YSRCP MLA Prakash Reddy sensational comments against Chandrababu: రాప్తాడు: టీడీపీ అధినేత చంద్రబాబు పెనుగొండ నియోజకవర్గంలో 20వేల మందితో సభ ఏర్పాటు చేసి సిద్ధం సభకు పోటీ అనుకుంటే పులిని చూసి నక్క వాత పెట్టుకున్నట్టు ఉంటుంది అంటూ సెటైర్లు వేశారు. రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ సీట్లు కేటాయింపులో ఓపెన్ యాక్షన్ పెట్టిందని.. అభ్యర్థులు ప్రకటించే సమయానికి నీ ఖజానా నిండాలి... ఆ తర్వాత బిచానా ఏత్తేయాలని చంద్రబాబు వ్యూహం రచించారని ఎద్దేవా చేశారు. 2014 ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అధికారంలోకి రాగానే అమలు చేయకుండా తుంగలో తొక్కినందుకు చంద్రబాబు ముందుగా ప్రజలకు క్షమాపణలు చెప్పాలని, ఆ తర్వాతే రాష్ట్ర ప్రజలను ఓట్లు అడగాలన్నారు.
మహిళా పాడి రైతులకు డాక్యుమెంట్లు అందజేత
రాప్తాడు నియోజకవర్గంలో బుధవారం నుంచి ఎన్నికల ప్రచారం ప్రారంభిస్తున్నట్లు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి ప్రకటించారు. అనంతపురం రూరల్ మండలం తాటిచెర్ల నుంచి ప్రచారం ప్రారంభవుతుందన్నారు. మార్చి 8న మంత్రులు రోజా, ఉషశ్రీ చరణ్ హాజరవుతారన్నారు. తోపుదుర్తి మహిళా సహకార డెయిరీ ఫెడరేషన్‌కు 20 కోట్ల రూపాయలతో నిర్మించిన డెయిరికీ సంబంధించిన గిఫ్ట్‌డీడ్ డాక్యుమెంట్లను మహిళా పాడి రైతులకు అందజేస్తామని, డెయిరీ నిర్వహణ బాధ్యతలు కూడా పాడి రైతులకు అప్పగిస్తామని ఎమ్మెల్యే వెల్లడించారు. తెలుగుదేశం పార్టీ ప్రకటించిన అభ్యర్థులకు పార్టీ శ్రేణులు సహకరించడం లేదు. పెనుకొండలో నిర్వహించిన రా కదిలిరా సభకు వచ్చిన ఆ పార్టీ కార్యకర్తలను చూస్తే అర్థమవుతోందన్నారు.
ఏపీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని, వైసిపి ఎమ్మెల్యేలను తిట్టేందుకే చంద్రబాబు వచ్చినట్లు అర్థమైందని, వయసు పెరిగింది కానీ బుద్ది పెరగలేదనేది ఆయన మాటలను చూస్తే అర్థమవుతోందని ఘాటు వ్యాఖ్యలు చేశారు. పార్టీ అధినేత వస్తుంటే కార్యకర్తలను తీసుకొద్దామనే ఆలోచనలు కూడా వారి అభ్యర్థులు చేయలేని గందరగోళంలో ఉన్నారు. జిల్లాలో తెలుగుదేశం పార్టిని నిలబెట్టిన బికె పార్థసారథి, గాదె లింగప్ప లాంటి వాళ్లను ముందు పెట్టుకుని పెత్తనం మీరు చేశారన్నారు.
రాప్తాడులో సభ అని పెనుకొండకు మార్చారు..
