YSRCP MPs :   సాయం ఎలా ఎగ్గొట్టాలన్నది చంద్ర‌బాబు  సిద్ధాంతం అయితే, సాయం ఎలా ఇవ్వాలన్నదే జగన్ లక్ష్యం అని వైఎస్ఆర్‌సీపీ ఎంపీలు ప్రకటించారు. చేయగలిగిన దానికి మించి వరద ప్రాంతాల్లో సహాయ చర్యలు చేశామ‌ని, 48 గంటల్లోనే వరద బాధితులకు రూ. 2 వేలు తక్షణ సాయం అందించామని ఎంపీలు ఢిల్లీలో తెలిపారు.  పోలవరంలో చంద్రబాబు చేసిన తప్పులను జగన్  సరిదిద్దుతున్నారు, ఇక రాష్ట్రానికి చంద్రబాబు అవసరం లేనే లేదు అని వైఎస్ఆర్‌సీపీ ఎంపీలు  వ్యాఖ్యానించారు. 


నాయకుడంటే జగన్ లాగా ఉండాలనే విధంగా సీఎం పని చేశారు ! 


వరదల కారణంగా యావత్తు ప్రభుత్వ యంత్రాంగాన్ని ముందుగానే అప్రమత్తం చేసి, ఎటువంటి ప్రాణ నష్టం జరగకుండా ముంపు గ్రామాల ప్రజలను కాపాడారన్నారు. వరద తగ్గాక, ముంపు మండలాల్లో ముఖ్యమంత్రి గారు రెండు రోజులు పర్యటిస్తే.. ఏ ఒక్క బాధితుడు కూడా తమకు సహాయం అందలేదన్న మాట చెప్పలేదని ఎంపీలు గుర్తు చేశారు.  వరద వస్తుందని తెలియగానే, వరద చేరుకోకముందే.. ప్రతి కుటుంబాన్ని పునరావాస కేంద్రాలకు తరలించామని చెప్పారు. ప్రతి బాధిత కుటుంబానికి రూ. 2 వేలు తక్షణ సాయంతో పాటు, 25 కిలోల బియ్యం, పప్పులు, నూనెలు, కూరగాయలు అందించారన్నారు.  పరిపాలన అంటే ఇలా ఉండాలి, రాష్ట్రానికి నాయకుడు అంటే ఇలా ఉండాలి...  అనే విధంగా ఆపద సమయంలో ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డిగారు బాధితులకు అండగా నిలిచారన్నారు. 


48 గంటల్లోనే బాధితులందరికీ పరిహారం ఇచ్చిన సీఎం ! 


48 గంటల్లోనే సచివాలయ వ్యవస్థ- వాలంటీర్ల ద్వారా ప్రతి బాధిత కుటుంబానికి రూ. 2 వేలు తక్షణ సహాయం అందించారన్నారు.  సీఎం గారు గంట- గంటకు ముంపు ప్రాంతాల్లోని జిల్లా యంత్రాంగం, కలెక్టర్లతో మాట్లాడటం, జిల్లాకు ఇద్దరు మంత్రులను ఇన్ చార్జిలుగా పెట్టి, ప్రతి ఒక్కరికీ న్యాయం జరిగేలా చూశారన్నారు. స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత.. ఏ ముఖ్యమంత్రీ పర్యటించని రాష్ట్ర సరిహద్దుల్లోని మారుమూల గ్రామాల్లో సైతం  జగన్  పర్యటించి, ముంపు గ్రామాల ప్రజల బాధలను తెలుసుకుని, వారికి భరోసా కల్పించారన్నారు.  ఆపదలో ఉన్న ప్రజలను ఆదుకోవడంలో ప్రభుత్వ యంత్రాంగంతో పాటు.. పార్టీ కార్యకర్తలు, వాలంటీర్లు ముందున్నారన్నారు. అర్హులైన ప్రతి ఒక్క బాధితుడికి సహాయం అందుతుందన్నారు. సహాయం ఎవరికైనా మిస్ అయిందంటే.. బహుశా అది ఒక్క చంద్రబాబు నాయుడుకే అయి ఉండవచ్చు అని ఎద్దేవా చేశారు.  వరదలకు అమరావతిలో చంద్రబాబు ఉండే ఆయన భవనం కూడా నీట మునిగి ఉంటే.. ఆయనకు కూడా రూ. 2 వేలు నష్టపరిహారం ఇవ్వాలేమోన్నారు.  


