ఏపీలో పొలిటికల్ హీట్ కొనసాగుతుంది. టీడీపీ కార్యాలయాలపై దాడి ఘటన అనంతరం వైఎస్ఆర్సీపీ, టీడీపీ కేంద్ర పెద్దలను కలిసి పోటాపోటీగా ఫిర్యాదు చేసుకుంటున్నారు. ఇటీవల టీడీపీ అధినేత చంద్రబాబు రాష్ట్రపతిని కలిసి ఏపీలో పరిస్థితులపై ఫిర్యాదు చేశారు. ఇప్పుడు వైసీపీ కూడా అదే దారిలో హస్తిన బాటపట్టింది. టీడీపీ గుర్తింపు రద్దు చేయాలని వైఎస్ఆర్సీపీ డిమాండ్ చేసింది. గురువారం ఎంపీ విజయసాయి రెడ్డి ఆధ్వర్యంలో వైసీపీ ఎంపీలు కేంద్ర ఎన్నికల సంఘాన్ని కలిశారు. టీడీపీ గుర్తింపు రద్దుచేయాలని ఈసీని కోరారు. టీడీపీ నేత పట్టాభిరామ్ సీఎం జగన్ పై చేసిన అనుచిత వ్యాఖ్యలతో ఏపీలో రాజకీయ పరిమాణాలు వేగంగా మారాయి. టీడీపీ కార్యాలయాలపై వైసీపీ శ్రేణులు దాడి చేశారు. ఇందుకు నిరసనగా టీడీపీ అధినేత చంద్రబాబు 36 గంటల పాటు నిరసన దీక్ష చేశారు. అనంతరం దిల్లీ వెళ్లి రాష్ట్రపతికి ఫిర్యాదు చేశారు. ఏపీలో రాష్ట్రపతి పాలన విధించాలని కోరారు.
Also Read: జగన్‌తో భేటీకి తాడేపల్లికి వచ్చిన నాగార్జున ! టాలీవుడ్ కోసం కాదు.. వ్యక్తిగతమే ?
అమిత్ షాకు ఫిర్యాదు
టీడీపీ నేతలు సీఎం జగన్, అధికార పార్టీ నేతలపై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారని వైసీపీ ఎంపీలు సీఈసీకి ఫిర్యాదు చేశారు. సీఎం, మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు.. ప్రజాప్రతినిధులందరినీ టీడీపీ నేతలు దూషిస్తున్నారని ఆరోపించారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు దిగజారడానికి టీడీపీ అధినేత చంద్రబాబు కారణమని వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి విమర్శించారు. సీఈసీని కలిసిన వైసీపీ ఎంపీలలో విజయసాయి రెడ్డి, మార్గాని భరత్, ఎన్. రెడ్డప్ప, డా.సత్యవతి, తలారి రంగయ్య, డా.సంజీవ్, మాధవి, గోరంట్ల మాధవ్ ఉన్నారు. వైఎస్ఆర్సీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ కేంద్ర హోంమంత్రి అమిత్‌షాను గురువారం కలిశారు. వైసీపీ ప్రభుత్వం, సీఎం జగన్ మోహన్ రెడ్డిపై టీడీపీ చేసిన అనుచిత వ్యాఖ్యలను అమిత్ షా దృష్టికి తీసుకెళ్లారు. అసభ్యంగా మాట్లాడిన వారిని శిక్షించేలా చట్టాలను కఠినతరం చేయాలని కేంద్ర మంత్రి అమిత్ షాకు ఎంపీ గోరంట్ల కోరారు.
Also Read: జూన్ నుంచి అమ్మఒడి.. అదానీకి విశాఖలో 130 ఎకరాలు.. ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు !
డ్రగ్స్ వ్యవహారంపై మాటల యుద్ధం
రాష్ట్రంలో డ్రగ్స్ దందా పెరుగుతోందని ప్రతిపక్ష నేతలు వైసీపీ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేస్తున్నారు. దీంతో వైసీపీ నేతలు కూడా అంతే స్థాయిలో టీడీపీపై విమర్శలు చేశారు. విశాఖ మన్యంలో గంజాయికి సంబంధించి టీడీపీ నేతలు నక్కా ఆనందబాబు, పట్టాభి చేసిన వ్యాఖ్యలను వైసీపీ ప్రభుత్వం సీరియస్ గా తీసుకుంది. ఇందులో భాగంగా నక్కా ఆనందబాబుకు పోలీసులు నోటీసులు జారీ చేశారు. దీంతో పట్టాభి వైసీపీపై విరుచుకు పడ్డారు.
Also Read: పోలీసులు పట్టాభిని కొట్టారన్న రఘురామ .. ఆధారాలడిగితే ఇస్తానన్న ఎంపీ !