Ysrcp Mp Mithun Reddy House Arrest: తిరుపతిలో వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డిని (MP MithunReddy) పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. ఆదివారం తెల్లవారుజాము నుంచే ఎంపీ నివాసానికి చేరుకున్న పోలీసులు భారీగా మోహరించారు. ఏఎస్పీ కులశేఖర్, ఈస్ట్ సీఐ మహేశ్వర్ రెడ్డి నోటీసులు ఇచ్చారు. ఆదివారం పుంగనూరులో కార్యకర్తలతో సమావేశం అయ్యేందుకు మిథున్ రెడ్డి సిద్ధమయ్యారు. అయితే, గొడవలు జరిగే అవకాశం ఉందన్న ముందస్తు సమాచారంతో ఆయన్ను గృహ నిర్బంధం చేశారు. వారం రోజుల క్రితం పెద్దిరెడ్డిని పుంగనూరు వెళ్లకుండా టీడీపీ శ్రేణులు అడ్డుకున్నారు. తాజాగా, ఛైర్మన్‌తో పాటు 13 మంది కౌన్సిలర్లు వైసీపీకి రాజీనామా చేసి టీడీపీలో చేరారు. ఈ క్రమంలో కార్యకర్తలతో సమావేశం నిర్వహించాలని ఎంపీ భావించారు. అందుకు సిద్ధమవుతుండగా పోలీసులు అడ్డుకున్నారు. విషయం తెలుసుకున్న వైసీపీ శ్రేణులు, అభిమానులు భారీగా ఆయన నివాసం వద్దకు చేరుకున్నారు. ఎంపీ ఇంట్లోకి వెళ్లేందుకు కొత్త వారిని కూడా అనుమతించడం లేదని వాపోతున్నారు. పోలీసుల తీరుపై వైసీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని ప్రభుత్వంపై మండిపడుతున్నారు.
లోక్ సభ స్పీకర్‌కు ఫిర్యాదు చేస్తా
అయితే, పోలీసుల తీరుపై ఎంపీ మిథున్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తనను హౌస్ అరెస్ట్ చేయడంపై మండిపడ్డారు. ప్రజలను కూడా తనను కలవనీయడం లేదని అన్నారు. రాష్ట్రంలో ఎన్నికల ఫలితాల తర్వాత తమ పార్టీ కార్యకర్తలను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారని.. వారి ఆస్తులు ధ్వంసం చేస్తున్నారని ధ్వజమెత్తారు. ఎంపీగా మా కార్యకర్తలను పరామర్శించేందుకు నాకు అర్హత ఉన్నా.. అడ్డుకుంటున్నారని తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. 'పోలీసులు నన్ను ఎవరినీ కలవకుండా అడ్డుకుంటున్నారు. దీనిపై లోక్ సభ స్పీకర్‌కు ఫిర్యాదు చేస్తా. ఎన్నికల్లో 40 శాతం మంది వైసీపీకి ఓటు వేశారు. వారందరిపైనా దాడులు చేస్తారా.?. అధికారం ఎవరికీ శాశ్వతం కాదు. ప్రతి కార్యకర్తకు మేము అండగా ఉంటాం. నేను నా కార్యకర్తలను కలిసేందుకు వీలు లేదని.. హౌస్ అరెస్ట్ చేస్తున్నామని పోలీసులు నాకు నోటీసులు ఇచ్చారు. ప్రభుత్వం పోలీస్ అధికారులపై ఒత్తిడి తెచ్చి ఇలా చేయిస్తోంది.' అని ఆరోపించారు.
పుంగనూరులో టీడీపీ ఆందోళన
అటు, పుంగనూరు అంబేడ్కర్ సర్కిల్‌లో టీడీపీ నేతలు ధర్నాకు దిగారు. ఎంపీ మిథున్ రెడ్డి పర్యటనకు నిరసనగా రోడ్డుపై బైఠాయించి ఆందోళన చేశారు. ఐదేళ్లు పుంగనూరులో పర్యటిస్తే ఉపేక్షించేది లేదని టీడీపీ నేతలు అన్నారు. గోబ్యాక్ పెద్దిరెడ్డి, గోబ్యాక్ మిథున్ రెడ్డి అంటూ నినాదాలు చేశారు. చివరకు రంగంలోకి దిగిన పోలీసులు వారికి సద్ది చెప్పారు. ఈ పరిణామాల క్రమంలో పోలీసులు పుంగనూరులో భారీగా పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. అటు, పెద్దిరెడ్డి ఇంటికి వెళ్లే మార్గంలో బారికేడ్లు పెట్టిన పోలీసులు ఎవరినీ అనుమతించడం లేదు.