YSRCP leaders on Union Budget 2024 | అమరావతి: టీడీపీ కేంద్ర ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్నా ఆంధ్రప్రదేశ్‌కు ఏమీ తీసుకురాలేదు, కానీ డబ్బా కొట్టుకుంటోందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విమర్శలు గుప్పించింది. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్ 2024పై గతంలో చేసిన ప్రచారాలే చేసుకుని డబ్బా కొట్టుకున్నారు, తప్పా రాష్ట్ర ప్రజలకు ఏ న్యాయం జరగలేదని వైసీపీ నేతలు మండిపడుతున్నారు. ప్రత్యేక హోదాకు బదులు ప్రత్యేక ఆర్థిక సహాయానికి 2016 సెప్టెంబరులో అంగీకరించి చంద్రబాబు ఏపీ ప్రజలను దారుణంగా మోసంచేశారని, అర్థరాత్రి అద్భుత ప్రకటన అంటూ హడావిడి చేశారని వైసీపీ తాజాగా ట్వీట్ చేసింది.


ఏపీ ప్రత్యేక హోదా వస్తే రాష్ట్రం స్వర్గం అవుతుందా? అంటూ కామెంట్‌ చేసిన చంద్రబాబు.. స్పెషల్ స్టేటస్ అంశంపై నీళ్లు చల్లిన ఘనుడు అని సెటైర్లు వేశారు. ‘రాష్ట్రం కోసం సాధించుకోవాల్సిన హక్కుపై ఒక సీఎం హోదాలో ఉండి కూడా అవకాశాన్ని వదిలేసుకుకున్న వ్యక్తి చంద్రబాబు. స్పెషల్ ప్యాకేజీతో ఏపీ రూపురేఖలు సమూలంగా మారిపోతాయన్న భావనను కలిగించి మోసం చేశారు. కానీ చివరకు ఏమీ జరగలేదని ప్రజలు తెలుసుకున్నారు. నేడు సైతం కేంద్ర బడ్జెట్ ప్రకటనతో అలాంటి ప్రచారాలు చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. 


‘కేంద్ర ఆర్థిక మంత్రి తాజా బడ్జెట్ లో రూ.15 వేల కోట్లు వివిధ ఏజెన్సీల ద్వారా వచ్చే కొన్నేళ్లలో ఇస్తామన్నారు. రూ.15 వేల కోట్లు అప్పుగా ఇస్తున్నారా? లేక గ్రాంటుగా ఇస్తున్నారా? అది అప్పు అయితే దాంతో ఏపీకి ఏం లాభం ఉంటుంది. చంద్రబాబు చెప్పింది ఒకటి, కానీ జరుగుతున్నది మరొకటి, మరి రాజధాని అమరావతి ఎప్పటికి పూర్తవుతుంది. అంటే మరోసారి రాష్ట్ర ప్రజలను మోసం చేయడం కాదా?’ అని వైసీపీ ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేసింది.






‘ఏపీ విభజన చట్టంలో పేర్కొన్న అంశాలు, ఇచ్చిన హామీలు, ప్రధాని మోదీ పార్లమెంటులో ఇచ్చిన హామీలు ఒక హక్కు కింద రావాలి. కానీ ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తే వచ్చే ప్రయోజనాలు ఏ ప్యాకేజీతో తీరుతాయి? ఏ సర్దుబాట్లతో భర్తీ అవుతాయి?. పోలవరంకు సంబంధించి సవరించిన అంచనాలకు సంబంధించి రూ.55,656.87 కోట్ల ఆమోదం పెండింగ్‌లో ఉంది. నిధులు సాధించుకోలేకపోతే పోలవరం పూర్తి ఎలా సాధ్యం. పోలవరంలో తక్షణ పనులకోసం వైసీపీ ప్రభుత్వం గతంలో పదేపదే ఒత్తిడి తెస్తే రూ.12వేల కోట్లు ఇచ్చేందుకు కేంద్రం అంగీకరించినా..  నిధులు రాకుండా అడ్డుకున్న వ్యక్తి చంద్రబాబు. 


వెనుకబడ్డ జిల్లాలకు ఏడాది రూ.50 కోట్లు చొప్పున విభజన చట్టంలో ప్రతి ఏటా ఇస్తామని విభజన చట్టంలో హామీ ఇచ్చారు. నీతి ఆయోగ్‌ రూ.2,100 కోట్లు సిఫార్సు చేస్తే కేంద్రం 2014-15 నుంచి మూడేళ్లపాటు రూ.1,050 కోట్లు ఇచ్చి తరువాత నిధులు ఆపేసింది. ఇప్పుడు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఏపీకి రూ.15 వేల కోట్ల ప్రకటనతో అదనంగా వచ్చేది ఏముంది? రావాల్సిన పెండింగ్‌ డబ్బులు ఇస్తారా? లేదా అంతకంటే ఎక్కవ ఇస్తారా చెప్పడం లేదు. చంద్రబాబు గతంతో డిమాండ్‌ చేసినట్టుగా బుందేల్‌ఖండ్‌ కు ఇచ్చిన ప్యాకేజీ తరహాలో రూ.22వేల కోట్లు తెస్తారా?.


అమరావతి ఎన్నడు పూర్తవుతుంది..
రాజధాని అమరావతిలో కేవలం రోడ్లు, విద్యుత్‌, డ్రైనేజీ లాంటి కనీస మౌలిక సదుపాయాల ఏర్పాటుకు రూ.1లక్ష కోట్లు కావాలి. దీనిపై గతంలో చంద్రబాబు ప్రభుత్వమే కేంద్రానికి డీపీఆర్‌ సమర్పించింది. 2014-19 మధ్య కేవలం సుమారు రూ.5వేల కోట్లు ఖర్చు చేసింది. ఇప్పుడు రూ.15వేల కోట్లు వివిధ ఏజెన్సీల ద్వారా వచ్చే కొన్నేళ్లలో ఇప్పిస్తామని నిర్మలా సీతారామన్ ప్రకటించారు. ఇది అప్పుగా ఇస్తే దాంతో ఏపీకి ఏం లాభం? సీఎం చంద్రబాబు చెప్పింది ఒకటి? జరుగుతున్నది ఏమిటి? ఇలాగైతే రాజధాని ఎప్పుడూ పూర్తవుతుంది. ఇలాంటి ప్రకటనలు చేయడమంటే ప్రజలను మోసం చేయడం కాదా?’ అని వైసీపీ అధికారిక ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేశారు.