12 Zodiac Signs Personality Traits: మీ లక్షణాలు, మీ ప్రవర్తనా విధానం మీ రాశిపై ఆధారపడి ఉంటుందంటారు జ్యోతిష్య శాస్త్ర పండితులు. మీ రాశి ఆధారంగా చూస్తే మీరిలా ఉంటారు.


మేష రాశి (Aries) (అశ్వని, భరణి, కృత్తిక 1వ పాదం)


ఈ రాశివారికి దూకుడు ఎక్కువ.  ఏదైనా విషయాన్ని తొందరగా గ్రహించగల నేర్పు వీరి సొంతం. బాగా సంపాదిస్తారు. ఉపకారం చేయడంలో ముందుంటారు. పట్టుదలతో కార్యాన్ని సాధిస్తారు. అనారోగ్యాన్ని పెద్దగా పట్టించుకోరు. అయితే  కొన్ని సందర్భాల్లో ఆలోచన లేకుండా అడుగు ముందుకేసి నష్టపోతారు.


వృషభ రాశి (Taurus) (కృత్తిక 2,3,4 పా, రోహిణి, మృగశిర 1,2 పా.)


వృషభరాశి అంటే ఎద్దు. ఈ రాశివారు స్ధిరత్వం కలిగి ఉంటారు. పోషించే స్వభావం మెండుగా ఉంటుంది. ఎత్తైన భుజాలు, పెరిగిన కండలు, విశాలమైన ముఖం కలిగి ఉంటారు. గొడ్డు చాకిరీ చేయడానికి వీరు కేరాఫ్. ఓర్పు, సహనం కూడా ఎక్కువగానే ఉంటుంది. ఎప్పుడూ ఇతరుల అధీనంలో ఉంటారు. ఆరోగ్యవంతులై ఎప్పుడూ సంతోషంగా ఉంటారు. ఉద్యోగ నిర్వహణలో మంచి పేరు సాధిస్తారు. 


మిథున రాశి (Gemini) (మృగశిర 3,4, ఆరుద్ర, పునర్వసు 1,2,3 పా.)


మిధునరాశిది పురుషుడు ఒక చేత్తో గధ, స్త్రీ ఒక చేత్తో వీణ ధరించిన స్వరూపం. భార్యాభర్తలు ఇద్దరు యుక్తాయుక్త జ్ఞానాన్ని కలిగి ఉంటారు. ఒకరి కోసం ఒకరు అనే భావన, వైవిధ్యం, కొంతకాలం ఆర్ధిక ప్రతికూలత, కొంతకాలం ఆర్ధిక అనుకూలత ఉంటుంది. ఈ రాశివారు రెండు వృత్తుల ద్వారా ఆదాయం కలిగి ఉంటారు. ఎక్కువగా కోరికలు కలవాలు, విలాస వస్తువుల కోసం ఎక్కువగా ఖర్చు చేసేవారు అవుతారు. అందర్నీ తొందరగా నమ్మేస్తారు..అందుకే ఈజీగా మోసపోతారు.


Also Read: వృషభ రాశిలోకి బుధుడు, ఈ ప్రభావం 12 రాశులపై ఎలా ఉంటుందంటే!


కర్కాటక రాశి (Cancer) కర్కాటకం (పునర్వసు 4 పాదం, పుష్యమి, ఆశ్లేష)


ఈ రాశివారు ఆలోచనాపరులు. కార్యనిర్వహణలో వెనకడుగు వేయరు. వీరిలో చాలా ఆశలుంటాయి. అనుకున్న పని పూర్తిచేయడానికి పట్టుదలతో కృషి చేస్తారు. కొన్ని సమస్యల నుంచి తప్పించుకునే తెలివితేటలు వీరిసొంతం. స్వతంత్ర ఆలోచనలు కలిగి ఉంటారు. తమకు నచ్చనివారికి అపకారం చేయడానికి అస్సలు వెనుకాడరు. జీవితంలో కొన్ని ఆటుపోట్లు ఎదుర్కొంటారు.


సింహ రాశి (Leo)(మఖ, పుబ్బ, ఉత్తర 1 పాధఁ)


సింహం రాశి వారిది మృగ స్వభావం. బిగ్గరగా అరవడం, స్వేచ్ఛగా సంచరించడం, అస్సలు జంకులేని స్వభావం, అందర్నీ మించి ఉండాలనే స్వభావం వీరిది. ఈ రాశివారికి నాయకత్వ లక్షణాలు పుష్కలంగా ఉంటాయి. మంచి విద్యాబుద్ధులు కలిగి ఉంటారు. ఉన్నతి కోసం పాటుపడతారు. వృత్తి ఉద్యోగములలో రాణిస్తారు. శత్రువులను తొక్కిపడేస్తారు.


