సరంలో మొదటి చంద్ర గ్రహణం 2023 మే 5 శుక్రవారం రాత్రి దాదాపు 8:45 గంటలకు ప్రారంభమవుతుంది. అర్థరాత్రి 1:00 గంటకు ముగుస్తుంది. గ్రహణం ప్రారంభం కావడానికి 9 గంటల ముందు సూతకం ప్రారంభమై  గ్రహణం ముగియడంతో ముగుస్తుంది. ఈ సమయంలో ఆలయాల తలుపులు మూసేస్తారు. గర్భిణులు బయటకు రాకూడదని, నేరుగా ఎవ్వరూ గ్రహణం వీక్షించకూడదని, గ్రహణ సమయంలో ఏమీ తినకూడదని చెబుతారు. 


భారతదేశంలో కనిపించదు


ఈ ఏడాది ఏర్పడే తొలి చంద్రగ్రహణం భారతదేశంలో కనిపించదు. అందుకే సూతక కాలం పాటించాల్సిన అవసరం లేదు.  యూరప్, ఆస్ట్రేలియా, ఆఫ్రికా, అంటార్కిటికా, మధ్య ఆసియా, పసిఫిక్ అట్లాంటిక్ , హిందూ మహాసముద్రంలో ఇది కనపడుతుంది.


Also Read: ఏప్రిల్ ఆఖరి వారం 7 రాశులవారికి అద్భుతం - 5 రాశులవారికి కొంత నిరుత్సాహం!


తర్వాతి చంద్రగ్రహణం


2023 శ్రీ శోభకృత్ నామసంవత్సరంలో రెండో చంద్రగ్రహణం అక్టోబర్ 28న ఏర్పడుతుంది. ఆశ్వయుజ శుక్ల పూర్ణిమ శనివారం రోజు రాహుగ్రస్త పాక్షిక చంద్రగ్రహణం ఏర్పడుతుంది...ఈ గ్రహణం భారత దేశంలో కనిపిస్తుంది.  ఈ సంవత్సరంలో చివరి గ్రహణం అవుతుంది. ఈ గ్రహణాన్ని యూరప్, ఆసియా, ఆస్ట్రేలియా, తూర్పు అమెరికా , ఆఫ్రికా లో కనిపిస్తుంది. 


అక్టోబర్ 28న ఏర్పడే గ్రహణం సమయాలు
గ్రహణం స్పర్శకాలం  రాత్రి 1.04 నిముషాలు
గ్రహణం మధ్యకాలం రాత్రి 1.43 నిముషాలు
గ్రహణం మోక్షకాలం రాత్రి 2.23 నిముషాలు
గ్రహణం పుణ్యకాలం 1 గంట 19 నిముషాలు


ఈ గ్రహణం అశ్వని నక్షత్రం మేషరాశిలో పడుతోంది. అందుకే అశ్విని నక్షత్రం వారితో పాటూ మేషరాశి వారు ఎవ్వరూ ఈ గ్రహణం చూడకూడదు. 


భారతదేశంలో కనిపించకపోయినా నియమాలు పాటించాలా


భారత దేశంలో ఈ గ్రహణం కనిపించదు కాబట్టి జ్యోతిష్య శాస్త్రం ప్రకారం శుభకార్యాలపై ఎలాంటి ప్రభావం ఉండదని జ్యోతిష్యశాస్త్రవేత్తలు చెబుతున్నారు. అంటే గ్రహణం ఏర్పడటానికి ముందు నుంచి గ్రహణం ముగిసే వరకు ఉన్న సమయాన్ని అశుభమైనదిగా పరిగణిస్తారు. ఈ సమయంలో ఎలాంటి శుభకార్యాలు చేయకూడదని  కొందరు పండితులు చెబుతారు. మనదేశంలో గ్రహణం కనిపించదు కాబట్టి నియమాలు మాత్రం పాటించాల్సిన అవసరం లేదంటున్నారు.


గమనిక: వివిధ శాస్త్రాలు, గ్రంథాలు, పండితులు పేర్కొన్న కొన్ని ఆధ్యాత్మిక అంశాలు, పరిష్కారాలను ఇక్కడ యథావిధిగా అందించాం. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ బాధ్యత వహించదని గమనించగలరు.