సాయుధ బలగాల్లో 50,187 కానిస్టేబుల్ (జీడీ)/ రైఫిల్‌మ్యాన్/ సిపాయి పోస్టులు భర్తీకి సంబంధించి వాయిదాపడిన శారీరక సామర్థ్య పరీక్షల (పీఈటీ, పీఎస్‌టీ) తేదీలను స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ప్రకటించింది. మే 1 నుంచి 15 వరకు అభ్యర్థులకు ఫిజికల్ ఈవెంట్లు నిర్వహించనున్నట్లు తెలిపింది. వీటికి సంబంధించిన అడ్మిట్ కార్డులను అభ్యర్థలు సీఆర్‌పీఎఫ్ అధికారిక వెబ్‌సైట్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవాల్సిందిగా కోరింది. ఫిజికల్ ఈవెంట్లకు హాజరయ్యే అభ్యర్థులు తప్పనిసరిగా అడ్మిట్ కార్డులను వెంట తీసుకెళ్లాల్సి ఉంటుంది. అడ్మిట్ కార్డు లేనిదే అనుమతి ఉండదు.


రాత పరీక్షలో ఉత్తీర్ణులైన అభ్యర్థులకు పీఎస్‌టీ, పీఈటీలను ఏప్రిల్‌ 24 నుంచి మే 8 వరకు నిర్వహించనున్నట్లు సీఆర్‌పీఎఫ్‌ గతంలోనే ప్రకటించింది. అయితే పాలనాపరమైన కారణాల వల్ల ఈ పరీక్షలను వాయిదా వేసింది. అయితే తాజాగా తేదీలను ప్రకటించింది. ఈ మేరకు అధికారిక ప్రకటనను తాజాగా విడుదల చేసింది. శారీరక సామర్థ్య పరీక్షలను మే 1 నుంచి ప్రారంభించనున్నట్లు వెల్లడించింది. ఇందుకు అనుగుణంగా ఈ-అడ్మిట్ కార్డు డౌన్‌లోడ్ సదుపాయం పునరుద్ధరించి అందుబాటులోకి తీసుకొచ్చింది.


అడ్మిట్ కార్డుల కోసం క్లిక్ చేయండి..



కేంద్ర సాయుధ బలగాలైన బీఎస్‌ఎఫ్‌, సీఆర్‌పీఎఫ్‌, ఎస్‌ఎస్ఎఫ్‌, అస్సాం రైఫిల్స్‌లో కానిస్టేబుల్(జీడీ)/ రైఫిల్‌మ్యాన్‌(జీడీ) ఉద్యోగాల భర్తీకి సంబంధించి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ గతేడాది నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు ఎస్‌ఎస్‌సీ జనవరిలో ఆన్‌లైన్ కంప్యూటర్ ఆధారిత పరీక్ష నిర్వహించింది. ఈ పరీక్ష సమాధానాల ప్రాథమిక కీని ఫిబ్రవరి 18న విడుదల చేసింది. ఈ కీపై ఫిబ్రవరి 18 నుంచి 25వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు అభ్యంతరాలను ఆన్‌లైన్‌లో స్వీకరించారు. తుది కీతో పాటు ఫలితాలు వెల్లడించాక ఫిజికల్ ఎఫిషియెన్సీ టెస్ట్, ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్, వైద్య పరీక్షలు, ధ్రువపత్రాల పరిశీలన ఆధారంగా అభ్యర్థుల తుది ఎంపిక ప్రక్రియను చేపట్టనున్నారు.


మొదట నోటిఫికేషన్ విడుదల సమయంలో మొత్తం 24,369 ఖాళీలను ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే ఆ సంఖ్యను గత నవంబర్‌లో 45,284కు పెంచుతూ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ మరో ప్రకటన విడుదల చేసింది. తాజాగా ఆ పోస్టులకు అదనంగా మరో 1,151 ఖాళీలను కలిపారు. దీంతో మొత్తం ఖాళీల సంఖ్య 46,435కు చేరింది. ‌తాజాగా ఐటీబీపీ విభాగంలో సిబ్బంది నియామకానికి మరో 3,257 పోస్టులను కలపడంతో మొత్తం ఉద్యోగ ఖాళీల సంఖ్య ‌50,187 పెరిగింది. 


మొత్తం 50,187 ఖాళీల్లో బీఎస్‌ఎఫ్‌లో 21,052; సీఐఎస్‌ఎఫ్‌లో 6,060; సీఆర్‌పీఎఫ్‌లో 11,169; ఎస్‌ఎస్‌బీలో 2274; ఐటీబీపీలో 5642, ఏఆర్‌లో 3601, ఎస్‌ఎస్‌ఎఫ్‌లో 214, ఎన్‌సీబీలో 175 పోస్టులు ఉన్నాయి. ఎన్‌సీబీ మినహాయించి మొత్తం ఖాళీల్లో 44,439 పోస్టులు పురుషులకు, 5573 పోస్టులు మహిళలకు కేటాయించారు.



Also Read:


యూపీఎస్సీ సీఎంఎస్-2023 నోటిఫికేషన్ విడుదల, వివిధ విభాగాల్లో 1261 పోస్టుల భర్తీ!
కేంద్ర ప్రభుత్వంలోని పలు విభాగాల్లో మెడికల్ ఆఫీసర్ల నియామకానికి సంబంధించిన కంబైన్డ్ మెడికల్ సర్వీసెస్-2023 నోటిఫికేషన్‌ను యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) ఏప్రిల్ 19న విడుదల చేసింది. దీనిద్వారా వివిధ విభాగాల్లో 1261 పోస్టులను భర్తీ చేయనున్నారు. ఎంబీబీఎస్ అర్హత ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. చివరి సంవత్సరం చదువుతున్నవారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. అభ్యర్థులు నిర్దిష్ట శారీరక/ వైద్య ప్రమాణాలకు కలిగి ఉండాలి. సరైన అర్హతలు ఉన్న అభ్యర్థులు ఏప్రిల్ 19 నుంచి మే 9న సాయంత్రం 6 గంటల వరకు తమ దరఖాస్తులు సమర్పించవచ్చు. అభ్యర్థులు దరఖాస్తు ఫీజుగా 200 చెల్లించాల్సి ఉంటుంది. మహిళలు, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు ఫీజు నుంచి మినహాయింపు ఉంది. యూపీఎస్సీ సీఎంఎస్ పరీక్ష జులై 16న దేశవ్యాప్తంగా 41 సెంటర్లలో నిర్వహించనున్నారు.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..


మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి..