ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయం పేరును వైఎస్ఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయంగా మార్చిన అంశంపై ఇంకా విమర్శలు, ప్రతివిమర్శలు కొనసాగుతూనే ఉన్నాయి. ఎన్టీఆర్ పేరును తొలగించడంపై టీడీపీ నేతలు చేసిన విమర్శలకు వైఎస్ఆర్ సీపీ లీడర్లు దీటైన కౌంటర్లు ఇస్తూనే ఉన్నారు. తాజాగా మంత్రులు చెల్లుబోయిన వేణుగోపాల క్రిష్ణ, జోగి రమేష్, కాకాణి గోవర్థన్, అంబటి రాంబాబు, ఆర్కే రోజా తదితరులు ట్విటర్ వేదికగా కౌంటర్లు వేశారు.
‘గత 27 ఏళ్లలో 14 సంవత్సరాలు సీఎం గా పని చేసిన చంద్రబాబు ఎందుకని ఏ ఒక్క జిల్లాకు ఎన్టీఆర్ పేరు పెట్టలేదు అన్న ప్రశ్న కు చంద్రబాబు, అతని కుటుంబ సభ్యులు ఏమి సమాధానం చెబుతారు?’
– ట్విటర్‌లో ఐ అండ్ పీఆర్ శాఖ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాల కృష్ణ
‘నాన్ టీడీపీ 8, వైయస్సార్‌గారు 3, జగన్‌గారు 17... ఇదీ ఏపీలో గవర్నమెంట్ మెడికల్ కాలేజీల లెక్క! ఆరోగ్యశ్రీ, 108, 104... ఇవన్నీ వైయస్‌ల మమకారంతో వచ్చినవే కదా? మరి వైయస్సార్ పేరెందుకు పెట్టకూడదు?’
– ట్విటర్‌లో రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి జోగి రమేష్
‘నటుడు నందమూరి బాలకృష్ణ ఎప్పుడో ఒకసారి వచ్చి డైలాగ్‌లు చెప్పి పోవడానికి ఇదేమైనా సినిమానా!. వైద్య రంగానికి విశేష సేవలు అందించిన వైయస్సార్ పేరు హెల్త్ యూనివర్సిటీకి పెట్టడం సమంజసం. ఇప్పటికే టీడీపీ బంగాళాఖాతంలో కలిసిపోయింది’
– ట్విటర్‌లో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాణి గోవర్థన్‌రెడ్డి
‘వయసు 73. అనుభవం 45. సీఎంగా 14. కుప్పంలో ఓటు లేదు. ఇల్లు కూడా లేదు. ఆయన పేరు చెబితే గుర్తుకు వచ్చే స్కీమూ లేదు!. వాటే పిటీ బాబూ..?’
– ట్విటర్‌లో రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి ఆర్.కె.రోజా
‘కష్టంలో తండ్రిపై ప్రేమ చూపని బాలయ్యా! నీకు సిగ్గు లేదయ్యా?’ – ట్విటర్‌లో రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు
అంతకుముందు నారా లోకేశ్
నిన్న నారా లోకేశ్ ఘాటుగా స్పందిస్తూ.. అసలైన వెన్ను పోటు ఇదే అంటూ ఓ వీడియోను పోస్ట్ చేశారు. వైఎస్ఆర్ సీపీ నాయకులను పేటీఎం డాగ్స్ అంటూ ట్విటర్ లో సంబోధించారు. ఇదే నిజమైన వెన్నుపోటు అంటూ.. తండ్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డిని తనయుడు జగన్ అప్పట్లో ముద్దాయిని చేశారని ఆరోపించిన ఓ వీడియోను పోస్ట్ చేశారు. ఆ వీడియోలో అప్పటి కాంగ్రెస్ నేత ఉండవల్లి అరుణ కుమార్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. జగనే తండ్రి వైఎస్ఆర్ ను ప్రథమ ముద్దాయిగా నిలబెట్టారని ఆరోపణ చేశారు.
‘‘పేటీఎం డాగ్స్! దిస్ ఈజ్ రియల్ వెన్నుపోటు. సుప్రీంకోర్టు వరకు వెళ్లి అవినీతి కేసుల్లో వైఎస్సార్ ని ముద్దాయిని చేసింది దుర్మార్గపు కొడుకు జగన్ రెడ్డి. మీలా ఆధారాలు లేని ఆరోపణలు చెయ్యడం లేదు. పక్కా ఆధారాలతో బయటపెడుతున్నా. వైఎస్సార్ ని ప్రథమ ముద్దాయిని చేసింది అబ్బాయ్ జగన్ రెడ్డే.’’ అంటూ కౌంటర్ ఇచ్చారు.