YSRCP Rebel MP Raghurama Krishnam Raju:  ప్రకాశం జిల్లా యర్రగొండపాలెంలో మాజీ సీఎం చంద్రబాబు నాయుడు పర్యటనలో జరిగిన రాళ్ల దాడిని వైఎస్సార్ సీపీ రెబల్ ఎంపీ రఘురామ తీవ్రంగా ఖండించారు. ఆయన ప్రతిపక్షనేత అని, 14 ఏళ్లు పైగా సీఎంగా సేవలు అందించిన వ్యక్తి చంద్రబాబు అన్నారు. మద్యం ఇవ్వకుండా, డబ్బులు పంచకుండానే ప్రజలు స్వచ్ఛందంగా టీడీపీ కార్యక్రమాలకు, చంద్రబాబు ఈవెంట్లకు పెద్ద ఎత్తున తరలివస్తున్నారని గుర్తుచేశారు ఎంపీ రఘురామ.


ఎస్సీలకు చంద్రబాబు క్షమాపణలు చెప్పాలా..?
ఎస్సీలకు చంద్రబాబు క్షమాపణ చెప్పాలన్న వైసీపీ నేతల డిమాండ్ ను తప్పుపట్టారు. 29 ఎస్సీ సంక్షేమ కార్యక్రమాలను తొలగించారని ఏపీ ప్రభుత్వాన్ని ప్రశ్నించినందుకు చంద్రబాబు క్షమాపణ చెప్పాలా అంటూ మండిపడ్డారు. ఎస్సీల అభ్యున్నతి కోసం ఎన్నో పథకాలు తీసుకొచ్చిన నేత చంద్రబాబు అన్నారు. అసలు చంద్రబాబు ఏ జిల్లాలోనూ పర్యటించకూడదా అని ప్రశ్నించారు. తననేమో తన సొంతూరు, సొంత నియోజకవర్గానికి రాకుండా ఏపీ ప్రభుత్వం అడ్డుకుంటుందని, ఇప్పుడేమో చంద్రబాబు ఎక్కడికి వెళితే అక్కడ ఉద్రిక్తత నెలకొనే చర్యలకు వైసీపీ నేతలు పాల్పడుతున్నారని ఆరోపించారు. ప్రజలు ప్రజాస్వామ్య పద్ధతిలో నిరసన తెలిపాలని పిలుపునిచ్చారు.


జాతీయ మీడియా సర్వేపై రియాక్షన్..
ఇప్పటికిప్పుడూ ఏపీలో ఎన్నికలు జరిగితే అధికార వైసీపీ మొత్తం 25 లోక్ సభ స్థానాలకు 24 స్థానాలు నెగ్గుతారని జాతీయ మీడియా సర్వేలో వచ్చింది. అయితే 25కి ఇరవై ఐదు ఇస్తే బాగుండదని ఒక సీటు తగ్గించారని సెటైర్లు వేశారు. వైసీపీ నిజంగానే అన్ని స్థానాల్లో మళ్లీ విజయం సాధిస్తుందంటే.. ఇంత హడావుడి చేయాల్సిన అవసరం లేదన్నారు. ప్రతిపక్ష నేత చంద్రబాబును గానీ, తనను గానీ ఎక్కడికి వెళ్లకుండా అడ్డుకునే అవసరం లేదని స్పష్టం చేశారు.
మార్చి 14 అర్ధరాత్రి వివేకా హత్య జరగగా.. 15న ఉదయం 6.25కు తెలియగా.. చక్రాయపాలెం నవీన్ కు ఫోన్ కాల్ చేయాల్సిన అవసరం ఏముందని ప్రశ్నించారు. దాంతో ఈ హత్య కేసుకు సీఎం జగన్ కు ఏమైనా సంబంధం ఉందా అని అనుమానం రావడంతో పీఏలు ఇద్దరిని ఒక్కొక్కరిగా సీబీఐ అధికారులు విచారణ చేస్తున్నారని చెప్పారు.


షేక్ షమీమ్ వైఎస్ కుటుంబంలో కొత్త కోడలుగా వచ్చారు. వివేకా తనను రెండుసార్లు పెళ్లి చేసుకున్నారని, అయితే తన బిడ్డకు రాజకీయ వారసత్వం ఇస్తారన్న భయంతోనే తన భర్త వివేకా హత్య జరిగి ఉంటుందని ఆమె అనుమానం వ్యక్తం చేశారని రఘురామ అన్నారు. వివేకా కు చెక్ పవర్ తొలగించారని చెబుతున్నారని, కానీ కోట్ల రూపాయల బిల్డింగ్, ఆస్తులు ఇస్తారేమోనని భయంతో వివేకాను చంపి ఉంటుందని భిన్నంగా ఆమె కామెంట్లు చేస్తున్నారని చెప్పారు. ఖర్చుల కోసం ఇబ్బంది పడ్డ వివేకా రెండో భార్య షమీమ్ కు ఏం ఆస్తులు ఇచ్చేస్తారని హత్య చేసే అవకాశం ఉందో తనకు అర్థం కావడం లేదన్నారు ఎంపీ రఘురామ. గతంలోనే సీబీఐకి కేసుకు సంబంధించి షేక్ షమీమ్ వివరాలు చెప్పారని, ఇప్పుడు చెప్పడానికి ఇందులో కొత్త విషయాలేవీ లేవన్నారు.


చంద్రబాబు టూర్‌లో రాళ్ల వాన- భద్రతా సిబ్బందికి గాయాలు 
ప్రకాశం జిల్లా యర్రగొండుపాలెంలో రాత్రి హైటెన్షన్ వాతావరణం కనిపించింది. ఓవైపు చంద్రబాబు టూర్ అదే టైంలో ఆయనకు వ్యతిరేకంగా మంత్రి ఆదిమూలపు సురేష్ నిరసన చేపట్టారు. ఈ రెండింటి మధ్య పోలీసులు, భద్రతా సిబ్బంది కాసేపు హడావుడి నడిచింది. ఓవైపు రాళ్లవర్షం మరోవైపు పోలీసులు లాఠీఛార్జ్‌తో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. వైసీపీ, టీడీపీ శ్రేణులు కర్రలు, రాళ్లతో ఇరు వర్గాలు దాడులు చేసుకున్నాయి. ఈ దాడుల్లో చంద్రబాబు భద్రతా సిబ్బందికి గాయాలు అయ్యాయి.