‘రాప్తాడులో సిద్ధం సభకు దీటుగా సభ పెడతామని చెప్పి సాధ్యం కాదని భావించి పెనుకొండకు మార్చుకున్నారు. 20వేల మందితో సభ ఏర్పాటు చేసి సిద్ధం సభకు పోటీ అనుకుంటే పులిని చూసి నక్క వాత పెట్టుకున్నట్టు ఉంటుంది చంద్రబాబు. నీ డాన్సులు నీ రొమాన్స్ లు జూమ్ కాల్స్ లో చేసుకో జనంలోకి వస్తే జగనే ఈ రాష్ట్రానికి ఏకైక నాయకుడు. ఏకైక క్రౌడ్ పుల్లర్. మీకు పార్టీ బలమూ లేదు. మరి ఏ మోహం పెట్టుకుని మాట్లాడుతున్నారు. సీట్లు కేటాయింపులో ఓపెన్ యాక్షన్ పెట్టిన చంద్రబాబు. ఇందుకోసం ప్రత్యేకంగా ఒక సెర్చ్ కమిటీని పెట్టుకున్నారు. ఎవరు ఎక్కువ డబ్బులు ఇస్తారని ఈ సర్చ్ కమిటి పరిశీలిస్తోంది. అభ్యర్థులు ప్రకటించే సమయానికి నీ ఖజానా నిండాలి... ఆతర్వాత బిచానా ఏత్తేయాలని వ్యూహం రచించారు. పోయిన ఎన్నికల్లో ప్రచారంలో వారి అభ్యర్థులకు చంద్రబాబు అందుబాటులో లేకుండాపోయాడు. ఈసారి ఇంకా ముందుగా అభ్యర్థులను ప్రకటించగానే బిచానా ఎత్తేసేందుకు సిద్ధంగా ఉన్నాడు. అలాంటి చంద్రబాబూ మా గురించి మాట్లాడడం విడ్డూరంగా ఉందని’ ఎమ్మెల్యే ప్రకాష్ రెడ్డి ఎద్దేవా చేశారు.
దమ్ముంటే ఛాలెంజ్ స్వీకరించండి
మీకు రోషం, మీ పార్టీ నాయకులకు దమ్ముంటే తాను విసిరిన ఛాలెంజ్‌కు కట్టుబడి ఉండాలన్నారు. చంద్రబాబు మాట్లాడిన ప్రతిసారి ఛాలెంజ్ చేస్తున్నా. ఎవరూ ముందుకు రాలేదని... అయినా మళ్లీ నాపై అవే ఆరోపణలపై మాట్లాడుతున్నావు. నీకు ఏమోగాని నాకైతే సిగ్గుగా ఉందన్నారు. కేవలం తప్పుడు కూతలు కూసుకుంటూ పోతున్నారు. వైఎస్‌ఆర్ నాయకులపై బురదజల్లడమే పనిగా పెట్టుకున్నారని.. ఎన్నికల్లో ప్రజలను మభ్య పెట్టేందకే తప్పుడు ఆరోపణలు చేస్తున్నారంటూ మండిపడ్డారు. నిజంగా మీవద్ద ఆధారాలుంటే సీబీఐ విచారణ కోరండి.. పెనుకొండ మీటింగ్‌కు హెలిక్యాప్టర్ నుంచి చూసినప్పుడు జనాలు లేక ఖాళీ కుర్చీలు కనిపించేసరికి అసహనానికి గురై తీవ్ర అక్కసుతో మాపై ఆరోపణలు చేశారని విమర్శించారు.
‘మీ ప్రభుత్వంలో ఇసుక, మట్టిని అక్రమంగా అమ్ముకున్నారని.. నసనకోట ప్రాంతంలో అక్రమ గ్రానైట్ తవ్వకాలు చేసి కోట్లాది రూపాయలు సంపాదించారని ఆరోపించారు. పెన్నానది, చిత్రావతి నదులు ఖాళీ చేశారు. మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇబ్బందులు పెడుతుండడంతో కియా పరిశ్రమ వెళ్లిపోతోందని మీరు దుష్ప్రచారం చేశారు. వాస్తవానికి ప్రధాని నరేంద్రమోది కోరిక మేరకే ఈ పరిశ్రమ ఇక్కడకు వచ్చింది. 2019 తర్వాత కూడా ఆ కంపెనీ దాదాపు 4500 కోట్లు ఇక్కడ పెట్టుబడులు పెట్టింది. మీరు దుష్ప్రచారం చేసిన తర్వాత కంపెనీ అంత పెట్టుబడి ఎలా పెట్టింది. బట్ట కాల్చి మింద వేయడం తప్ప మీవద్ద సమాధానాలు లేవు. జాకీ సంస్థ వెళ్లిపోయిందని చంద్రబాబు అన్నారు. నువ్వు ఉన్నప్పుడు జాకీ సంస్థ కనీసం కాంపౌండ్ గోడ కూడా పూర్తి చేయలేదు. వంద కోట్లు విలువ చేసే భూములు కేవలం మూడు కోట్లుకు ఇచ్చినా ఆ సంస్థ రాలేదంటే మీరు వేసిన ప్లాన్స్ చూసి భయపడి రాలేదని’ వైసీపీ ఎమ్మెల్యే ప్రకాష్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు.