Srikakulam News : అధికార వైసీపీలో అసమ్మతి మంటలు భగ్గు మంటున్నాయి. ఎమ్మెల్యే రెడ్డి శాంతిని వ్యతిరేకిస్తు ఓ వర్గం రోడ్డెక్కడం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. ఆమెకు వచ్చే ఎన్నికల్లో టిక్కెట్ కేటాయించవద్దని బహిరంగంగా అల్టిమేటమ్ ఇవ్వడం చర్చనీయాంశంగా మారుతుంది. కాగా రెడ్డి శాంతి కుటుంబానికి తొలి నుంచి ఆ పార్టీ అధినేత సీఎం జగన్మోహన్ రెడ్డితో స్నేహసంబంధాలున్నాయి. రెడ్డి శాంతి వైసీపీ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే, జడ్పీ చైర్మన్ పాలవలస రాజశేఖర్ కుమార్తెగా జిల్లా వాసులకు పరిచయం. అంతకు ముందు రెడ్డి శాంతి భర్త నాగభూషణంతో జగన్ పార్టీ స్థాపించినప్పటి నుంచే సత్ససంబంధాలున్నాయి. 2014లో శ్రీకాకుళం ఎంపీ టిక్కెట్ కేటాయించిన రోజే అందరికీ తెలిసింది. ఆ ఎన్నికల్లో ఓటమి పాలైన అనంతరం ఆమె పార్టీకి జిల్లా అధ్యక్షురాలు వంటి కీలక బాధ్యతలు తీసుకున్నారు. ఆమె సామాజిక వర్గం అధికంగా ఉన్న పాతపట్నం సెగ్మెంటు నుంచి 2019 ఎన్నికలో బరిలో దిగి విజయం సాధించారు.
పాతపట్నంలో ఎమ్మెల్యే రెడ్డి శాంతిపై వైసీపీ నేతల వ్యతిరేకత
తొలి రెండేళ్లు ఆమె కేడర్ కు అందుబాటులో ఉండడం లేదని టాక్ నడిచింది. ఆమె భర్త నాగభూషణ్ అనారోగ్యంతో మరణించారు. తదుపరి రెడ్డి శాంతి పాతపట్నం సెగ్మెంటులో ఎక్కువగా ఉండడానికి ప్రయత్నం చేశారు. కరోనా సమయంలో జిల్లాలో మిగిలిన ఎమ్మెల్యేల కంటే పర్యటించారు. తరువాత గడప గడపకు కూడా ప్రజలలో కనిపిస్తున్నారు. అయినా సొంతింటిలో ఉన్న వర్గ పోరు రోజు రోజుకు రాజుకుంటుందే తప్ప చల్లారే పరిస్థితి కానరావడంలేదు. స్థానిక సంస్థల ఎన్నికలప్పటి నుంచి రాజుకున్న వర్గపోరు చాపకిందలా నీరులా సాగింది. రెడ్డి శాంతి కుమారుడు శ్రావణ్ హిరమండలం జెడ్పీటీసీ ఎన్నికల్లో పోటీ చేసి టీడీపీ అభ్యర్థి చేతిలో ఓటమి పాలయ్యారు. జగన్మోహన్ రెడ్డి, పార్టీ క్రేజ్ ఏవీ కూడా ఆ ఎన్నికల్లో పనిచేయలేదు. అప్పటి నుంచే పార్టీకి బీటలు వారినా ఎమ్మెల్యేగా రెడ్డి శాంతి చక్కదిద్దుకోకపోగా ఆ పార్టీ జిల్లా నాయకత్వం కూడా సరిదిద్దలేదు.