కన్యా రాశి  (Virgo) (ఉత్తర 2,3,4 పాదాలు, హస్త, చిత్త1,2 పాదాలు)


సముద్రంలో తెప్పపై ఒక చేత్తో దీపం, ఒక చేత్తో సస్యమును ధరించిన స్త్రీ దీనికి గుర్తు. కన్య అంటే పుష్పవతి కాని స్త్రీ. విశేషమైన ఊహాలు, సిగ్గు, బిడియం, దగ్గరకు వచ్చి మాట్లాడుటకు భయం, సభలో మాట్లాడుటకు బెరుకు, అమాయక ప్రవర్తన కలిగి ఉంటారు. పెద్దల అండ లేనిదే ఏ పని చేయలేరు. స్త్రీకి ఉండే వాత్సల్యం, అభిమానం, బంధు ప్రేమ ఈ రాశివారి సొంతం. తన బాధను, శ్రమను ఇతరులు గుర్తించాలనుకుంటారు. లేమిలోపుట్టి లేమిలోనే జీవితాన్ని అంతం చేస్తారు. కానీ మధ్యలో సుఖవంతమైన జీవితం గడుపుతారు.


తులా రాశి (Libra) (చిత్త 3,4, స్వాతి, విశాఖ1,2,3 పాదాలు)


త్రాసు ధరించిన పురుషుడు. సమాజంలో వర్తకుడు త్రాసు ధరిస్తాడు.స్ధిర చిత్తమును కలిగి ఉంటారు. ధర్మాధర్మముల విచక్షణ, సమయోచితంగా ప్రవర్తించుట, ఇతరులకు సహాయపడడం, అవకాశాలను కాలాన్ని సరిగ్గా వినియోగించుకోవడం వీరి లక్షణాలు. ఈ రాశివారు ఆరోగ్యవంతులు, ఐశ్వర్యవంతులు. కష్టానికి తగిన ఫలితం పొందుతారు.


వృశ్చిక రాశి (Scorpio) (విశాఖ 4వ పాదం, అనూరాధ, జ్యేష్ఠ)


వృశ్చికం అంటే తేలు. తేలు కనిపిస్తే చంపేస్తారు కనుక ఇతరుల నుంచి తనను కాపాడుకోవటం కోసం రహస్య ప్రవర్తన కలిగి ఉంటుంది.ఈ రాశివారి స్వభావం కూడా ఇలాగే ఉంటుంది. ఇతరులు తమకు హానిచేయకుండా జాగ్రత్తగా చూసుకుంటారు. కానీ ఇతరులకు హానికలిగించే మాటలు, పనులు చేస్తారు. ఈ రాశివారు పగబడితే తీర్చుకునేవరకూ తగ్గరు. అత్యంత పౌరుషవంతులు. ఎవ్వర్నీ పట్టించుకునే రకంకాదు. ఉన్నదాంట్లోనే సంతృప్తికర జీవితం గడుపుతారు.


Also Read: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం జూన్ నెలలో జన్మించిన వారి లక్షణాలివే


ధనుస్సు రాశి  (Sagittarius) (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1వ పాదం) 


నడుము కింది భాగం అశ్వ రూపం కలిగిన మానవ రూపం. ఈ రాశివారు ఏకాగ్రత, కార్యదీక్ష, పట్టుదల కలిగి ఉంటారు. కదలిక లేని స్వభావం వల్ల  ఇతరుల ఆదేశానుసారం నడుచుకుంటారు. చాలాజాగ్రత్తగా అన్ని విషయాలు గమనిస్తారు. తెలిసినది తక్కువైనా దానిని పూర్తి స్థాయిలో ఉపయోగించుకుంటారు. అందరితో సరదాగా కలసిపోతారు.


మకర రాశి (Capricorn) (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ఠ 1,2 పా.)


లేడి ముఖం కలిగి మొసలి రూపం మకరరాశి. లేడికి ఉండే సుకుమారం, లావణ్యత, నాజూకుతనంతో పాటూ మొసలికి ఉండే పట్టుదల, పొంచి ఉండి అవకాశం రాగానే కబళించే స్వభావం వీరి సొంతం. ఏమి ఎరుగట్టే ఉంటారు కానీ సమయం చూసి పట్టు పడతారు. పట్టిన పట్టు వదలరు. ఇతరుల కష్టసుఖాలతో సంబంధం లేకుండా తమ పని పూర్తైతే చాలనే భావనతో ఉంటారు. కెరీర్లో ఉన్నత స్థానంలో ఉంటారు.


కుంభ రాశి  (Aquarius) (ధనిష్ఠ 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3 పా.)


నీటి కడవ ధరించిన మానవ రూపం. ఈ రాశివారికి ఈర్ష్య, అసూయ ఎక్కువే.  ధనం కోసం పాట్లు పడతారు. సంకుచిత స్వభావం వల్ల పెద్ద పెద్ద అవకాశాలు పోగొట్టుకుంటారు. సోమరితనంగా, చలనం లేకుండా వ్యవహరిస్తారు. ఈ విషయంలో అయినా అంత తొందరగా బయటపడరు. 


మీన రాశి (Pisces) (పూర్వాభాద్ర 4 పాదం, ఉత్తరాభాద్ర, రేవతి)


రెండుచేపలు ఒకదాని తోక వైపు మరొక చేప తల ఉన్నట్లుండే రూపం . ఈ రాశివారికి సంగీత, సాహిత్యాలపై ఆసక్తి ఉంటుంది. డబ్బు బాగా సంపాదిస్తారు.  నీటి ప్రవాహంలో ప్రయాణంలా ఉంటుంది వీరి జీవితం. అంటే ఎరవేస్తే వలలో పడతారు, ఆశ చూపిస్తే లొంగిపోతారు, కొత్త వారితో స్నేహం పెంచుకుంటారు. అయితే ఈ రాశివారు ఆరోగ్యవంతులు