Telugu News: భారత క్రికెట్ జట్టు టీ20 వరల్డ్ కప్ గెలవడం పట్ల ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సంతోషం వ్యక్తం చేశారు. 17 ఏళ్ల తర్వాత ఈ కప్పును కైవసం చేసుకున్నామని గుర్తు చేస్తూ జట్టు అందరికీ అభినందనలు తెలిపారు. ‘‘17 ఏళ్ల తర్వాత ప్రతిష్టాత్మకమైన T20 ప్రపంచకప్‌ను గెలుచుకోవాలనే కలను సాధించిన రోహిత్ శర్మ, మొత్తం జట్టు, సహాయక సిబ్బందికి నా హృదయపూర్వక అభినందనలు. మన దేశాన్ని ఆనందం, వేడుకల్లో ముంచెత్తినందుకు ధన్యవాదాలు’’ అని సీఎం చంద్రబాబు నాయుడు సోషల్ మీడియాలో స్పందించారు.






తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భారత క్రికెట్ జట్టుకు అభినందనలు తెలిపారు. ఐసీసీ టీ -20 వరల్డ్ కప్‌ టైటిల్ గెల్చుకున్నందుకు గర్వంగా ఉందని అన్నారు. ఫైనల్ మ్యాచ్‌లో దక్షిణాఫ్రికాపై అద్భుత విజయం సాధించిన భారత క్రికెట్ జట్టును ముఖ్యమంత్రి అభినందించారు. ఐసీసీ టీ-20 ప్రపంచకప్‌ను కైవసం చేసుకోవడం ద్వారా టీమ్‌ఇండియా దేశానికి కీర్తిప్రతిష్టలు తెచ్చిపెట్టిందని, క్రికెట్‌ ప్రపంచంలో మళ్లీ భారత్‌కు ఎదురులేదని నిరూపించడం గర్వకారణమని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు.






విశ్వ విజేతలకు అభినందనలు
‘‘రెండవ సారి టీ20 ప్రపంచకప్ గెలుచుకుని విశ్వ విజేతగా నిలిచిన భారత జట్టుకు అభినందనలు. 140 కోట్ల భారతీయుల ఆకాంక్షలను నిలబెడుతూ రోహిత్ సేన సాధించిన విజయం చరిత్రలో నిలచిపోతుంది. దక్షిణాఫ్రికాతో జరిగిన తుది పోరులో జట్టు మొత్తం సమష్టిగా రాణించిన తీరు అద్భుతం. ఆధ్యంతం ఉత్కంఠ భరితంగా సాగిన మ్యాచ్ లో ఒత్తిడిని జయంచి సగర్వంగా ప్రపంచకప్ సాధించి పెట్టిన భారత క్రికెటర్లకు పేరు పేరునా హృదయ పూర్వక శుభాకాంక్షలు. మీ విజయం భవిష్యత్ తరాలకు స్ఫూర్తి దాయకం. ఇదే స్ఫూర్తిని కొనసాగిస్తూ క్రికెట్ లో భారత్ మరిన్ని విజయాలు అందుకోవాలని ఆకాంక్షిస్తున్నాను’’ అని ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ స్పందించారు.






‘‘భారత్‌కు ఎంత అద్భుతమైన విజయం! రోహిత్ శర్మ, అతని జట్టు 13 సంవత్సరాల తర్వాత ICC ప్రపంచ కప్ ట్రోఫీని గెలుచుకుని చరిత్ర సృష్టించారు. నా వరకు సూర్య కుమార్ చివరి ఓవర్‌లో తీవ్రమైన ఒత్తిడిలో తన అద్భుతమైన క్యాచ్‌తో మన మ్యాచ్‌ని గెలిపించాడు. దేశం మిమ్మల్ని చూసి గర్విస్తోంది!’’ అని నారా లోకేశ్ ఎక్స్ లో పోస్ట్ చేశారు.






వైయస్.జగన్మోహన్‌రెడ్డి అభినందనలు


టీ-20 వరల్డ్‌ కప్‌ గెలుచుకున్న భారత క్రికెట్‌ జట్టుకు మాజీ ముఖ్యమంత్రి, వైయస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైయస్‌.జగన్మోహన్‌రెడ్డి అభినందనలు తెలిపారు. టోర్నీ ఆద్యంతం సమిష్టి కృష్టితో భారత జట్టు విజయాలు సాధించిందన్నారు. కృషి, పట్టుదలతో మరో గొప్పగెలుపు సొంతం చేసుకున్నారని ప్రశంసించారు. వన్డే వరల్డ్‌ కప్‌ ఫైనల్‌లో ఇండియా టీం ఓటమితో తీవ్ర నిరాశకు గురైన అభిమానులకు ఈ విజయం గొప్ప ఊరటినిస్తుందన్నారు. భారతజట్టు కెప్టెన్‌గా ఉన్న రోహిత్‌ శర్మ తెలుగువాడు కావడం గర్వకారణమని అన్నారు. జట్టును విజయవంతంగా నడిపించడంలో రోహిత్‌ చక్కటి నాయకత్వాన్ని ప్రదర్శించాడని కొనియాడారు. రానున్న రోజుల్లో టీం ఇండియా మరిన్ని ఛాంపియన్‌షిప్‌లు సాధిస్తుందని ఆకాంక్షించారు.