అనంతపురం జిల్లా హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్‌కు విషాద అనుభవం ఎదురైంది. నిన్న ఏఎస్ఐ కుమారుడి వివాహానికి హాజరై ఆశీర్వదించారు.. నేడు అదే ఏఎస్ఐకి శ్రద్ధాంజలి ఘటించాల్సి వచ్చింది. విధి ఆడిన వింత నాటకంలో ఆయన పావుగా మారారు. సార్ వచ్చినాడు.. మీ నాన్న ఎక్కడున్నా వస్తాడు ఫోన్ చేయరా అంటూ ఏఎస్ఐ భార్య రోధించడం చూపరులను కంటతడి పెట్టించింది. ఆ ఘటన వివరాలిలా ఉన్నాయి..
అనంతపురం జిల్లా కొర్రపాడుకు చెందిన వెంకటస్వామి(56) జిల్లాలోని పామిడి పోలీస్ స్టేషన్‌లో ఏఎస్సై గా విధులు నిర్వహిస్తున్నారు. గతంలో అనంతపురం వన్ టౌన్‌లో వెంకటస్వామి హెడ్ కానిస్టేబుల్ గా పనిచేస్తున్నప్పుడు సీఐగా గోరంట్ల మాధవ్ ఉన్నారు. విధులను ఏమాత్రం నిర్లక్ష్యం చేయకుండా తన పనులు సక్రమంగా నిర్వర్తించే వెంకటస్వామి అంటే గోరంట్ల మాధవ్‌కు ఎంతో గౌరవం, అభిమానం ఉండేవి. గోరంట్లకు సైతం సౌమ్యుడిగా జిల్లాలో మంచి పేరుంది.
Also Read: పెళ్లింట వరుస విషాదాలు.. తల్లి చనిపోయిందని తెలియగానే ఏఎస్సై హఠాన్మరణం
కొన్నేళ్ల తరువాత.. ప్రస్తుతం వెంకటస్వామి పోలీస్ స్టేషన్‌లో ఏఎస్సై కాగా, గోరంట్ల మాధవ్ హిందూపురం ఎంపీ అయ్యారు. వెంకటస్వామికి భార్య, ఇద్దరు కుమార్తెలు, ఓ కుమారుడు ఉన్నారు. కుమార్తెలకు పెళ్లిళ్లు చేశారు. శనివారం కుమారుడు గోవర్ధన్ వివాహం ఘనంగా నిర్వహించారు. ఏఎస్సై వెంకటస్వామి ఆహ్వానం మేరకు గోవర్దన్ వివాహానికి ఎంపీ గోరంట్ల మాధవ్ హాజరయ్యారు. నూతన వధూవరులను ఆశీర్వదించారు. వెంకటస్వామితో కాసేపు మాట్లాడిన గోరంట్ల.. పెనుగొండ ఎన్నికల ప్రచారంలో పాల్గొనడానికి బయలుదేరి వెళ్లిపోయారు.
Also Read: ఏపీలో మరికొద్ది రోజులు వానలు పడే ఛాన్స్.. 9న మరో అల్పపీడనం, తెలంగాణలో ఇలా..
పిడుగులాంటి వార్త..
ఎన్నికల ప్రచారానికి వెళ్లిన ఎంపీ గోరంట్ల మాధవ్‌కు కొసేపటికే పిడుగులాంటి వార్త చెవినపడింది. కొద్దిసేపటి కిందట తాను కలిసిన ఏఎస్సై వెంకటస్వామి చనిపోయాడని తెలిసి దిగ్భ్రాంతికి తోనయ్యారు. నిన్న ఆయన కుమారుడి వివాహానికి హాజరైన ఎంపీ గోర్లంట్ల.. నేడు ఆ ఏఎస్సై వెంకటస్వామికి శ్రద్ధాంజలి ఘటించడానికి వెళ్లారు. ఇది నిజంగా చాలా బాధాకరమని విలేకరులతో అన్నారు. ఎంపీ గోరంట్లను చూసిన వెంకటస్వామి భార్య కన్నీటి పర్యంతమయ్యారు. ‘సార్ వచ్చినాడు.. మీ నాన్న (వెంకటస్వామి) ఎక్కడున్నా వస్తాడు. ఫోన్ చేయరా అంటూ కుమారుడు గోవర్థన్‌ను చూస్తూ వెంకట స్వామి భార్య రోధించడం అక్కడున్న వారిని సైతం కంటతడి పెట్టించింది.
Also Read: పసిడి ప్రియులకు షాక్! భారీగా పెరిగిన పసిడి ధర.. ఏకంగా 400, స్వల్పంగా వెండి.. తాజా ధరలు
విధి ఆడిన వింత నాటకం..
శనివారం వెంకటస్వామి కుమారుడు గోవర్ధన్ వివాహం ఘనంగా నిర్వహించారు. కానీ గత మూడు రోజులుగా అనంతపురం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న తన తల్లి చనిపోయిందని తెలియగానే ఏఎస్సై వెంకటస్వామి కుప్పకూలిపోయారు. ఆసుపత్రికి తీసుకెళ్లినా ప్రయోజనం లేకపోయింది. ఆయన చనిపోయాడని వైద్యులు నిర్ధారించడంతో ఆ కుటుంబంలో రెండు విషాదాలు చోటుచేసుకున్నాయి.