congress may announce candidates list on March 7 says CM Revanth Reddy: హైదరాబాద్: ఇదివరకే స్క్రీనింగ్ కమిటీకి లిస్టు పంపామని, మార్చి 7న కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ అభ్యర్థులను ప్రకటిస్తామన్నారు సీఎం రేవంత్ రెడ్డి (Revanth Reddy). కొందరు ఉద్దేశపూర్వకంగా కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోతుందని దుష్ప్రచారం చేస్తున్నారని.. తన 3 నెలల పాలనే, లోక్‌సభ ఎన్నికల (Loksabha Elections 2024)కు రెఫరెండం అని రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. మీడియాతో ఇష్టాగోష్టిగా మాట్లాడిన రేవంత్ రెడ్డి.. తాను కుటుంబ రాజకీయాలను ప్రోత్సహించనని చెప్పారు. లోక్‌సభ ఎన్నికల్లో తన కుటుంబసభ్యులు పోటీ చేయడం లేదని స్పష్టం చేశారు. తెలంగాణలో ప్రతిపక్షనేత లేనే లేడని, అందుకే అసెంబ్లీకి రావడం లేదన్నారు సీఎం రేవంత్ రెడ్డి.


ప్రధాని మోదీని పెద్దన్న అనడంపై బీఆర్ఎస్ అనవసరంగా రాద్ధాంతం చేస్తుందన్నారు. రాష్ట్రానికి కావాల్సిన విషయాలను తాను అందరి ముందు మైక్ లోనే చెప్పానని, కేసీఆర్ లాగ చెవిలో చెప్పడం తనకు అలవాటు లేదంటూ సెటైర్లు వేశారు. గత 10 ఏళ్లలో కేసీఆర్ కుటుంబం, బీఆర్ఎస్ ప్రభుత్వం రాష్ట్రాన్ని 100 ఏళ్ల విధ్వంసం చేశారని ఆరోపించారు. కాళేశ్వరరావు కట్టిన మేడిగడ్డ మేడిపండు అయింది.
ఆయన సీఎంగా ఉన్నప్పుడే మొత్తం డ్యామేజీ జరిగిందన్నారు. తెలంగాణ ప్రభుత్వమే రిపేర్ చేయాలని ఎన్ఎస్‌డీఏ నివేదిక ఇస్తే తప్పకుండా మేడిగడ్డ బ్యారేజీని రిపేర్ చేస్తామని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. తెలంగాణలో బీజేపీ అనే పార్టీనే లేదని, అలాంటప్పుడు ఆ పార్టీపై కామెంట్లు అనవసరమని అభిప్రాయపడ్డారు. జీఎస్టీ వసూళ్లలో కుంభకోణం జరిగిందని, దొంగల్ని త్వరలోనే బయటకు తీస్తామన్నారు.


బీఆర్ఎస్, బీజేపీ మంచి అవగాహనతో అభ్యర్థులను ప్రకటించాయన్నారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మెదక్, చేవెళ్ల అభ్యర్థులను ఎందుకు ప్రకటించడం లేదని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. అధికారిక కార్యక్రమాల్లో పాల్గొన్నానని, ప్రధాని మోదీని పెద్దన్నగా పేర్కొన్న రేవంత్.. ఇందులో ఏ తప్పులేదన్నారు. తమ పాలన చూసి లోక్‌సభ ఎన్నికల్లో ప్రజలు కాంగ్రెస్ కు ఓట్లు వేస్తారని, బీజేపీకి ఒక్క సీటు కూడా రాదని జోస్యం చెప్పారు. బీజేపీ 9, బీఆర్ఎస్ 5 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించగా.. కాంగ్రెస్ మాత్రం అభ్యర్థులపై కసరత్తు చేస్తోంది. అయితే మహబూబ్ నగర్ నుంచి వంశీ చంద్ రెడ్డి పోటీ చేస్తారని ఓ సభలో రేవంత్ రెడ్డి చెప్పారు. కానీ పార్టీ ఏ అధికారిక ప్రకటన విడుదల చేయలేదు.