తెలుగు చిత్ర పరిశ్రమలో కాస్త ఆందోళనకరమైన వాతావరణం నెలకొంది. సీనియర్ నటుడు శరత్ బాబు (Sarath Babu) ఆరోగ్య పరిస్థితి గురించి కొన్ని రోజులుగా చాలా కథనాలు ప్రచారంలోకి వచ్చాయి. మార్చి నెలాఖరులో ఆయనకు సీరియస్ గా ఉందని వినిపించింది. అయితే, అప్పట్లో అటువంటిది ఏమీ లేదని కుటుంబ సభ్యులు తెలిపారు. లేటెస్ట్ అప్డేట్ ఏంటంటే... ఆస్పత్రిలో శరత్ బాబు ఉన్నారు. 


బెంగళూరు నుంచి హైదరాబాదుకు!
శరత్ బాబు అస్వస్థతకు గురి కావడంతో శుక్రవారం బెంగళూరు నుంచి ఆయన్ను హైదరాబాద్ సిటీకి తీసుకు వచ్చారు. గచ్చిబౌలిలోని ఏఐజీ ఆస్పత్రిలో జాయిన్ చేశారు. ప్రస్తుతం ఐసీయూలో శరత్ బాబుకు చికిత్స అందిస్తున్నారు. చిత్రసీమ ప్రముఖులు, అభిమానులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, శరత్ బాబు ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు తెలియజేసినట్టు సమాచారం. అయితే, చిత్రసీమ వర్గాల్లో మాత్రం ఆందోళన ఉంది. 


శరత్ బాబుతో సన్నిహిత సంబంధాలు ఉన్న కొందరు తెలుగు సినిమా ప్రముఖులు ఏఐజీ ఆస్పత్రికి వెళ్లి... సీనియర్ నటుడి ఆరోగ్యం ఎలా ఉందో తెలుసుకుని వచ్చారు. అయితే, ఎవరూ ఏమీ మాట్లాడటం లేదు. 


'ఇది కథ కాదు'తో బ్రేక్!
కథానాయకుడిగా శరత్ కుమార్ ప్రయాణం ప్రారంభం అయ్యింది. కెరీర్ మొదలైన కొత్తల్లో ఎక్కువగా తమిళ, తెలుగు సినిమాలు చేశారు. ఆ తర్వాత కన్నడ,  హిందీ, మలయాళ భాషల్లో నటించారు. అప్పట్లో శరత్ బాబును అమ్మాయిల కలల రాకుమారుడిగా పేర్కొనేవారు. 


కమల్ హాసన్, జయసుధ, చిరంజీవి ప్రధాన పాత్రల్లో రూపొందిన 'ఇది కథ కాదు' సినిమాతో తనకు బ్రేక్ వచ్చిందని శరత్ బాబు పలు ఇంటర్వ్యూల్లో చెప్పారు. కె. బాలచందర్ దర్శకత్వం వహించిన ఆ సినిమా, తమిళంలో ఆయన తీసిన 'అవరాగళ్' సినిమాకు రీమేక్. తమిళ సినిమాలో కూడా శరత్ బాబు నటించారు.  


Also Read : 'బాహుబలి' నిర్మాతలతో ప్రభాస్ సినిమా - ఎప్పుడూ చేయని క్యారెక్టర్‌తో?


హీరో పాత్రలకు మాత్రమే పరిమితం కాకుండా... పరిస్థితిని బట్టి విలన్, క్యారెక్టర్ ఆర్టిస్ట్ రోల్స్ కూడా శరత్ బాబు చేశారు. అందువల్ల, ఆయన కెరీర్ ఎక్కువ కాలం కొనసాగింది. 'మూడు ముళ్ల బంధం', 'సీతాకోక చిలుక', 'సంసారం ఒక చదరంగం', 'అన్నయ్య', 'ఆపద్భాందవుడు', 'సాగర సంగమం', 'బొబ్బిలి సింహం', 'శివరామ రాజు' వంటి చిత్రాల్లో ఆయన మంచి పాత్రలు పోషించారు. కళాతపస్వి కె. విశ్వనాథ్ దర్శకత్వం వహించిన సినిమాల్లో శరత్ బాబుకు మంచి పాత్రలు లభించేవి. 


రమాప్రభకు విడాకులు...
తర్వాత వేరే వివాహం!
శరత్ బాబు, రమాప్రభ కొన్ని సినిమాల్లో జంటగా నటించారు. సినిమా షూటింగుల్లో మొదలైన పరిచయం పెళ్లి పీటల వరకు దారి తీసింది. అయితే, ఆ వివాహ బంధం ఎక్కువ రోజులు నిలవలేదు. 1974లో పెళ్లి చేసుకుంటే... 1988లో విడాకులు తీసుకున్నారు. ఆ తర్వాత నటి స్నేహ నంబియార్ (Sneha Nambiar)ను పెళ్లి చేసుకున్నారు. ఆమెతో 2011లో విడాకులు అయ్యాయి. శరత్ బాబు అసలు పేరు సత్యం బాబు దీక్షితులు. శరత్ బాబుకు కుమారులు ఉన్నారు. ఆయన ఆరోగ్య పరిస్థితిని వాళ్ళు దగ్గర ఉండి మరీ చూసుకుంటున్నట్లు తెలిసింది. 


Also Read సల్మాన్ మార్కెట్ పదేళ్ళు వెనక్కి - ఫస్ట్ డే మరీ ఇంత ఘోరమా!?