చంద్రబాబు విధానాల వల్లే పోలవరం ఆలస్యం...!


జాతీయ ప్రాజెక్టు అయిన పోలవరానికి సంబంధించి, ప్రతి రూపాయి కేంద్రం నుంచే తెచ్చుకోవాల్సిన అవసరం ఉందని ఎంపీలు చెప్పారు.  ఆ విషయమే ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి   మాట్లాడితే.. చంద్రబాబు నిన్న, ఈరోజు పోలవరం ముంపు మండలాల్లో తిరుగుతూ, పోలవరం ప్రాజెక్టుపై చేతులెత్తేశారని దుష్ప్రచారం చేస్తున్నారని ఎంపీ కోటగిరి శ్రీధర్ మండిపడ్డారు.  రాజకీయాల్లో 40 ఏళ్ళు అనుభవం ఉందని చెప్పుకునే చంద్రబాబుకు ఈపాటి జ్ఞానం లేకపోవడం సిగ్గు చేటు అని విమర్శించారు. చంద్రబాబు పరిపాలనలో జరిగిన తప్పులను సరిదిద్దుతూ,  ప్రాజెక్టును త్వరితగతిన పూర్తి చేసేందుకు జగన్ మోహన్ రెడ్డి గారు చిత్తశుద్ధితో కృషి చేస్తున్నారన్నారు.  ఇప్పటికే పోలవరం ప్రాజెక్టుపై రాష్ట్ర ప్రభుత్వం రూ. 2900 కోట్లు సొంతంగా ఖర్చు చేసిందని, దానిని రీయింబర్స్ చేయాలని కేంద్రాన్ని పదే పదే కోరుతున్నామన్నారు. చంద్రబాబు నాయుడు అనుసరించిన తప్పుడు విధానాల వల్లే   పోలవరం ప్రాజెక్టు ఆలస్యమైందన్నారు. 
జగన్ చూసి బాబు నేర్చుకోవాలని సలహా ఇచ్చారు. 


జగన్‌ను చూసి చంద్రబాబు నేర్చుకోవాలన్న ఎంపీలు 


చంద్రబాబు నాయుడు ఇంకా బుద్ధి తెచ్చుకోకుండా  ఇలానే విమర్శలు చేస్తే.. వచ్చే ఎన్నికల్లో జగన్ మోహన్ రెడ్డిగారు చెప్పినట్టు 175 స్థానాలకు 175 సీట్లు సాధిస్తాం అని ఎంపీలు చెప్పారు. ఇప్పటికైనా చంద్రబాబు తన 40 ఏళ్ళ అనుభవాన్ని పక్కనపెట్టి, నిజమైన పరిపాలన అంటే ఎలా ఉండాలో..  జగన్ గారిని చూసి నేర్చుకోవాలి అని హితవు పలికారు. గత ఎన్నికల్లో టీడీపీ చెత్త పాలన, విధానాల వల్ల, ఇచ్చిన వాగ్దానాలను తుంగలో తొక్కడం వల్ల మాకు 151 సీట్లు వస్తే.. ఈసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం, ముఖ్యమంత్రి జగన్ గారి పరిపాలన చూసి అభిమానంతో, ఆనందంతో ప్రజలు మాకు 170కు పైగా స్థానాల్లో గెలిపిస్తారన్న నమ్మకం, ధీమా ఉందన్నారు.   2024లోనే కాదు, 2029, 2034లో కూడా జగన్ గారే ముఖ్యమంత్రి అవుతారని గుండె మీద చేయి వేసుకుని మరీ దమ్మూ, ధైర్యంతో చెబుతున్నామన్నారు. ఇక అమరావతికి గానీ, ఆంధ్రప్రదేశ్ కుగానీ చంద్రబాబు అవసరం లేనే లేదన్నారు.