Ardra Nakshatra Is Good or Bad:  ఆరుద్ర నక్షత్రం నాలుగు పాదాలు మిథునరాశిలోనే ఉంటాయి. ఆరుద్ర నక్షత్రంలో జన్మించినవారు బయటకు కఠినంగా ఉన్నప్పటికీ లోపల దయగలవారు. ఎదుటి వారి మనసులో ఏముందో సులువుగా పసిగట్టగలుగుతారు. ఈ నక్షత్రంలో జన్మించిన వ్యక్తులు ఉద్యోగాలలో ఓ వెలుగు వెలుగుతారు. తమ పై అధికారులతో సత్సంబంధాలు కలిగి ఉంటారు. ఈ వ్యక్తులకు ప్రాపంచిక విషయాలపై ప్రత్యేక అవగాహన ఉంటుంది. ప్రతికూల పరిస్థితుల్లో కూడా  సులభంగా విజయం సాధిస్తారు. మాట్లాడడంలో మంచి నేర్పు కలిగిఉంటారు. ఆర్థిక సంబంధిత నిర్ణయాలను సరిగా తీసుకోలేరు. తప్పుడు సలహాలు ఇవ్వడం, పగతీర్చుకోవాలనే ఆలోచన, మొండిపట్టుదల వల్ల వీరి జీవితంలో కష్టాలుంటాయి. తల్లిదండ్రులు, తోబుట్టువులమీద మంచి ప్రేమ కలగిఉంటారు. వీళ్లు ఎక్కువహా రాత్రిపూట నిర్ణయాలు తీసుకుంటారు.  


Also Read: ఆగష్టు నెల రాశి ఫలాలు - ఈ నెలలో 8 రాశువారికి అదృష్టం, 4 రాశులవారికి కష్టాలు!


ఈ రంగాల్లో రాణిస్తారు


ఆరుద్ర నక్షత్రంలో జన్మించిన వారికి ఉద్యోగంతో పాటు వ్యాపారాలు చేసే సామర్థ్యం ఉంటుంది.  ఎలక్ట్రానిక్స్, రాజకీయ రంగం,  కంప్యూటర్ విశ్లేషకులు, సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లు, ఎలక్ట్రికల్ ఇంజనీర్లు, డిటెక్టివ్‌లు, న్యూరాలజిస్టులు, వీడియో గేమ్ డెవలపర్లు, సైకియాట్రిస్ట్‌లు, సైన్స్ ,  ఫిక్షన్ రైటింగ్  రంగాలలోకి వెళ్ళవచ్చు. వీరికి 32 ఏళ్ల నుంచి 42 సంవత్సరాల వరకు శుభప్రదం.


వివాహం ఆలస్యం


ఆరుద్ర నక్షత్రంలో పుట్టిన పురుషులకు సాధారణంగా వివాహం ఆలస్యం అవుతుంది. ఒకవేళ 27 ఏళ్లులోగా వివాహం జరిగినా ఆ బంధం నిలబడడం కష్టమే అంటారు జ్యోతిష్య శాస్త్ర నిపుణులు. వైవాహిక జీవితంలో చాలా ఇబ్బందులు ఎదుర్కొంటారు. అందుకే వీరు ఆలస్యంగా వివాహం చేసుకోడమే మంచిదని సూచిస్తున్నారు. 


ఆరుద్ర నక్షత్రంవారిని వేధించే వ్యాధులు


ఈ నక్షత్రంలో జన్మించిన పురుషులు 34 ఏళ్లు నిండిన తర్వాత నయం కాని వ్యాధుల బారిన పడొచ్చు. ఎక్కువగా దంత సమస్యలు, గుండె సంబంధిత సమస్యలు, పొడి దగ్గు లేదా ఉబ్బసం, ముక్కు-చెవి సమస్యలు  ఎదుర్కోవాల్సి వస్తుంది.


 Also Read: ఆగష్టులో రాశిమారుతున్న బుధుడు, శుక్రుడు, కుజుడు, సూర్యుడు.. ఈ 4 రాశులవారికి సంపద, సంతోషం పెరుగుతుంది!  


ఆరుద్ర నక్షత్ర స్త్రీలు ఇలా ఉంటారు


ఈ నక్షత్రంలో జన్మించిన స్త్రీలు  శాంతియుత స్వభావం కలిగి ఉంటారు. వారు తమ తెలివితేటలతో నెగ్గుకొస్తారు..అనవసర వాదనలు పెట్టుకునేందుకు ఆసక్తి చూపించరు. అయితే ఒకరి నుంచి వచ్చే చిన్నపాటి శ్రద్ధ కూడా వీరిని బలహీనపరుస్తుంది. ఈ నక్షత్రంలో జన్మించిన స్త్రీలు కొత్త విషయాలు నేర్చుకోవడంపై ఎక్కువ శ్రద్ధ చూపిస్తారు.  పరిశోధన లేదా వైజ్ఞానిక రంగంలో బాగా రాణిస్తారు. ఇంకా ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ లేదా ఏదైనా వైద్యానికి సంబంధించిన రంగాల్లోనూ రాణిస్తారు.  ఈ నక్షత్రంలో జన్మించిన స్త్రీలు తన భర్తతో మంచి అనుకూలతను కలిగి ఉంటారు. ఈ నక్షత్రంలో పుట్టిన స్త్రీలు ఎక్కువగా రుతుక్రమ సమస్యలతో బాధపడతారు. అగ్నిపట్ల జాగ్రత్తగా వ్యవహరించాలి. 


ఆరుద్ర నక్షత్రంలో జన్మించినవారి వారి అదృష్ట సంఖ్య 2, 4, 7, 9.  ఈ నక్షత్రంలో పుట్టిన వారికి అదృష్ట రంగులు ఎరుపు, ఊదా రంగులు. ఈ నక్షత్రంలో పుట్టిన వారికి మంగళ, గురువారాలు అదృష్ట రోజులు.


Also Read: ఆగష్టులో పుట్టినవారికి ధైర్యం, ఆత్మవిశ్వాసం, విధేయత అన్నీ ఎక్కువే..ఆ ఒక్క విషయంలో దురదృష్టవంతులు!


Note:ఫలితాలు మొత్తం ఒక్కరికే వర్తిస్తాయని భావించరాదు..మీ జాతకంలో గ్రహస్థితి ఆధారంగా కూడా ఫలితాల్లో మార్పులుంటాయి.. వీటిని ఎంతవరకూ పరిగణలోకి తీసుకోవాలన్నది పూర్తిగా మీ వ్యక్తిగతం.