పార్టీ కేడర్ పై అక్రమ కేసులు బనాయిస్తున్నారని ఆరోపణ
స్థానిక సంస్థల ఎన్నికల్లో కొత్తూరు, పాతపట్నం, హిరమండలం, మెళియాపుట్టి మండలాల్లో ఆమె బీ ఫారం జారీ చేయడానికే పరిమితమయ్యారు తప్ప ఆమె నిర్ణయించిన మేరకు కొందరిని ఎంపీపీ, వైఎస్ ఎంపీపీలు కూడ పీఠంపై కూర్చోబెట్టలేని పరిస్థితి ఏర్పడింది. అనంతరం కూడ ఆ సెగ్మెంటులో పోటాపోటీగా అధికార పార్టీలో నెలకుంటున్న కుమ్ములాటలకు చెక్ పడలేదు. ఓ వైపు నాన్ లోకల్ అంటు రెడ్డి శాంతిపై ముద్రపడగా, మరో వైపు తాజాగా సొంత పార్టీ శ్రేణులపై కేసులు పెడుతున్నారంటు ఏకంగా కొత్తూరు మండలంలో పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించడం వైసీపీలో పెద్ద దుమారం రేపుతుంది. అధికార పార్టీకి చెందిన వ్యక్తి సోషల్ మీడియాలో చేసిన పోస్టుపై ఎమ్మెల్యే అనుచర వర్గం కొత్తూరు పోలీసు స్టేషన్లో ఇటీవల కేసు పెట్టారు. ఇది పెద్ద దుమారం రేపింది. ఇప్పటి వరకు ఎమ్మెల్యే రెడ్డి శాంతిపై వ్యతిరేకంగా పనిచేస్తున్న వర్గం నేరుగా రోడ్డెక్కి తాడోపేడో తేల్చుకునేందుకు సిద్ధమైంది. బుధవారం కొత్తూరు మండలకేంద్రంలో ఎమ్మెల్యే రెడ్డి శాంతికి వ్యతిరేకంగా అక్కడ వైస్ ఎంపీపీ లోతుగెడ్డ తులసీప్రసాద్ పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించారు. జగన్ ముద్దు, రెడ్డి శాంతి వద్దు అంటు ఈ వివాదం వైసీపీలోనే కాకుండా జిల్లాలోనే సంచలనం రేకెత్తిస్తోంది.
పార్టీకి నష్టం కలిస్తాయని నేతల ఆందోళన
సొంతపార్టీలోని నేతలు, కార్యకర్తల మధ్య వర్గపోరు ముదిరి పార్టీ శ్రేణుల అసంతృప్తి సెగరాజుకుంది. నియోజకవర్గంలో ఎమ్మెల్యే తీరుపై అసంతృప్తితో ఉన్న ఎంపీపీ, ఎంపీటీసీలను, సర్పంచ్లను, వార్డు మెంబర్లను, జడ్పీటీసీలను, పార్టీ సీనియర్ నాయకులను కొత్తూరు వైస్ ఎంపీపీ తులసీవరప్రసాద్ ఏకతాటిపైకి తీసుకు రావడంలో విజయం సాధించారు. ఇటీవలే కర్లేమ్మ గ్రామ పంచాయతీ నేతాజీ నగర్ కాలనీలో,ఎమ్మెల్యే రెడ్డి శాంతి గడపగడపకూ మన ప్రభుత్వం కార్యక్రమంలో పర్యటించగా స్థానిక నేతలు రాలేదు. కొత్తూరు, పాతపట్నం, మెళియాపుట్టి, హిరమండలం, ఎల్ఎన్ పేట మండలాల నుంచి ఆమెకు వ్యతిరేకంగా ఓ వర్గం నినాదాలు చేస్తు కొత్తూరు వెళ్లి ర్యాలీలో పాల్గోనడం రెడ్డి శాంతి అనుచరులకు అసలు మింగుడపడడంలేదు. అదే పార్టీలో ఉంటు ఎమ్మెల్యేపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైన జిల్లా పార్టీ కనీసం స్పందించకపోవడంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఎన్నికలకు మరో ఏడాదే సమయం ఉండడంతో ఈ తరుణంలో ఈ గ్రూపుల గోల పార్టీకి తీవ్ర నష్టం వాటిల్లుతుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. సొంతపార్టీ నేతలపైనే అక్రమ కేసులు బనాయించడపై అసమ్మతి వర్గం మండిపడుతుంది. రెడ్డి శాంతి వ్యతిరేక వర్గానికి చెందిన వైసీపీ నాయకులు నల్లబ్యాడ్జీలతో ర్యాలీలో పాల్గొనడం అధికారపార్టీలో కలకలం నెలకొంది.